Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టాలున్నా రెవెన్యూ, పోలీసు అధికారుల ఓవరాక్షన్
- అడ్డుకున్న బాధితులు.. పరిస్థితి ఉద్రిక్తం
- అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం
- పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలి : సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో/బంజారాహిల్స్
ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టిన పేదలపై అధికారులు ఓవరాక్షన్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.45లోని అంబేద్కర్‌నగర్‌లో ప్రభుత్వం ఇచ్చిన పట్టాల ప్రకారం పేదలు నిర్మిస్తున్న ఇండ్లను రెవెన్యూ అధికారులు, పోలీసులు శుక్రవారం కూల్చేశారు. ప్రభుత్వం ఇండ్లివ్వదు.. గుడిసెలు వేసుకోనివ్వదా? అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతకు వచ్చిన అధికారులను, పోలీసులను, స్థానిక కార్పొరేటర్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాధితులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సీపీఐ(ఎం), కాంగ్రెస్ నాయకులు బాసటగా నిలిచారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
అంబేద్కర్‌నగర్‌లో పేదలు 30 ఏండ్లుగా గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకూ ఇవ్వలేదు. దాంతో అక్కడి ప్రభుత్వ స్థలంలోనే పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వలేకపోవడంతో 58 జీవో ప్రకారం అక్కడి పేదలకు 40 గజాల స్థలం చొప్పున పట్టాలు అందజేసింది.
ప్రభుత్వం ఇచ్చిన పట్టాల ప్రకారం గుడిసెల స్థానంలో 20 మంది ఇండ్లను నిర్మించుకునేందుకు పనులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన షేక్‌పేట్ తహసీల్దార్ శుక్రవారం ఉదయం ఆరు గంటలకు పోలీస్ బలగాలతో అంబేద్కర్‌నగర్ వెళ్లి పేదలు నిర్మించుకుంటున్న బేస్మెంట్ లెవల్ గోడలను కూల్చేయించారు. బాధితులు, స్థానికులు అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది. మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, కొంత మంది తమను కొట్టారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందడంతో సీపీఐ(ఎం), కాంగ్రెస్, బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. సీపీఐ(ఎం) ఖైరతాబాద్ జోన్ కార్యదర్శి జి.కిరణ్, కాంగ్రెస్ నేతలు విజయారెడ్డి, రోహిన్‌రెడ్డి, బీజేపీ నేతలు గౌతమ్‌రావు ఘటనా స్థలంలో వర్షంలోనే బైటాయించారు. పట్టాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఇక్కడికి వచ్చిన రెవెన్యూ అధికారులకు పోలీసులు వత్తాసు పలుకుతూ ఓవరాక్షన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన కార్పొరేటర్ వెంకటేష్‌ను బాధితులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంకటేష్‌ను అక్కడి నుంచి పంపించారు.
అధికారులపై దానం ఆగ్రహం
ఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ రెవెన్యూ, పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులకు తెలియకుండా పేదల ఇండ్లను కూల్చేయడం సమంజసం కాదన్నారు. కూల్చివేతల విషయంపై తనకు, ఆర్డీఓకు సమాచారం లేదన్నారు. స్థానిక తహసీల్దార్ అత్యుత్సాహం ప్రదర్శించారని, ఇలాంటి చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. పేదల కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే.. ఇలాంటి పనులతో సర్కార్‌కు చెడ్డపేరు తీసుకు రాకూడదన్నారు. జీఓ నెం.58 ప్రకారం పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఏడాది కాలంలో పక్కా ఇండ్లను నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చారు.
పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలి
సీపీఐ(ఎం) ఖైరతాబాద్ జోన్ కార్యదర్శి జి.కిరణ్
రోజువారీ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న పేదల ఇండ్లను కూల్చడం దారుణం. అదే స్థలంలో పేదలకు పక్కా ఇండ్లను నిర్మించి ఇవ్వాలి. అర్హులైనవారికి డబుల్ ఇండ్లు ఇవ్వాలి. పేదల ఇండ్లను తొలగించకుండా రక్షణ కల్పించాలి.
పేదలకు అన్యాయం చేస్తున్నారు
ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. పేద ప్రజలకు ఇచ్చిన స్థలాలను అధికార పార్టీ నాయకులు కబ్జా చేయడం క్షమించరాని నేరమన్నారు. పేదలకు ఇండ్లను ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇండ్లను నిర్మించుకోవడానికి ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తే వాటిని ఆక్రమణకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్నారు.