Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పునరుద్ధరించే పనిలో ఇంజినీర్లు
- విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడమే కారణం
- ఆరు జిల్లాలకు ఎఫెక్ట్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రమంతా అట్టుడుకుతున్నది. హడావిడి పెరిగింది. కొలాహలంగా మారింది. వరద, బురదతో ఒకింత చికాకు కూడా కలుగుతున్నది. జిల్లాల్లో పరిస్థితి దయనయమైంది. దాదాపు అన్నిచోట్లా వ్యవసాయపంటలు దెబ్బతిన్నాయి. ఇండ్లు కూలిపోయాయి. మరికొన్నిచోట్లా విద్యుత్స్థంబాలు దెబ్బతిన్నాయి. రోడ్లు కోతకు గురయ్యాయి. చెరువులు, కుంటలు, వాగులు పొర్లిపొంగుతున్నాయి. సాగుపొలాలన్నీ నీటితో నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఇదిలావుండగా చివరకు మిషన్‌భగీరథ తాగునీటి సరఫరాకు సైతం సమస్యలు ఉత్పన్నమయ్యాయి. చాలా చోట్ల పైపులు తెగడం, కొట్టుకుపోవడం, కరెంటు లేకపోవడం, ప్రెషర్ సరిగ్గా రాకపోవడంతో వేలాది గ్రామాల్లో భగీరథ తాగునీటి సరఫరా స్థంబించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4942 గ్రామాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఆరు జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. కొముర్రంబీమ్-ఆసిఫాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని వేలాది గ్రామాల్లో భగీరథ నీళ్లు ఇటీవలి భారీవర్షాలకు బంద్ అయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. జిల్లాల నుంచి రాష్ట్ర మిషన్‌భగీరథ కార్పొరేషన్ అధకారులకు అందిన సమాచారం ప్రకారం నీళ్లు రావడం లేదంటూ భారీగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. వీటిని యుద్ధప్రాతిపదికన మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులు పునరుద్ధరించేపనిలో ఉన్నట్టు సమాచారం. కొన్ని జిల్లాలో కల్వర్టులు, బ్రిడ్జీలు సైతం పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలిసింది. గత వారం రోజులుగా తాగునీటి వ్యవస్థను మళ్లీ యథాతథస్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులను వెంటనే చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. భగీరథ శాఖ ముఖ్యకార్యదర్శి స్మీతా సభర్వాల్, మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షలు చేశారు. వెంటనే తాగునీటిని అందించేందుకు వేగంగాచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధిక ప్రభావమున్న జిల్లాలకు ఒక్కో సీఈని ప్రత్యేకంగా నియమించి తాగునీటి వ్యవస్థను పునరుద్దరించే పనులు చేపట్టారు. ఇప్పటివరకు మొత్తం 4942 గ్రామాలకుగాను సుమారు 3600 గ్రామాల్లో తాగునీటి సరఫరాను కొలిక్కితెచ్చినట్టు సమాచారం. ప్రభావిత జిల్లాల్లో ఐదు గ్రామాలకు ఒక ప్రత్యేక బృందాన్ని పంపినట్టు భగీరథ అధికారులు చెప్పారు. ఆ బృందంలో ఒక కెమిస్ట్తోపాటు మరోక మైక్రోబయాలజిస్ట్ను ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వరదల మూలంగా భగీరథ నీరు కలుషితమైనట్టు తెలిసింది. ఆ సమస్యలు ఏర్పడిన గ్రామాల్లో వెంటనే నీళ్లకు పరీక్షలు చేస్తున్నారు. వాటిని భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లల్లో టెస్ట్ చేసి, సంతృప్తి చెందాకే సాధారణ ప్రజల తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నట్టు సమాచారం. నీళ్ల నాణ్యత దెబ్బతినకు ండా చర్యలు చేపడుతున్నారు. వర్షాలు పడ్డ తొలిరోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజులపాట్లు తాగునీరా నిలిచిపోయినట్టు జిల్లాల నుంచి సర్కారుకు నివేదికలు అందాయి. ఈ విషయమైన భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డిని వివరణ కోరగా 'భారీ వర్షాల నేపథ్యంలో వేలాది గ్రామాల్లో తాగునీరు కలుషితమైంది. పరీక్షలు చేశాకే సాధారణ ప్రజలకు నీటిని విడుదల చేస్తున్నాం. దాదాపు 4900 గ్రామాల్లో సమస్య వచ్చింది. రెండు, మూడు రోజుల్లోనే 3600 గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన తాగునీటిని పునరుద్దరించాం.పైపులైన్లకు పునరుద్దరించాం. మిగతా గ్రామాల్లో కూడా దాదాపు సమస్య లేకుండా చేశాం. అయితే వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం' ఇంకా ఉందని చెప్పారు.