Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుక్కెడు నీరు దొరకని ఈ ప్రాంతానికి భగీరథ నీరందించాం
- డెబ్బై ఏండ్లలో చేయని అభివృద్ధి.. ఎనిమిదేండ్లలో చేసి చూపించాం
- బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-కంగ్టి
తాగడానికి కూడా గుక్కెడు నీరులేని కంగ్టి మండలానికి మిషన్ భగీరథ ద్వారా.. ఇక్కడున్న ప్రతి తండాకూ నీరందించామని, కనివిని ఎరుగని రీతిలో త్వరలోనే కాళేశ్వరం నీళ్లనూ తీసుకువస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండలంలో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి శుక్రవారం పలు అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఖేడ్ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డెభ్భై ఏండ్లలో చేయని అభివృద్ధిని కేసీఆర్ నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి చేసి చూపించారన్నారు. ఖేడ్ నుంచి కంగ్టికి, కంగ్టి నుంచి పిట్లంకు రెండు లైన్లరోడ్డు నిర్మించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు వారి సంపద, పదవులను కాపాడుకోవడానికి చూపిన శ్రద్ధ అభివృద్ధిపై చూపలేదన్నారు. ఖేడ్ ప్రాంతంలో ప్రతి గిరిజన తండాకు రోడ్లు, కరెంటు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. డబుల్ ఇంజన్ అని గొప్పలు చెప్పుకునే బీజేపీ.. పక్క రాష్ట్రం కర్నాటకలో తెలంగాణ తరహాలో ఏ ఒక్క పథకమైనా అమలు చేస్తుందో చెప్పాలన్నారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, పెన్షన్లు, కేసీఆర్ కిట్ లాంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుంటే.. ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన బిడ్డలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఈ ప్రాంత గిరిజనులు వలసలు వెళ్లేటప్పుడు తమ బడిపిల్లలనూ వారివెంట తీసుకెళ్లేవారని, ఇప్పుడు ఇక్కడే హాస్టల్లో చదువుకుంటున్నారని చెప్పారు. చౌకన్పల్లి నుంచి జీర్గి తాండాకు రూ.30 లక్షలతో బీటీరోడ్డు నిర్మించామన్నారు. దెగుల్‌వాడి నుంచి రాంసింగ్ తాండాకు రూ.60లక్షలతో రోడ్డు మంజూరు చేశామన్నారు. కంగ్టి నుంచి బీంర నాగూర్ మీదుగా కర్నాటక బార్డర్ వరకు డబుల్ లైన్ రోడ్డు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలన్ని నెరవేర్చామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీ రెడ్డి, కంగ్టి జెడ్పీటీసీ లలిత, కోట ఆంజనేయులు, ఎంపీపి సంగీత వెంకట్ రెడ్డి, గురుకుల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.