Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద తగ్గినా ఇండ్లకు వెళ్లలేని దుస్థితి
- ఎటు చూసినా బురద, చెత్తా చెదారమే
- ముందు చూపులేకనే విపత్తు
- పక్కా ఇండ్లు నిర్మించాలి : మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ-వెంకటాపురం
గోదావరి ఉగ్రరూపంతో ఏజన్సీ అతలాకుతలమైందని, వరద దెబ్బకు అనేక ఊర్లు రూపురేఖలు కోల్పోయి ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాయని మాజీ ఎంపీ మిడియం బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి వరద ముంపు ప్రాంతాలైన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఎదిర, సూరవీడు, బోదాపురం, ఆలుబాక, మొర్రు వాణిగుడెం, రామచంద్రాపురం, పాత్రాపురం, టేకులబోరు తదితర గ్రామాల్లో శుక్రవారం మాజీ ఎంపీ మిడియం బాబురావు నాయకత్వంలో సీపీఐ(ఎం) బృందం పర్యటించింది. ముంపు నష్టం వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అటవీశాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన గ్రామాలు.. గ్రామాల్లో వరద విపత్తు మిగిల్చిన ఆనవాళ్లుతో భయంకరంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో ఎవరిని కదిలించినా వారి కళ్లల్లో కన్నీరు కనిపిస్తుందన్నారు. గోదావరి వరదలపై ప్రభుత్వానికి ముందు చూపులేని కారణంగానే భారీ నష్టం వాటిల్లిందని విమర్శించారు. వెంకటాపురం మండలంలో 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ మండల కేంద్రానికే స్థానిక అధికారులు పరిమితమయ్యారని, మిగిలిన కేంద్రాలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాల్లో సుమారు 1500 మందికి పైగా పునరావాసం కల్పించామని చెబుతున్నప్పటికీ సర్వేల్లో మాత్రం 188 ఇండ్లు మాత్రమే నీట మునిగాయని నివేదికలు ఇవ్వడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుందన్నారు. గోదావరి వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేలు పరిహారం సరిపోదని, రూ. ఒక లక్ష వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాల్లో ఇండ్లు మునిగిపోతున్న గ్రామాలను గుర్తించి ఎత్తైన ప్రాంతాల్లో ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఎతైన ప్రాంతాల్లో కాదని ప్రజలకు అనువైన ప్రాంతాల్లో పక్కా గృహలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఇండ్లనిర్మాణాల కొరకు రూ.3 లక్షలు అందజేస్తే లబ్దిదారులే నిర్మించుకుంటారన్నారు. బాధితుల పక్షాన సీపీఐ(ఎం) నిలబడుతుందని వారికి న్యాయం జరిగేవరకు పోరాటాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్రకమిటీ సభ్యులు మచ్చావెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బ్యాక్ వాటర్‌తో భద్రాచలం, ములుగు జిల్లాల్లోని కొన్ని మండలాలు నీటమునిగే ప్రమాదం ఉందన్నారు. ఈ ప్రమాదాల నివారణకు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రప్రభుత్వానికి ఉందని స్పష్టంచేశారు. భద్రాచలంలో కరకట్ట ఎత్తు పెంచడంతో బాటు ఏటూరునాగారం వరకు ముంపు ప్రాంతాలను గుర్తించి కరకట్టనిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అనంతరం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బోదాపురంలో గ్రామంలోని 200 కుటుంబాలకు మాజీ సర్పంచ్ రౌతు నర్సింహరావు కూరగాయలను అందించగా, గోదావరి వరద ప్రాంతాలకు చెందిన కుటుంబాలకు మాజీ ఎంపీ మిడియం బాబురావు అందజేశారు. సమావేశంలో ములుగు జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, ములుగు, భద్రాద్రి జిల్లా నాయకులు, సాంబశివ, కె. బ్రహ్మచారి, మండల కార్యధర్శి కుమ్మరి శ్రీను, నాయకులు ఆదినారాయణ, కట్ల చారి, పర్శిక రాంబాబు, మాజీ జడ్పీటీసీ వంకా రాములు, తులసి, విజయ్, సత్యం, నాగేశ్వరరావు, రౌతునర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.