Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీకట్లో మగ్గుతున్న వలస కుటుంబాలు
- చినిగిన బస్తాలు, ఫ్లెక్సీల డేరాలే ఆదరువు
- నగరం నడిఒడ్డున కాటేదాన్ చౌరస్తాలో దుర్భర జీవనం
- తలదాచుకోవడానికి గూడు కరువు
- పెద్దలతోపాటే పనుల్లో పిల్లలు
- ఆధునిక యుగంలో అర్థంకాని బతుకులు
సాంకేతిక పరిజ్ఞానంతో మహానగరం విశ్వవ్యాప్తంగా పేరుగాంచింది. దేశంలోనే మెట్రో పాలిటిసిటీలో రెండో స్థానంలో నిలిచింది. కానీ నాణానికి బొమ్మ.. బొరుసు ఉన్నట్టే ఇంత పెద్ద నగరంలో ఎలాంటి సౌకర్యాలకూ నోచుకోని అభాగ్యులు ఎంతో మంది. వారిలో రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో నివసిస్తున్న సంచార జాతుల జీవనం దుర్భరం. కనీస సౌకర్యాలైన విద్య, వైద్యం, కూడు, గూడుకు నోచుకోని స్థితి వాళ్లది. చినిగిన బస్తాలు, ఫ్లెక్ల్సీలతో డేరాలు ఏర్పాటు చేసుకుని బతుకుతున్నారు. నగరాన్ని నమ్ముకుని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి గుడిసెల్లో చీకట్లో మగ్గుతూ తమతోపాటు పిల్లల బంగారు భవిష్యత్‌ను కోల్పోతున్న సంచార జాతుల జీవన స్థితిగతులపై కథనం.
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ కాటేదాన్ చౌరస్తాలో సుమారు 100 సంచార జాతుల కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరంతా బతుకుదెరువు కోసం 20 ఏండ్ల కింద వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. బాహ్య ప్రపంచానికి, వీరికి.. భూమికి, ఆకాశానికి మధ్య ఉన్న తేడా ఉంది. పిల్లజెల్లలతో పొద్దున రోడ్డెక్కితే ఎవరికి తోసిన పని వారు చేస్తే వచ్చే డబ్బుతో రాత్రి భోజనం కోసం బియ్యం తెచ్చుకుంటారు. దాహం వేస్తే గొంతు తడుపుకోవడానికి కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి. అక్కడక్కడా రాజకీయ నాయకులు ప్రచారం కోసం కట్టుకున్న బ్యానర్లు తెచ్చుకుని డేరాలు వేసుకున్నారు. గాలివాన వస్తే అవి ఎగిరిపోయే పరిస్థితి.
ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ జీవనం సాగిస్తున్న సంచార జాతుల వారికి ఏ ఒక్క సంక్షేమ పథకమూ అందడం లేదు. విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మిగిలాయి. ఒక్కో కుటుంబంలో సుమారు పది మంది ఉంటారు. వీరికి కుటుంబ నియంత్రణపై అవగాహన లేదు. ప్రతి కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు అంగవైకల్యంతో పుట్టడం గమనార్హం. తల్లులకు బలవర్థకమైన తిండి లేక పుట్టిన పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఆస్పత్రి అందుబాటులో లేకపోవడంతోపాటు ఎక్కడికి వెళ్లాలో చెప్పేవారూ లేక అనారోగ్యంతో సతమతమవుతూనే బతుకుబండి లాగిస్తున్నారు. ఇదిలా ఇక్కడ సుమారు 400 మంది బడీడు పిల్లలు ఉన్నారు. కానీ వీరెవ్వరూ బడికి పోవడం లేదు. చదువు పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ కుటుంబ పోషణ భారంమై వీరంతా తల్లిదండ్రులతో కలిసి భిక్షాటన, కాగితాలు ఎరుకోవడం, బొకేలు తయారు చేయడం వంటి పనులు చేస్తున్నారు.
సల్మాన్ కుటుంబం లక్నో నుంచి 20 ఏండ్ల కింద ఇక్కడికి వచ్చింది. ఇతనికి ఆరుగురు పిల్లలు. ఇద్దరు బిడ్డలు, నలుగురు కొడుకులు. ఇందులో ఇద్దరు అంధ వికలాంగులు. కరోనాకు ముందు సల్మాన్ రోడ్డు ప్రమాదంలో గాయ పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. అతనికి ప్రభుత్వ ఆస్పత్రులు ఎక్కడ ఉంటాయో తెలియక.. వైద్యం కూడా చేయించుకోలేదు. దీంతో ఇంటికే పరిమితమైయ్యాడు. సల్మాన్ భార్య ప్లాస్టిక్ పువ్వులు తెచ్చి.. చిన్న చిన్న బొకేలు తయారు చేస్తుంది. వాటిని అమ్మితే వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తోంది. బొకేలు అమ్మితే రోజుకు రూ.100 నుంచి రూ.200 వస్తే గగనమే. ఒక్కోరోజు తిండికి కూడా లేక పస్తులుంటున్నారు. ఇదే ప్రాంతంలో కాటాప్ప అనే వ్యక్తి 15 ఏండ్లుగా ఉంటున్నాడు.
ఇతనికి ఇద్దరు భార్యలు, 8 మంది సంతానం. వీరికి ఓటు హక్కు, ఆధార్ కార్డులు ఉన్నాయి. కానీ రేషన్ కార్డు లేదు. పొద్దంతా ఒళ్లు ఊనమయ్యేలా.. డోలివాయిస్తూ భిక్షాటన చేస్తారు. దీని ద్వారా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్, రోజు వారి జీవనంపై కాటాప్పను మాట్లాడించగా.. 'మేం బతకడమే కష్టం.. ఇంకా మాకు చదువు నేర్చుకునే అవకాశం ఏది.. మా తండ్రి మాకు ఇదే నేర్పించిండు.. మేము మా పిల్లలకు గీదే నేర్పిస్తున్నాం' అని వాపోయారు. ఇలా అక్కడ ఎవరిని పలకరించినా బరువెక్కిన గుండెలతో తమ గోడును వెల్లుబోసుకున్నారు.