Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోదారి మేటలతో దుర్గంధంగా పాఠశాలలు
- బియ్యం, సామగ్రి, పుస్తకాలు.. అన్నీ నీటిమయం
- రికార్డులు, రిజిస్టర్ల నుంచి పాములు
- 79 గ్రామాల్లో 58 పాఠశాలలు ముంపునకు గురి
భద్రాద్రి ఏజెన్సీ పాఠశాలల నుంచి కె.శ్రీనివాసరెడ్డి
గోదారి ఉధృతికి పాఠశాలలు చెల్లాచెదురయ్యాయి. కరోనా కారణంగా రెండేండ్లుగా అరకొర విద్యాబోధన కొనసాగింది. ఈ ఏడాది సకాలంలో విద్యా సంవత్సరం మొదలైందని అనుకుంటుండగానే గోదావరి విరుచుకుపడింది. ఈ వరదల కారణంగా భద్రాద్రి ఏజెన్సీలో దాదాపు పదిరోజులుగా పాఠశాలలు మూతబడ్డాయి. కొన్ని పాఠశాలలు ముంపునకు గురికాగా మరికొన్నింటిలో పునరావాస కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వరదలు పునరావృతం కాకుండా ఉంటే చదువులు పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభం కావాలంటే ఇంకా పదిరోజుల వరకూ పట్టొచ్చు. కాగా, ముంపు నుంచి బయటపడ్డ స్కూల్స్‌లో అధికారులు పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. పుస్తకాలు నీటిలో నానాయి. వాటిని బయటకు తీస్తుంటే విష కీటకాలు, సర్పాలు బయటకొస్తున్నాయి. ముంపునకు గురైన పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ సందర్శించి నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు. వరద ప్రాంతాల్లో ముంపునకు గురైన పాఠశాలలను నవతెలంగాణ బృందం పరిశీలించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 79 గ్రామాలు ముంపునకు గురికాగా దీనిలో 58 పాఠశాలల్లోకి నీరు చేరింది. పినపాక, దుమ్ముగూడెం, భద్రాచలం, ఆశ్వాపురం, చర్ల, బూర్గంపాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముంపు నుంచి బయటపడ్డాక పాఠశాలల్లో భారీగా ఇసుక, ఒండ్రు మేటలు వేసి ఉంది. పాఠ్యపుస్తకాలు, స్కూల్ రికార్డులు, హాజరుపట్టికలు, కొందరు పిల్లలు స్కూల్లోనే ఉంచివెళ్లిన పుస్తకాలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం, బోధనా సామగ్రి, స్కూల్ ఫర్నీచర్.. ఇలా అన్నీ నీటిలోనే నానాయి. కొన్ని రికార్డులు వరద నీటిలో కొట్టుకుపోగా.. మిగిలిన వాటిలో బయటకు తీసినా పనికిరాని వాటిని వదిలేసి మిగతా వాటిని ఆరబెడుతున్నారు. పినపాక మండలంలో మొత్తం 64 పాఠశాలలు ఉండగా ఐదు పాఠశాలలు పూర్తిగా నీటమునిగాయి. యూపీఎస్ చింతలబయ్యారం, బయ్యారం ప్రాథమిక పాఠశాల, రావిగూడెం బీసీ కాలనీ పీఎస్, జడ్పీఎస్ఎస్ ఏడూళ్లబయ్యారం, భూపతిరావుపేట ప్రాథమికోన్నత పాఠశాలలు పూర్తిగా నీటిపాలయ్యాయి. నలుగురు టీచర్లు, 76 మంది విద్యార్థులున్న చింతలబయ్యారం పాఠశాలలో విద్యార్థుల బుక్స్, బియ్యం, గ్రంథాలయంలోని పుస్తకాలు, వెయిట్ మిషన్, ఫ్యాన్, రికార్డులు నీటిపాలయ్యాయి. ఈ పాఠశాలకు రూ.2 లక్షల వరకూ నష్టం వాటిల్లింది. 14 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు ఉన్న రావిగూడెం ప్రాథమిక పాఠశాలదీ ఇదే పరిస్థితి. మిగతా స్కూల్స్‌లోనూ నష్టం బాగానే ఉంది. భద్రాచలంలోని సుభాష్‌నగర్, కొత్తకాలనీ, ఏఎంఎసీ కాలనీలోని పాఠశాలలు నీటిపాలై బురద మేటలు వేసింది.
చర్ల మండలంలోని కొత్తపల్లి కాలనీ, దండుపేట, జీడిపల్లి, చింతలకుంట, కల్లంగుంపు తదితర ప్రాంతాల్లోని పాఠశాలల్లోనూ ఒండ్రు చేరింది. అశ్వాపురం మండలంలో పాఠశాల ముగిసి ఉపాధ్యాయులు వెళ్లిపోయినా కూడా విద్యార్థులు పుస్తకాలు ఆరబెట్టుకుంటూనే ఉన్నారు. నష్టాలు అంచనా వేస్తున్నాం.. సోమశేఖరశర్మ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారిల ముంపునకు గురైన పాఠశాలలను సందర్శించి నష్టాలు అంచనా వేస్తున్నాం. ఆయా ప్రాంతాల నుంచి సిబ్బంది సమాచారం పంపుతున్నారు. వరదలకు పాడైపోయిన పాఠ్యపుస్తకాలు, దుస్తుల స్థానంలో కొత్తవి ఇస్తాం. తడిసిపోయిన బియ్యాన్ని ఉపయోగించొద్దు. మంచి బియ్యం పంపిస్తాం. పాఠశాలలో ఏయే సామగ్రి దెబ్బతిన్నదో పరిశీలిస్తున్నాం.
ఏడూళ్లబయ్యారం బడి పిల్లలకు ఏడుపే మిగిలింది..
ఈ చిత్రం పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలవి. ఈ పాఠశాల గ్రంథాలయంలోని సుమారు వెయ్యి పుస్తకాలు తడిసిముద్దయ్యాయి. ఆటవస్తువులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్ పరికరాలు, మొత్తం 14 గదుల్లో ఉన్న సామగ్రి, బెంచీలు, బల్లలు ఇలా అన్ని గోదావరి నీరు, ఒండ్రు పాలయ్యాయి. మొత్తం 8 మంది ఉపాధ్యాయులు, 190 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలకు వరదల కారణంగా రూ.3 నుంచి 4 లక్షల వరకూ నష్టం వాటిల్లింది. వారం రోజుల కిందట వరద ముంపునకు గురైనప్పటి దృశ్యాలు, ప్రస్తుత పరిస్థితులను ఇక్కడ చూడవచ్చు.