Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడుల్లో సదుపాయాలపై హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో ప్రభుత్వం, విద్యా శాఖ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై తమకు సమగ్ర నివేదికను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని గిరిజన జిల్లాలు కోమరం భీం అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నిజామాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం వసతులు లేవంటూ ఒక ఆంగ్ల పత్రికలో విశ్లేషణాత్మక కథనం ప్రచురితమైంది. ఆ కథనం ఆధారంగా హైదరాబాద్ నగరంలో న్యాయ విద్య అభ్యసిస్తున్న బి.అభిరామ్ రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఆయన తరఫున ప్రముఖ న్యాయవాది టి. స్వేచ్ఛ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జన్ భుయాన్, సూరేపల్లి నందాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిల్‌ను విచారించింది. గత పదేండ్ల నుంచి ఒక గుడిసెలో స్కూళ్ళను నడుపుతున్న దుస్థితి చాలా గిరిజన ప్రాంతాల్లో ఉందనే విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఆయా పాఠశాలల్లో బాలికలకు కనీసం బాత్రూం వసతి కూడా లేవని పిటిషనర్ తన పిల్లో పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో కనీసంగా వసతులు మంచి నీరు, పరిశుభ్రమైన తరగతి గది, బాత్రూంలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందంటూ న్యాయవాది స్వేచ్ఛ తెలిపారు. వీటిని ఏర్పాటు చేయకుంటే విద్యా హక్కు చట్టం, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టేనని నివేదించారు. కాగా, ఇటువంటి అంశంపై భారత సర్వోన్నత న్యాయస్థానంలో పదేండ్ల క్రితమే విచారణ జరిగిందని... ఆయా అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకునే విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే, ప్రభుత్వ స్కూళ్ళలో మౌలిక వసతుల కల్పన చాలా ముఖ్యమైన అంశమంటూ ద్విసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేసింది. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బడుల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకోవాలని కోర్టు ఆకాంక్షిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 23 నాటికి స్థానికంగా కల్పిస్తున్న వసతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ న్యాయస్థానం ప్రభుత్వం, విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించింది. ఆ తర్వాతే విచారణ చేపడుతామని వ్యాఖ్యానించింది.