Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను రాచిరంపాన పెడుతున్న ఫారెస్టు అధికారులు
- వ్యవసాయ పనిముట్లను లాక్కెళ్లుతున్న వైనం
- రైతులపై అటవీ అధికారుల కేసులు
- 70 ఏండ్లుగా సాగులో ఉన్న రైతులకు అన్యాయం
- అన్నదాతలకు అండగా సీపీఐ(ఎం)
- ముఖం చాటేస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
రజాకార్లను ఎదిరించిన నేలది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరది. రాచకొండ చుట్టుపక్కల గ్రామాల్లో భూస్వాముల చెర నుంచి పేదలకు విముక్తి కల్పించిన గడ్డ రాచకొండ. తెగించి పోరాడిన నేలగా పేరుంది. రేచర్ల వంశస్తుల పాలనలో ఆ ప్రాంతం విరాజిల్లిందని చారిత్రాత్మక కట్డడాలు చాటి చెబుతున్నాయి. అంత ప్రసిద్ధిగాంచిన రాచకొండకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'రాచకొండ పోలీస్ కమిషనరేట్'ను ఏర్పాటుచేసింది. సీఎం కేసీఆర్ కూడా ఆ ప్రాంతపు గొప్పతనాన్ని ఎన్నోసార్లు చెప్పారు. ఆ ప్రాంతం పర్యటక కేంద్రంగా కూడా ఉన్నది. అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆ ప్రాంతం...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల ఆర్తనాదాలతో ప్రతిధ్వనిస్తున్నది.
గుడిగ రఘు
కన్నీళ్లు కారుస్తున్నది. అన్నదాతలు క్షోభకు గురవుతున్నారు. పచ్చని పొలాల్లో ఫారెస్టు అధికారుల వాహనాల మోత వినిపిస్తున్నది. గుంపులు, గుంపులుగా వచ్చి అడవి పందులు పంటలను నాశనం చేసినట్టుగా రైతులపై ఫారెస్టు అధికారులు దాడి చేస్తున్నారు. రిజర్వుఫారెస్టు పేరిట సాగు చేయకుండా వ్యవసాయ పని ముట్లను లాకెళ్లుతున్నారు. ట్రాక్లర్లు, జేసీబీలను తీసుకెళ్లి పోలీస్స్టేషన్లతో రోజుల తరబడి పెడుతున్నారు. రూ 40వేలు, రూ 50వేలు ఫైన్లు వేస్తున్నారు. అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. ఒంటరిగా ఉన్న రైతుల దగ్గర్నుంచి ఫారెస్టు అధికారులు సెల్ఫోన్లు గుంజుకుని, విసిరిపారేస్తూ... అరాచకాలు సృష్టిస్తున్నారు. భూమి దున్నకుండా అడ్డుపడుతూ రందీ పెడుతున్నారు. అక్కడి రైతులు 70 ఏండ్లుగా ఆ భూములపై ఆధారపడి బతుకుతున్నారు. కాయకష్టం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఎన్నడూ లేనిది అది రిజర్వు ఫారెస్టు భూములంటూ ఇప్పుడు అధికారులు నానా ఇబ్బందిపెడుతున్నారు.
అప్పుడు సాగు భూములు...
ఇప్పుడు ఆటవీ భూములా?
దేశానికి స్వాతంత్య్రం రాక ముందునుంచే రాచకొండ ప్రాంతం లో రైతులు బతుకుదెరువు కోసం కొండల కింది భాగంలోని భూములను సాగు చేసుకుంటున్నారు. 1956 నుంచి భూమి శిస్తులు కట్టించుకునేవారు. ఆ తర్వాత ఆయా ప్రభుత్వాలు వారికి కొన్ని హక్కులు కల్పించాయి. 1998లో
ఆ భూములకు సర్వేలు చేసి హద్దురాళ్లు పాతారు. 60, 70 ఏండ్ల నుంచి సాగులో ఉన్న రైతులకు హక్కులు కల్పించకుండా అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు కుట్ర చేస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత ఆ భూములు ధరణిలోనూ నమోదయ్యాయి. ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. కొంత మందికి కొత్త పాసుపుస్తకాలు వచ్చాయి. ఫారెస్టు అధికారులు రైతులకు నిమ్మలం లేకుండా చేస్తున్నారు. రాచిరంపాన పెడుతున్నారు. అధికారులు ఎక్కడి నుంచి వస్తారో, ఏ విధంగా రైతులపై దాడి చేస్తారో తెలియక రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. బాయిలకాడ గుడిసెలను సైతం తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారు.
