Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కక్ష సాధింపులకు కాంగ్రెస్ భయపడదు
- గాంధీ, నెహ్రూలది దేశం కోసం త్యాగం చేసిన కుటుంబాలు
- రాంలీల మైదానంలో తేల్చుకుందాం రండి
- ఈడీ ఆఫీసు వద్ద ధర్నాలో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ అధ్యక్షులు సోనియాగాంధీకి నోటీలిచ్చి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రాక్షసానందం పొందుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ సర్కారు కక్ష సాధింపులకు కాంగ్రెస్ పార్టీ భయపడబోదని హెచ్చరించారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయడాన్ని కాంగ్రెస్ సహించబోదని చెప్పారు. 'మేమేందో, మీరేందో రండి...రాంలీలా మైదానంలో తేల్చుకుందామంటూ' బీజేపీకి సవాల్ విసిరారు. ఏఐసీసీ అధ్యక్షులు సోనియగాంధీని ఈడీ విచారణకు పిలువడాన్ని నిరసిస్తూ...దేశ వ్యాప్త నిరసనలో భాగంగా గురువారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయంవరకు కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. నల్లబెలూన్లు ఎగురవేశారు. అనంతరం ఈడీ ఆఫీస్ ముందు దీక్ష చేపట్టారు. ముగింపు సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మన దేశం శ్రీలంక లాగా ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు తమ పార్టీ పివి నరసింహారావును ప్రధాని చేసి దేశంలో ఆర్థిక సరళీకత విధానాలు తీసుకొచ్చారని తెలిపారు. సోనియా నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విద్యా హక్కు, సమాచార హక్కు, ఆహారభద్రత, ఉపాధిహామీ వంటి చట్టాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దోచుకున్న దొంగలను శిక్షించేందుకు సమాచార హక్కు చట్టం తెచ్చారనీ, ఆమెనే ప్రజల సొమ్మును దోచుకున్నట్టు అయితే ఈ చట్టం తెచ్చేవారా? అని ప్రశ్నించారు. దీపం పథకం తెచ్చి అడబిడ్డలను కట్టెలపోయి నుంచి విముక్తి కల్పించారని చెప్పారు. నాలుగు కోట్ల మంది ప్రజలు స్వతంత్రంగా బతకాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, ప్రజలకు ఆకాంక్షలను నెరవేర్చారని చెప్పారు. ఆత్మబలిదానాలు చూసి ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని చెప్పారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని ఏర్పరిచారంటూ మోడీ అవహేళన చేశారని చెప్పారు. పార్లమెంట్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్, జీఎస్టీ ధరలకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతుంటే, వాటిని పక్కదారి పట్టించేందుకే సోనియాను ఈడీ ఆఫీస్‌కు పిలిచారని విమర్శించారు. రాష్ట్రమిచ్చిన తల్లికి జెండాలు, ఎజెండాలు, మతాలు పక్కన పెట్టి అందరూ అండగా నిలబడాలని కోరారు. ఇది రాజకీయ పోరాటం కాదనీ, ఆత్మగౌరవ పోరాటమన్నారు. 135 ఏండ్ల క్రితం దేశానికి స్వాతంత్య్రం, స్వేచ్చనివ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని గుర్తు చేశారు. భాక్రానంగల్, నాగార్జునసాగర్, వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించిందని చెప్పారు. పాకిస్థాన్ మీద రెండుసార్లు యుద్ధం చేయడం ద్వారా ప్రపంచదేశాలకు భారత్ ప్రతాపమేంటో ఇందిరాగాంధీ చూపించారని తెలిపారు. రాజీవ్‌గాంధీ ప్రధాని అయి ప్రపంచ దేశాలకు భారత్ అభివృద్ధిని చూపించారని గుర్తు చేశారు. 18 ఏండ్లకే ఓటు హక్కును కల్పించారని చెప్పారు. రాజీవ్ హత్యానంతరం దేశం కోసం ప్రాణాలకు సిద్ధమంటూ సోనియా, రాహుల్‌గాంధీ పార్టీ బాధ్యతలు స్వీకరించారని చెప్పారు.
భారత్ జోడో యాత్రను బీజేపీ ఆపలేదు
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
కాంగ్రెస్ చేపట్టబోయే భారత్ జోడో యాత్రను ఈడీ నోటీసులు ఆపలేవని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈడీ, సీబీఐ, న్యాయ స్థానాలపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తప్పుడు విధానాలకు నిరసనగా దేశ వ్యాప్త నిరసనలు జరుగుతున్నాయని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ అంశానికి వారికి సంబంధం లేకపోయినా బీజేపీ సర్కారు కక్షపురితంగా వ్యవహరిస్తున్నదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులను తన స్నేహితులకు మోడీ ధారదత్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టనున్నట్టు తెలపారు. ఈ యాత్రను అడ్డుకునేందుకే ఈడీని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి,మధుయాష్కీ, మహేశ్వర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మల్లురవి, కృష్ణతేజ, విజయారెడ్డి, మెట్టుసాయికుమార్తోపాటు పార్టీ అనుబంధాల సంఘాల రాష్ట్ర చైర్మెన్లు పాల్గొన్నారు.