Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-కల్చరల్
'కోటి రత్నాల వీణ-నా తెలంగాణ' అని నినదించిన దాశరథి తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక అని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.. ఆ స్ఫూర్తితో, ఆ వొరవడిలోనే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ వారికేనని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమాన్ని నడిపారని గుర్తు చేశారు. దాశరథి స్ఫూర్తితో ఆయన వెన్నంటి తమ కలాలతో బాసటగా నిలిచిన వేణు సంకోజు లాంటివారిని కూడా కేసీఆర్ విస్మరించరని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతితో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఒక సిరా చుక్క లక్షమెదళ్లను కదిలిస్తుందన్నది దాశరథి వంటి కవులు నిరూపించారని చెప్పారు. దాశరథి పురస్కారాన్ని అందుకొంటున్న వేణు సంకోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో కవిగా క్రియాశీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. అనాథలు, అన్నార్తులు లేని సమాజాన్ని దాశరథి కాంక్షించారని, కవులు సాహితీవేత్తలు అలాంటి తెలంగాణ సమాజ పునర్నిర్మాణం కోసం కలాలు ఎక్కు పెట్టాలని కోరారు. వేణు కవిగా రచయితగా తన రచనలతో ఉత్తేజం నింపారని కొనియాడారు. అనంతరం వేణు సంకోజును సత్కరించారు. రూ.100,116తోపాటు జ్ఞాపికను అందజేశారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణ, దాశరథికుమారుడు లక్ష్మణ్, సాంస్కృతికశాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.