మూడు జిల్లాల సంగమం...మూడువేల ఎకరాలు
రాచకొండ ప్రాంతం మూడు జిల్లాల సంగమంగా ఉన్నది. రంగారెడ్డి, భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో అది విస్తరించింది. దాదాపు మూడువేల ఎకరాలకుపైగా భూముల్లో రైతులు అనాదిగా సాగు చేసుకుంటున్నారు. తిప్పాయిగూడెం, ఆరుట్ల, తుంబాయి, రాచకొండ, కడీలబాయితండా, ఐదుతోవల తండా, ముచర్స్తాండ, సీసీ తాండ, పాలగుట్ట తాండ, నెళ్లంపాడు, ఎనగానితండా, నారాయణపురం తదితర గ్రామాల రైతులు ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్నారు. వరి, పత్తి పంటలతోపాటు కూరగాయలు పండిస్తున్నారు. కొత్తపేట, మదన్నపేట మార్కెట్లకు తెచ్చి అమ్ముకుంటారు. పాడి రైతులు తమ పాలను హైదరాబాద్ తెచ్చి అమ్ముకుని బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులను అక్కడి నుంచి వెళ్లగొట్టి ఆ భూముల్లో హరిత హారం కింద మొక్కలు పెంచేందుకు ప్రభుత్వం పెంచేందుకు ప్రయత్నిస్తున్నది.
పేదల వెన్నంటి సీపీఐ(ఎం)
ఈ క్రమంలో రైౖతులు, పేదల సీపీఐ(ఎం) వెన్నంటి ఉద్యమిస్తున్నది. నిక్కచ్చిగా రైతుల పక్షాన ఉండి పోరాడుతున్నది.ముడు జిల్లాల అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు ఎమ్మారో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలవద్ద రైతులను సమీకరించి ధర్నాలు చేపట్టింది. ముఖ్యంగా ఫారెస్టు అధికారుల ఆగడాలను వ్యతిరేకిస్తూ డీఎఫ్‌వో కార్యాలయాన్ని ముట్టడించింది. మరోవైపు రైతులపై అక్రమ కేసులు బనాయించిన సందర్భంగా న్యాయం పోరాటమూ చేస్తున్నది. బావుల వద్ద రైతులను పోలీసులు జీపులెక్కించుకుని స్టేషన్లలో బంధిస్తున్నారు.ఈ క్రమంలో ఆ పార్టీ అక్కడికెళ్లి రైతులను విడిపించడంతోపాటు పోలీసుల తీరును నిరసిస్తూ కార్యక్రమాలు కొనసాగిస్తున్నది. రైతులకు సీపీఐ(ఎం) అండదండలిస్తున్నప్పటికీ మిగతా పార్టీలు అటువైపు తొంగి చూడటం లేదని రైతులు చెబుతున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పెద్దగా స్పందించడం వారు వాపోతున్నారు. ఈసమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్‌తో మాట్లాడుతానంటూ చెబుతున్న ఆయన సీఎంను కలిసిందిలేదు. సమస్యను ఏ కొలిక్కి తెచ్చింది లేదంటున్నారు. మిగతా పార్టీల నాయకులు ఈ సమస్య పట్ల ముసలికన్నీరు కార్చుతున్నారు తప్ప రైతుల పక్షాన నిలబడటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవి రిజర్వుఫారెస్టు భూములు
'ఈ భూములు రిజర్వుఫారెస్టులో ఉన్నాయి. వాటిని దున్నుకోవడం సరైందికాదు. రైతు వద్ద ఏ రకమైన పట్టా ఉన్నా ఆ భూముల జోలికిమేం పోవడం లేదు. ఆ ఏరియాలో అడుగు పెట్టడం లేదు. ఎక్కడో పట్టాలు ఉంటే, ఇక్కడ దున్నుతున్నారు. కాబట్టి రైతులు వారి భూములు ఎక్కడా ఉన్నాయో రెవెన్యూ శాఖ ద్వారా తెలుసుకుని అక్కడికి పోవాలి. వారి భూములు చూపించడం మా పని కాదు. రిజర్వుఫారెస్టు భూములను అక్రమిస్తే సహించేది లేదు'.
- డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి
బాధలు పడలేకపోతున్నం
'మేం 50, 60 ఏండ్ల నుంచి భూమిని దున్నుకుని బతుకుతున్నాం. వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో బోర్లు వేయించారు. ఈభూములపై రుణం ఇచ్చారు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇచ్చారు. కరెంట్ స్థంభాలకు అనుమతిచ్చారు. కానీ తెలంగాణ వచ్చినాక ఇది ఫారెస్టు భూమి అని బెదిరిస్తున్నారు. మాట్లాడితే కొట్టి పోలీస్‌స్టేషన్‌కు తీసుకుపోతున్నారు. కేసులు పెడుతున్నరు. ట్రాక్టర్లు గుంజుకపోతున్నరు. అధికారులు పెడుతున్న బాధలను పడలేకపోతున్నం. మా భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలి. ప్రాణాలు పోయినా సరే ఈ భూములను వదులుకోం'
- నల్లబోతు యాదయ్య రైతు
ఉద్దేశపూర్వకంగానే రైతులను వెళ్లగొట్టే కుట్ర
'రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతులను ఇక్కడి భూముల నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నది. ఒకవైపు రైతులకు పట్టాలిస్తామని చెబుతున్న సర్కారు...మరోవైపు వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నది. గిరిజనులకు బతికే హక్కులేకుండా చేస్తున్నది. రైతులపై అక్రమ కలప స్మగ్లింగ్ కేసులు పెడుతున్నారు. కరెంట్ తొలగిస్తున్నారు. వారికి అండగా నిలబడుతున్న సీపీఐ(ఎం) నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినా పేదలకు పట్టాలిచ్చేదాక పోరాడుతాం'.
- పగడాల యాదయ్య, సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
దాడులు... కేసులు
ఎవుసం, ఎద్దులు, ఆవుల, గొర్రెలు, మేకలతో ఉండాల్సిన పంట పొలాల్లో ఇప్పుడు ఖాకీల బూట్ల చప్పుళ్లు వినపడుతున్నాయి. పోలీసు వాహనాల ధ్వనులతో రైతులు భయానక పరిస్థితులకు గురవుతున్నారు. చీమ చిటుకుమన్నా ఫారెస్టు అధికారులు వాలిపోతున్నారు. ట్రాక్టర్లు, నాగళ్లు, ఎత్తుకెళ్లుతున్నారు. ఎదురు తిరిగిన రైతులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నారు. బావులకు కరెంట్‌ను కట్ చేస్తున్నారు.
ట్రాన్స్ఫార్మర్లు నుంచి కరెంట్ సరఫరా కాకుండా నిలిపేస్తున్నారు. దీంతో పంటలు ఎండిపోయి పంట నష్టపోయిన సందర్భాలున్నాయి. ఆ భూముల నుంచి రైతులను వెళ్లగొట్టేందుకు ఎన్నోరకాలుగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో రైతులు నిత్యం చెప్పలేని బాధలు అనుభవిస్తున్నారు.