Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ల ముట్టడి
- మంత్రి ఎర్రబెల్లి అడ్డగింత
- అరెస్టు చేసిన పోలీసులు
- 25 నుంచి నిరవధిక సమ్మె ప్రకటన
- వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి : తెలంగాణ వీఆర్ఏల జేఏసీ కోకన్వీనర్ వంగూరి రాములు
నవతెలంగాణ- విలేకరులు
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే పేస్కేల్ అమలు చేయాలి.. అంటూ శాంతియుతంగా నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేసిన వీఆర్ఏలు.. ప్రభుత్వం స్పందించకపోవడంతో శనివారం విలేజ్ రెవెన్యూ అసిస్టేంట్, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లను ముట్టడించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తమ పోరాటాన్ని కొనసాగించారు. పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లి కార్యాలయాల ఎదుట బైటాయించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంతో తోపులాట జరిగింది. సీఎం హామీని అమలు చేసేవరకు తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఉద్యోగ ప్రమోషన్స్‌కు జీవో విడదల చేయాలని డిమాండ్ చేశారు. 25వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి పోతున్నట్టు కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుటు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వివాదం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు సర్దిచెప్పడంతో వీఆర్ఏలు డీఆర్ఓ హరిప్రియను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వీఆర్ఏల జేఏసీ కోకన్వీనర్ వంగూరి రాములు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న వీఆర్ఏల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతోందన్నారు. వీఆర్ఏలను ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిలో 80 శాతం మంది బడుగు, బలహీన వర్గాలకు చెందినవారేనని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి కార్యక్రమంలో వీఆర్ఏల భాగస్వామ్యం ఉందన్నారు. కానీ వారి సంక్షేమ గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పేస్కేల్ అమలు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
జనగామ కలెక్టరేట్లో సమీక్షా సమావేశానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును వీఆర్ఏలు అడ్డుకున్నారు. వీఆర్ఏలు కలెక్టరేట్ ప్రధాన గేటు తోసుకుని లోపలికి చొచ్చుకుని వెళ్లారు. మంత్రి కారును వెంబడిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు వీఆర్ఏలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భూపాలపల్లిలో కలెక్టర్ భవేష్ మిశ్రాను వీఆర్ఏలు అడ్డుకోగా ఆయన వారిని సముదాయించారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వీఆర్ఏలను, సీఐటీయూ నాయకులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు వీఆర్వోలకు గాయాలయ్యారు. అరెస్టు అయిన వారిలో జేఏసీ జనరల్ సెక్రెటరీ ఆంజనేయులు తదితరులున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో వీఆర్ఏలు, వారికి మద్దతుగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి..వెంకటరామిరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం రాస్తారోకో నిర్వహించారు.
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. వీఆర్ఏలు అందరూ ఒక్కసారిగా కలెక్టరేట్ ముందుకు చొచ్చుకొచ్చి గేటు ముందు బైటాయించారు. పోలీసు వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో వీఆర్ఏల జేఏసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ లింగరాజు, చైర్మెన్ అజిజ్తో పాటు పలువురు వీఆర్ఏలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాతోపాటు ఉన్న వీఆర్ఏలు ఈరోజు స్కేల్ ఎంప్లాయిస్‌గా ఉద్యోగం చేస్తుంటే.. మేము మాత్రం ఇంకా వెట్టిచాకిరీ చేస్తూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు వెళుతున్నట్టు చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే.రమేష్ మద్దతు తెలిపారు. 25 నుంచి నిరవధిక సమ్మెకు వెళుతున్నట్టు కలక్టరేట్లో వినతి పత్రం అందజేశారు.
మంచిర్యాలలో వీఆర్ఏలు తమ కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టారు. వీఆర్ఏలు ఒంటిపై నినాదాలు రాసుకొని అర్ధనగంగా నిరసన తెలిపారు. పలు ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో టీఎన్జీఓ భవనం నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వరకు వచ్చి ముట్టడికి యత్నించారు. ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న వీఆర్ఏలను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌లో గొడుగులు పట్టుకొని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన వీఆర్ఏలను, కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరు వర్షం కురుస్తున్నా ఆందోళన కొనసాగించారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 25నుంచి సమ్మెబాట తప్పదని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేవీపీఎస్, సీఐటీయూ నాయకులు వారికి మద్దతు తెలిపారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు మాట్లాడుడూ.. వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి పేస్కేల్ అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు.