Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర ఆందోళనలో భద్రాచలం వాసులు
- ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపితే భద్రత
నవతెలంగాణ-భద్రాచలం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భద్రాద్రి క్షేత్రం పోలవరం ప్రాజెక్టుతో జల సమాధిగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు మాటలే విన్న స్థానికులు, అది నిజమేనని వారం రోజుల కిందట వచ్చిన జలప్రళయం రుజువు చేసింది. భద్రాచలం ఏజెన్సీ పెద్ద ఎత్తున నీటి ముంపునకు లోనైంది. రామాలయం చుట్టూ వరద చేరింది. దాంతో ఒక్కసారిగా స్థానికుల్లో అలజడి, ఆందోళన మొదలైంది. ఇదెక్కడి ఖర్మరా అంటూ... తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. భద్రాచలం గోదావరి నీటిమట్టం 71.30 అడుగులు రావటం, 1986 తర్వాత ఇదే పెద్ద వరద కావటం స్థానికులను ఉక్కిరిబిక్కిరికి లోను చేస్తోంది.
పోలవరం బ్యాక్ వాటర్‌తో ఈసారి భద్రాచలం ఏజెన్సీ వరద ముంపునకు గురి కావలసి వచ్చిందనేది యథార్ధమే. పోలవరం పూర్తిస్థాయిలోనే కట్టకముందే ఇటువంటి పరిస్థితి తలెత్తితే.. ఇక ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం మన్యం పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తుతో భద్రాచలం ఏజెన్సీకి ముప్పు ఉందని, ఆంధ్రాలో కలిసిన భద్రాచలం ఐదు గ్రామపంచాయతీలు తెలంగాణలోకి తీసుకొస్తే భద్రాద్రి ముంపు నుంచి కాపాడుకోవచ్చని మంత్రి పువ్వాడ అజరు కుమార్ హైదరాబాదులో మంగళవారం పాత్రికేయ సమావేశంలో వ్యాఖ్యానించగా, ఆంధ్ర మంత్రులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. హైదరాబాద్‌ను ఆంధ్రకి ఇస్తారా.. తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతారా అంటూ.. మీడియాలో దుమ్మెత్తి పోశారు. ఇది భావద్రేకాల సమస్య కాదని, లక్షలాదిమంది అస్తిత్వ మనుగడ అని పాలకులు గుర్తించుకోవాలని భద్రాద్రి వాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రత్యామ్నాయం ఆలోచించాలని, మనుషులను దృష్టిలో పెట్టుకొని చర్చించాలని స్థానికులు కోరుతున్నారు. రెచ్చగొట్టే రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాలని భద్రాచలం ఏజెన్సీ ప్రజలు కోరుకుంటున్నారు.
సీపీఐ(ఎం) ఆనాడే చెప్పింది
పోలవరం ప్రాజెక్ట్ అంశం వెలుగు చూసినప్పుడే సీపీఐ(ఎం) ఆనాడే ఈ ప్రాజెక్టుపై స్పష్టమైన అవగాహనకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముంపు లేకుండా డిజైన్ చేయాలని కోరింది. పోలవరం ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ఎక్కువ నష్టం కలిగించే ప్రాజెక్టు కాబట్టి డిజైన్ మార్చాలని డిమాండ్ చేసింది. పోలవరం ఎత్తు తగ్గించాలని, తద్వారా ముంపు తగ్గుతుందని 2004 నుంచి 2007 వరకు సీపీఐ(ఎం) మొదటి దశ ఉద్యమాన్ని చేపట్టింది. సీపీఐ(ఎం) ఉద్యమకారులపై 2007 జనవరి 29న భద్రాచలంలో పోలీసులు కాల్పులు కూడా పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో అనేకమంది ఉద్యమకారులు గాయపడ్డారు. 78 మందిపై కేసులు పెట్టి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారు. నేటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రాష్ట్రం విడిపోయాక మరోసారి పోరుబాట పట్టింది. కేంద్రంలో ఆనాడున్న బీజేపీ ప్రభుత్వం భద్రాచలం పట్టణం తప్ప మిగిలిన ఏడు మండలాలు ఆంధ్ర పరిధిలోకి తీసుకెళ్లింది. ఆంధ్రాలో కెళ్ళిన ఏడు మండలాల ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. భద్రాచలం మండలంలో ఉన్న ఐదు గ్రామపంచాయతీలనైన ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు ఏపీలో విలీనం చేయగా ప్రజలు మాత్రం తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అలా చేస్తేనే తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలుగుతాయని అక్కడే ప్రజలు నినదిస్తున్నారు. పార్టీల ప్రయోజనం కంటే.. ప్రజా ప్రయోజనాలకే పెద్ద పీట వేయాలని సీపీఐ(ఎం) ఈ విషయంలో కూడా గట్టిగానే చెప్పింది.
