Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
- అశ్రునయనాల మధ్య శ్రీనివాస్ అంతిమయాత్ర
నవతెలంగాణ - ఆలేరుటౌన్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ప్రజా పోరాటాల్లో తిరుగులేని వ్యక్తి, రజక సంఘం రాష్ట్ర కన్వీనర్ వడ్డేమాను శ్రీనువాసులు మృతి సీపీఐ(ఎం)కు తీరని లోటని కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో వడ్డేమాను శ్రీనువాసులు (55) గురువారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. శ్రీనివాసులు భౌతికకాయాన్ని చెరుపల్లి సీతారాములు సందర్శించి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీనివాసులు చిన్నప్పటి నుంచి వామపక్ష భావాలు కలిగిన వ్యక్తిగా, నిరంతరం ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసే నాయకుడిగా ఆలేరు ప్రాంతంలో గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. ఎక్కడ ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడినా తక్షణం అక్కడికెళ్లి పరిష్కరించేందుకు కృషి చేసేవారన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక సేవలు చేసిన వ్యక్తి వడ్డెమాను శ్రీనివాసు అని చెప్పారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడూ అధ్యయనం చేస్తూ పోరాటాలు నిర్వహించడంలో ముందుండేవారని తెలిపారు. ప్రధానంగా వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అధ్యయనం చేయడంలో మంచి అనుభవం కలిగిన వ్యక్తి అని కొనియాడారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ మాట్లాడుతూ.. పార్టీ చేసే ప్రజా ఉద్యమాల్లో శ్రీనువాసులు చురుకైన పాత్ర పోషించారని చెప్పారు. మంచి నాయకున్ని కోల్పోయామన్నారు. అనంతరం నిర్వహించిన అంత్యక్రియల్లో వారితోపాటు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మంగ నరసింహులు, ఆలేరు పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, మాజీ సింగిల్ విండో చైర్మెన్ మొరిగాడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.