Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి
- సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
- వర్షంలోనూ తరలొచ్చిన పేదలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలను అందించడంలో విఫలమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం), సీఐటీయూ, డీవైఎఫ్ఐ, ఐద్వా, పట్నం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం సుందరయ్య పార్క్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పేదలు పెద్దఎత్తున తరలి వచ్చి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం దరఖాస్తులను ఆర్డీఓ కార్యాలయంలోని డీఏఓ రాధకు అందజేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక డబుల్బెడ్రూం ఇండ్లు, ఇంటిస్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులందించడంలో విఫలమైందని విమర్శించారు. ఇంటి స్థలం ఉంటే రూ.మూడు లక్షల ఆర్థికసాయం చేస్తామని చెప్పి ఎనిమిదేండ్లు గడుస్తున్నా అమలు చేయడం లేదని చెప్పారు. కోట్లాది రూపాయలు వెచ్చించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించినా వాటిని పేదలకు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. మిర్యాలగూడ పట్టణ శివారులో 560 ఇండ్లు నిర్మించారని, మూడేండ్లుగా వృథాగా ఉన్నాయని వాపోయారు. అక్కడ వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి పేద ప్రజలకు పంచాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు పంచుతామని హెచ్చరించారు. మూడేండ్లుగా కొత్త పెన్షన్లు లేక వితంతువులు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు డా.మల్లు గౌతమ్‌రెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడవత్ రవినాయక్, టూటౌన్ కార్యదర్శి భావండ్ల పాండు, ఐద్వా జిల్లా అధ్యక్షులు పోలేబోయిన వరలక్ష్మీ, నాయకులు రాగిరెడ్డి మంగారెడ్డి, పరుశరాములు, అయ్యూబ్, ఎండి.అంజద్, పాదూరి గోవర్థన, దేశీరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.