Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
- బాలాపూర్ తహసీల్ ఎదుట బాధిత రైతుల ధర్నా
నవతెలంగాణ-బడంగ్పేట్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం, బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్ 119/613లోని భూమిలో 70 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ(ఎం) బాలాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీసు ఎదుట రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రైతులకు పట్టాబుక్కులు ఇచ్చి వారి భూములకు రక్షణ కల్పించాలని, కబ్జాల బారి నుంచి పాడాలని కోరారు. గత ఎన్నికల సమయంలో భూమిలేని నిరుపేదల కుటుంబాలకు మూడెకరాల ప్రభుత్వ భూమి ఇస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారని, అధికారంలోకి వచ్చాక హామీ అమలు చేయడం లేదని గుర్తు చేశారు. నాదర్గుల్ పరిధిలో పేద రైతులు 70 ఏండ్లుగా సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారికి భూ యాజమాన్య హక్కు కల్పించాలని కోరారు. రైతులు సాగు చేసుకుంటున్న భూమిలో కబ్జాలకు పాల్పడుతున్న గూండాలు గోల్డ్ స్టోన్ ప్రసాద్, కరీమోద్దీన్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీలింగ్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) బాలాపూర్ మండల కార్యదర్శి ఎం.యాదయ్య, సభ్యులు దాసరిబాబు, రైతులు చెర్ల శ్రీనివాసులు, శశిపాల్, కర్రె నగేష్, కర్రె యాదయ్య, నీలమ్మ, ప్రవీణ్, రమేష్, సుభద్ర, చిర్ర శ్రీనివాస్, స్వరూప, లింగమ్మ, రైతు కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.