Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు హక్కుల్లేక ఇబ్బందులు
- 'పోడు గోడు తీరాలంటే?' అంశంపై జరిగిన చర్చలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజనులకు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉందనీ, పోడు సాగు దారులకు హక్కుపత్రాలు ఇవ్వకుండా సర్కారు ఇబ్బందులకు గురిచేస్తున్నదని పలువురు వక్తలు విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లో లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో 'పోడు గోడు తీరాలంటే..?' అనే అంశంపై ప్రముఖ భూ చట్టాల న్యాయ నిపుణులు భూమి సునీల్ అధ్యక్షతన భూమి సంవాద్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో గిరిజన పరిశోధనా సంస్థ రిటైర్డ్ డైరెక్టర్ విస్వికె శాస్త్రీ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తెలంగాణ తహసీల్దార వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చిరెడ్డి, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, దళిత బహుజన ఫ్రంట్ శంకర్, గిరిజన సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు జీవన్,అభిలాష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ ఉత్పత్తులు, పోడు సాగుపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు గుర్తింపు లేకపోవటంతో వారు తరతరాలుగా అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే 2006లో కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని రూపొందించిందని గుర్తుచేశారు. పోడు సాగుతోపాటు అడవులపై గిరిజనులకు ఉన్న అన్ని రకాల వ్యక్తిగత, సామూహిక హక్కులను గుర్తించి హక్కు పత్రాలివ్వాలని ఆ చట్టం నిర్దేశించిందని తెలిపారు.
అది అమల్లోకి వచ్చిన 2008 సంవత్సరం నుంచి 2022 మార్చి వరకు రాష్ట్రంలో 97,434 మందికి 3,19,916 ఎకరాల అటవీ భూమిపై హక్కు పత్రాలు ఇచ్చారని చెప్పారు. ఆయా పత్రాలు ఇచ్చినప్పటికీ..సాగు చేసుకునేందు కు అటవీ అధికారులను అడ్డంకులు తొలగలేదని తెలిపారు. కొందరికి హక్కు పత్రాలు ఇచ్చినా స్వాధీనంలో పూర్తి విస్తీర్ణానికి రాలేదన్నారు. పది ఎకరాలకు మించకుండా 2005 డిసెంబర్13నాటికి వాస్తవ సాగులో ఉన్న పూర్తి విస్తీర్ణానికి హక్కు పత్రాలు ఇవ్వాలని చట్టం చెప్పినప్పటికీ పాలకులు విస్మరించారని తెలిపారు. ఇటీవల తిరిగి మళ్లీ దరఖాస్తులకు అవకాశం ఇస్తే..13లక్షల ఎకరాలపై నాలుగు లక్షల మందికి పైగా హక్కుల కోసం దరఖాస్తులు చేసుకున్నార న్నారు. వీరిలో 2.3 లక్షల మంది గిరిజనులుం డగా..1.7లక్షల మంది గిరిజేతరులు ఉన్నారని తెలిపారు. అర్హులైన అందరికీ తక్షణం హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హక్కు పత్రాలు వచ్చిన వారి వివరాలను ధరణికి ఎక్కించాలనీ, వారికి సాగు సాయం అందించాలని సూచించారు.అటవీ గ్రామాలను రెవెన్యూ గ్రామాలు గా గుర్తించాలని డిమాండ్ చేశారు.