Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కో సఖికి నాలుగైదు గ్రామాల అనుసంధానం
- మొదట 2000 గ్రామాల్లో అమలు
- 424 మంది మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేజర్ గ్రామపంచాయతీల్లో కొన్నిచోట్ల తప్ప ఊర్లల్లో అసలు బ్యాంకులే ఉండవు. డబ్బు డిపాజిట్ చేయాలన్నా...డ్రా చేసుకోవాలన్నా మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో పరుగులు తీయాల్సిందే. పోనీకి గంట..బ్యాంకులో సేవల కోసం ఓ గంట..రానీకి గంట..ఇలా దూరాన్ని బట్టి ఒక పూటనో, రోజుమొత్తమో పనిని కోల్పోవాల్సిందే. సొంతవాహనమైతే పెట్రోల్ ఖర్చులు, లేకుంటే బస్సు, ఆటోచార్జీలు భరించాల్సిందే. ఇప్పటిదాకా జరుగుతున్న తీరిది. దీని నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు బ్యాంకు సఖిలను తీసుకొచ్చింది. దీంతో భవిష్యత్‌లో ఊరూరా బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ప్రజల కష్టాలు తీరనున్నాయి. సెర్ప్ పర్యవేక్షణలో బ్యాంకు సఖిలు పనిచేయనున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం బ్యాంకింగ్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు లేవు. ప్రత్యేకంగా గిరిజన, కొండ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల కోసం పదుల కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి ఉంది. రాష్ట్రంలో 4,30, 376 స్వయం సహాయక సంఘా ల్లోని 46, 23, 135 మంది సభ్యులు జమచేసే పొదుపులు, అప్పుల చెల్లింపులు నెలవారీగా క్రమం తప్పకుండా బ్యాంకుల ద్వారా చేస్తున్నారు. ప్రతి నెలా బ్యాంకులకు వెళ్లడానికి వారికి సమయం, ప్రయాణ వృథా అవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పుట్టుకొచ్చినవి బ్యాంకు సఖిలు. కేవలం మహిళా సంఘాలకే వాటి సేవలను పరిమితం చేయకుండా రైతులకు, పింఛన్‌దారులకు, ప్రజలకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దీంతో ప్రతి గ్రామస్తుడు బ్యాంకు సఖి ద్వారానే తమ ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. మొదట ప్రయోగాత్మకంగా 2 వేల గ్రామాలకు వీటి సేవలు అందేలా చూడనున్నది. అందులో భాగంగా రాష్ట్రంలోని మహిళా సంఘాల్లో చురుకుగా ఉండే పట్టభద్రులు, గిరిజన ప్రాంతాల్లోనైతే కనీసం ఇంటర్ చదివి ఉన్నవారిలో 430 మందిని గుర్తించి వారికి వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. వీరికి ఐఐబీఎఫ్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్) సర్టిఫికేషన్ పరీక్ష నిర్వహించింది. వీరిలో 424 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏ బ్యాంకులో పనిచేయాలన్నా ఈ పరీక్ష ఉత్తీర్ణత సాధించడం అత్యావశ్యకం. ఉత్తీర్ణత సాధించిన వారంతా బ్యాంక్ సఖిలో విధులు నిర్వహించడానికి అర్హులయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంకింగ్ సేవలు అందించే తొలి దశగా సీఎస్సీ(కామన్ సర్వీస్ సెంటర్)తో అనుసంధానం చేసి ప్రతి బ్యాంకు సఖికి ఒక మొబైల్ ఇచ్చారు.
బ్యాంకు సఖి ద్వారా కలిగే లాభాలు
'బ్యాంకు సఖి' ద్వారా నిరుపేద మహిళలకు స్వయం ఉపాధి కలిగే అవకాశం ఉంది. ఆ బ్యాంకు ద్వారా అందించే సేవలపై బ్యాంకులు కొంత మేర వారికి కమిషన్ ఇవ్వనున్నాయి. దీంతో వీరు ప్రతి నెలా రూ.15 వేల నుంచి 30 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. బ్యాంకు సఖిలకు సేవా రుసుం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలతో పాటు ప్రభుత్వ పథకాలలో పేర్లు నమోదు చేయించుకోవడం, కరెంటు బిల్లు, ఇతర బిల్లులు చెల్లించే అవకాశం కూడా ఉంది. ప్రయాణాల కోసం టికెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆధార్ నమోదు, ఎడిట్ ఆప్షన్లను కూడా గ్రామ సఖిలకు ఇచ్చారు. దీంతో ఆధార్‌లో తప్పుల సవరణకు జిల్లా, మండల కేంద్రాల చుట్టూ తిరిగే బాధ తగ్గే అవకాశముంది. పాన్‌కార్డు, గ్యాస్ కనెక్షన్లకు దరఖాస్తులు చేసుకునే వెసులుబాటున్నది. దీంతో పాటు పింఛన్లు, రైతుబంధు డబ్బులు కూడా ఈ బ్యాంకు సఖిల ద్వారా తీసుకునే వెసులుబాటును రాష్ట్ర సర్కారు కల్పించనున్నది. మినీ ఏటీఎమ్‌లను కూడా వారి పర్యవేక్షణలో ఉంచనున్నది. ప్రస్తుతం ఒక్కో లావాదేవీ ద్వారా రూ.10 వేల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వ ం దీన్ని రూ.50 వేల వరకు పెంచే అవకాశం ఉంది. అంటే గ్రామీణులు బ్యాంకు సేవల కోసం మండల, జిల్లా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన, లైన్లు కట్టాల్సిన అవసరం ఉండదు. బ్యాంకు సఖిలు 365 రోజులు నిరంతరాయంగా పనిచేయనున్నాయి. దీంతో నిరంతరం సేవలు అందుబాటులో ఉండనున్నాయి