Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులెవరూ హెడ్ క్వార్టర్స్‌ను వదిలిపోవద్దు...
- వరదలపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశాలు
- గోదావరికి మళ్లీ భారీగా వరదంటూ హెచ్చరిక
- ప్రాణనష్టం జరగొద్దు
- ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఉంచొద్దని సూచన
- అనవసర ప్రయాణాలొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి
- స్వీయ రక్షణ చర్యలు పాటించాలంటూ సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను కాపాడుకోవటానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ఇది పరీక్షా సమయమని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందువల్ల ఉన్నతాధికారులు, అధికారులెవ్వరూ హెడ్ క్వార్టర్స్ (హైదరాబాద్, జిల్లా కేంద్రాలు)ను విడిచి వెళ్లొద్దంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో ఒక్కరు కూడా మరణించకూడదనీ, ప్రాణనష్టం జరక్కూడదని ఆయన సూచించారు. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదలు సంభవించే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అందుకనుగుణంగా సమాయత్తమై ఉండాలంటూ సీఎం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అనవసర ప్రయాణాలను మానుకుని, స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎం కేసిఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన జన్మస్థానమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి సము ద్రంలో కలిసే ప్రాంతం వరకు సందులేకుండా గోదావరి తనది ఉధృతంగా ప్రవహిస్తున్నదని తెలిపారు. అందువల్ల ఎమర్జెన్సీ సేవలందించే శాఖలతో పాటు, ఇతర శాఖల అధికారులు హెడ్ క్వార్టర్స్ విడిచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దని ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం మధ్యా హ్నం నుంచే గోదావరి ఉధృతంగా మారే ప్రమా దముందని సీఎం తెలిపారు. ఆ నది పరీవా హక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతి నిధులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని శాఖల సిబ్బంది, అధికారులతో ఎప్పటి కప్పుడు సమన్వ యం చేసుకుంటూ వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. ముంపు సమస్య ఉన్న రామన్నగూడెం, ఏటూరు నాగారం, భధ్రాచలం పరిసర ప్రాంతాల్లో పకడ్బం దీ చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు.
రెండు హెలికాప్టర్లను సిద్ధం చేయండి...
రాష్ట్ర రాజధానిలో అప్రమత్తంగా ఉండే హెలికాప్టర్‌కు అదనంగా మరో రెండు హెలికాప్టర్లను రప్పించాలని సీఎం ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ములుగు, కొత్తగూడెంలో వాటిని సిద్ధంగా ఉంచాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సహా వరద సహాయక బందాలను అందుబాటులో ఉంచాలంటూ విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు.
ప్రాజెక్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ
గోదావరికి సంబంధించిన ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు. వచ్చిన వరదను వచ్చినట్టే ప్రాజెక్టుల గేట్లను ఎత్తి కిందికి విడుదల చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని ఆపొద్దని సూచించారు. ఈ మేరకు అన్ని ప్రాజెక్టుల ఉన్నతాధికారులకు తక్షణ ఆదేశాలు జారీచేయాలని సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌ను ఆయన ఆదేశించారు. డిండి, పాకాల, వైరా, పాలేరు రిజర్వాయర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే తాగునీరు ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలనీ, అందుకనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని ఈఎన్సీ కృపాకర్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. వైద్య, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్అండ్బి, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సంసిద్దంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. ఎస్ఐ, సీఐలతో పాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ డీజీపీని ఆదేశించారు.
ఫ్లడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ పరిశీలన
వరదలను ముందస్తుగా అంచనా వేసేందుకు వీలుగా నీటి పారుదల శాఖ ప్రత్యేకంగా రూపొం దించిన 'ఫ్లడ్ ఫోర్ కాస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్'ను సీఎం ఈ సందర్భంగా పరిశీలించారు. భారీ వర్షాల వల్ల గంట గంటకు మారుతున్న గోదావరి నదీ ప్రవాహాన్ని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసి విశ్లేషించే విధానాన్ని రజత్ కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని సిఎం అన్నారు.
హైద్రాబాద్ పరిస్థితిపై సిఎం ఆరా..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరద నీటి కాల్వల పరిస్థితితోపాటు జల్పెల్లి, ఫిర్జాదీగూడ, తదితర ముంపు ప్రమాదమున్న చెరువుల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. భద్రాచలం వరద ముంపు ప్రాంతాల్లో వైద్యాధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని కితాబిచ్చారు. ఆరోగ్యశాఖ సంచాలకుడు సహా ఇతర అధికారులను అభినందించారు. డెంగ్యూ ప్రతి ఐదేండ్లకోసారి వస్తోందనీ, ఇలాంటి వ్యాధులను ముందస్తుగానే గుర్తించి, తగు చర్యలు తీసుకుని అరికట్టాలని వైద్య శాఖ మంత్రిని, అధికారులను ఆదేశించారు. శని,ఆదివారాలు సెలవు అనే పేరిట అని మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ తది తర శాఖల అధికారులు అలసత్వంగా వ్యవహరిం చవద్దంటూ కోరారు. వానలు, వరదల కారణం గా కొట్టుకుపోతున్న రోడ్లను, రవాణా వ్యవస్థను ఎప్పటికప్పుడు పునరుద్ధరించాలని ఆర్అండ్బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు. వరద ముంపునకు లోనుకాకుండా రాష్ట్రంలోని సబ్ స్టేషన్ల కాంటూర్ లెవల్స్‌ను రికార్డు చేసు కోవాలని ఎస్పీడీసీఎల్ ఎమ్డీ రఘమారెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 కెవి సబ్ స్టేషన్ల సమాచారాన్ని సేకరించాలని ఆయన సూచించారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ దామోదరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.