Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లపై నుంచి పారుతున్న చెరువుల నీరు
- ఇండ్లలోకి చేరిన వరద నీరు
- తొర్రూర్‌లో వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు
- దంతాలపల్లి మండలంలో 20 సెం.మీ.పైగా వర్షం
- గ్రేటర్ హైదరాబాద్‌లోనూ భారీ వర్షం
నవతెలంగాణ- విలేకరులు
మళ్లీ ముసురు మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచి కొన్ని జిల్లాల్లో భారీ వర్షం.. మరికొన్నిచోట్ల మోస్తారు వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లల్లోకి వరద నీరు చేరింది. గత వారం భారీ వర్షాలకే లోతట్టు గ్రామాలన్నీ వరదతో నిండి.. ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. ఈ వర్షంతో పరిస్థితి మళ్లీ ప్రమాదం ముంచుకొచ్చింది. గ్రామాల్లోనూ మోకాళ్లోతు నీరు చేరింది. చెరువులు నిండి నీరు రహదారులపై నుంచి పెద్దఎత్తున ప్రవహిస్తుండటంతో రాకపోకలు బంద్ అయ్యాయి.
జనగామ ఆర్టీసీ చౌరస్తా నుంచి హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలో రవి నర్సింగ్ హౌమ్, జికేస్ ఫర్టిలైజర్ వరకు రోడ్లు వరదతో నిండాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతోనే నీరు రోడ్లపై పారుతోంది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రం మొత్తం చెరువును తలపించింది. పెద్ద చెరువు మత్తడి పోయడంతో వరద ఉధృతి పెరిగింది. దీంతో మండల కేంద్రం నుంచి వంతడుపల గ్రామానికి వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొమ్ములవంచ గ్రామం పాత చెరువు పొంగి పొర్లుతుండటంతో కొమ్ములవంచ నుంచి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్సీ కాలనీ హరిజనవాడలోకి వర్షపు నీరు ఇండ్లల్లోకి చేరింది. తొర్రూర్ నుంచి నర్సింహులపేటకు వస్తున్న ఆర్యభట్ట పాఠశాల బస్సు కొమ్ములవంచ కొత్తచెరువు అలుగు వద్ద చిక్కుకుపోయింది. కొత్త చెరువు నీరు రోడ్డుపై పెద్దఎత్తున ప్రవహిస్తుండటంతో స్కూల్ బస్సు రోడ్డుపై నుంచి జారు కిందికి దిగింది. స్థానికులు వెంటనే విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసి ఇండ్లకు పంపించారు.
మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, మోడల్ పాఠశాలలోని దూర ప్రాంత విద్యార్థులకు స్థానిక ఎస్ఐ మంగలాల్ వాహనాలను ఏర్పాటు చేసి సిబ్బంది వెంట పంపి వారి ఇండ్లకు చేర్చారు. తొర్రూర్ మండలంలోని వెలికట్ట గ్రామంలో కొమ్ము మహేందర్, కొమ్ము అనిల్ ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. వారి తల్లిదండ్రులు గతంలో మృతిచెందారు. వారికి ఆధారంగా ఉన్న ఇల్లు ఇప్పుడు వర్షానికి నీటమునిగింది. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు. కంటాయపాలెం తొర్రూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తొర్రూరు గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపై వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగు దాటడానికి సాహసం చేయొద్దని తహసీల్దార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలో 10సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. దంతాలపల్లి మండలంలో తుర్పుతండ గ్రామ పంచాయతీకి చెందిన గుగులోతు ఈశ్వర్ ఇల్లు మొత్తం నీుట మునిగింది. ఈ మండలంలో 20 సెం.మీ.పైగా వర్షపాతం నమోదైంది.
హఫీజ్‌పేటలో 10.30 సెం.మీ వర్షపాతం
గ్రేటర్ హైదరాబాద్‌లో మళ్లీ శనివారం భారీ వర్షం కురిసింది. హఫీజ్‌పేటలో 10.30సెం.మీ. వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు నిలిచాయి. చంచల్‌గూడ జైలు నుంచి సంతోష్‌నగర్ వరకు స్టీల్ బ్రిడ్జి పనుల కోసం రోడ్డును తవ్వడంతోపాటు పిల్లర్లు వేస్తున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో మామూలు సమయంలోనే ఇబ్బందిగా ఉండగా.. వర్షం వచ్చినప్పుడు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంతోష్‌నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. అంబర్పేట్ నుంచి ఉప్పల్ వరకు, ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వరకు అదే పరిస్థితి. జగద్గిరిగుట్టలోని ఆస్బెస్టాస్ కాలనీలో రోడ్డుపై భారీగా నీరు నిలిచింది. ముషీరాబాద్, రాంనగర్లో రోడ్లపై భారీగా నీరు చేరింది. బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్, వడ్డెర బస్తీల్లోని ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటల పాటు 3 షిఫ్ట్‌లలో పని చేసే విధంగా సిబ్బందిని నియమించారు. కంట్రోల్ రూమ్ ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మైజీహెచ్ఎంసీయాప్, టెలిఫోన్ నెంబర్ 040-21111111, ట్విట్టర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయి అధికారులకు పంపించి పరిష్కారం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండజిల్లాలో ఉదయం 10గంటల నుంచే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 3గంటలపాటు వర్షం కురిసింది. మరికొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. సూర్యాపేట జిల్లాలో రెండు గంటలపాటు వర్షం కురిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం వచ్చింది.