తెలంగాణలోనే ఉంటామంటున్న ఐదు విలీన పంచాయతీలు
రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపిన సరిహద్దులోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తూ గతంలోనే తీర్మానాలూ చేశారు. ఈ గ్రామ పంచాయతీలు తెలంగాణకు వస్తే ఇక్కడ సరిహద్దు సమస్యలు కొంతవరకు తొలిగే అవకాశం లేకపోలేదు. భద్రాచలం పట్టణంను ముంపుకు గురికాకుండా కాపాడాలంటే ఆంధ్రాలోని నెల్లిపాక, దుమ్ముగూడెం వరకు కరకట్టను పొడిగించడంతో పాటు ఎత్తునూ పెంచాల్సి ఉంది. ఈ ఐదు పంచాయతీలను తెలంగాణలోకి తీసుకువస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు సావధానంగా ఆలోచించాల్సి ఉంది. అంతేకాదు, సీఎం కేసీఆర్ మరింత చొరవ తీసుకొని ఐదు గ్రామ పంచాయతీల విషయం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాల్సి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు, బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏడు ముంపు మండలాల విషయంపై కూడా పునరాలోచి చేయాల్సి ఉంది. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర, తెలంగాణలో నాలుగు లక్షలకు పైగా పోలవరం నిర్వాసితుల బాధితులపై కూడా కేంద్రం పునరాలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది.
బీజేపీ సమస్య పరిష్కారానికి తక్షణమే పూనుకోవాలి : మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామపంచాయతీలను తక్షణమే తెలంగాణలోకి తీసుకురావాలి. అప్పుడే భద్రాచలంకు భవిష్యత్తు ఉంటుంది. ప్రధాని మోడీ ప్రధాన బాధ్యత తీసుకోవాలి. ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులను కూర్చోబెట్టి సమన్వయం చేసి ఆ ఐదు పంచాయతీల వ్యవహారం తక్షణమే తేల్చాలి. పోలవరం ఎత్తు తగ్గించి, భద్రాచలం వద్ద కరకట్ట ఎత్తు పెంచి, కరకట్టను పొడిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
పార్లమెంటులో బిల్లు పెట్టాలి : పి. వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే
భద్రాచలంకు చెందిన ఆ ఐదు గ్రామపంచాయతీలు మళ్లీ భద్రాచలంకే తీసుకురావాలి. ఇదే విషయాన్ని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ విన్నవించాను. సీఎం పార్లమెంట్లో బిల్లు పెట్టేలా చర్య తీసుకోవాలి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఈ విషయంపై చర్చించాలి. తక్షణమే సమస్య పరిష్కారానికి పూనుకొని భద్రాచలాన్ని కాపాడాలి. ముంపు విభజనలోనే తప్పు జరిగింది... డాక్టర్ తెల్లం వెంకట్రావు, టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్
ముంపు విభజనలోనే ఆనాడు భద్రాచలంకు అన్యాయం చేశారు. అక్కడే తప్పు జరిగిపోయింది. ఇకనైనా ఆ ఐదు గ్రామపంచాయతీలను భద్రాచలంలో కలపాల్సిందే. అప్పుడే భద్రాచలం అభివృద్ధి సాధ్యమవుతుంది.