Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హన్మకొండలో సోమవారం నుంచి మూడురోజులపాటు జరిగే తమ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన ఎజెండాగా చర్చించి నిర్దిష్ట కార్యాచరణ రూపొందిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. పోరాటాలే లక్ష్యంగా, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. వరద సాయం కింద కుటుంబానికి రూ.10 వేలు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారనీ, ఇది ఏమూలకు సరిపోవనీ, రూ.లక్ష చెల్లించాలని డిమాండ్ చేశారు. పోడు భూములు, ప్రాజెక్టులకు సంబంధించిన భూ నిర్వాసితులు, కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు, డబుల్బెడ్రూం ఇండ్లు, దళితబంధు, పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాల పంపిణీ, ధరల పెరుగుదల, సామాన్యులపై భారాలు, కార్మికులు, అసంఘటిత కార్మికులు, రైతులు, కూలీలు, వర్షాలు, వరదలు వంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర కమిటీలో చర్చించి భవిష్యత్ కారాచరణ రూపొందిస్తామని వివరించారు. జనం సమస్యలను అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు గాలికొదిలేశాయి. ఎన్నికలే కేంద్రంగా వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి. మార్చి లేదా ఏప్రిల్‌లో ముందస్తు ఎన్నికల వస్తాయన్న వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు. మహారాష్ట్ర శైలిలో రాష్ట్రంలోనూ షిండేలను సృష్టించి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాలు సోమవారం నుంచి మూడురోజులపాటు హన్మకొండలో నిర్వహించనున్న సందర్భాన్ని పురస్కరించుకుని నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు తమ్మినేని వీరభద్రం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
- జనాన్ని గాలికొదిలిన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ
- షిండేలను సృష్టించి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్ర
- 'పోడు'పై భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర
- ప్రజాసమస్యలే ప్రధాన ఎజెండా
- పోరాటాలే లక్ష్యంగా నిర్దిష్ట కార్యాచరణ
- నిర్మాణంపైనా దృష్టి కేంద్రీకరించి పార్టీని పటిష్టపరుస్తాం
- 26న హన్మకొండలో బహిరంగసభ
- రేపటినుంచి మూడురోజులపాటు రాష్ట్రకమిటీ సమావేశాలు
- ఏచూరి, రాఘవులు, విజయరాఘవన్ హాజరు
- నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
రాష్ట్రంలో పోడు సాగుదార్ల సమస్య మళ్లీ జఠిలంగా మారింది. ఆదివాసీలపై పోలీసులు, అటవీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. ఈ సమస్యపై ఏం చేయబోతున్నారు?
పోడు భూముల సమస్యపై రాష్ట్రంలో దీర్ఘకాలిక ఆందోళన జరుగుతున్నది. అన్ని గిరిజన సంఘాలు, అఖిలపక్షం పోరాటాల పలితంగా సీఎం కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చినా దాన్ని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇటీవల ఈ సమస్యపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం రాష్ట్రంలో అమలు జరగకపోవడానికి కేంద్రం అనుసరిస్తున్న విధానమే కారణమన్నారు. 2018 వరకు ఆక్రమణలో ఉన్న అందరికీ పట్టాలివ్వాలనీ, గిరిజనేతరులకు పట్టాలివ్వా లనీ, ఈ రెండు సవరణలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వమే పూనుకోవాలని కేటీఆర్ అన్నారు. ఆ పని కేంద్రం చేయడం లేదన్నారు. ఆయన కుట్ర బుద్ధికి ఇది తార్కాణంగా ఉన్నది. ఆ సవరణల కోసం టీఆర్ఎస్ ప్రయత్నించడం లేదు. పైగా 2005 వరకు సాగులో ఉన్న వారికి పట్టాలిచ్చే పనిని నిలివేయడం సరైంది కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నది. 2018 దాకా సాగులో ఉన్న వారికి పట్టాలిచ్చే చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీలపై దాడులెందుకు జరుగుతున్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆపొచ్చు కదా?. అందువల్ల పోడు సమస్యపై నిర్దిష్ట కార్యాచరణ రూపొందిస్తాం. భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు పోడు రైతులతో సుదీర్ఘ పాదయాత్ర చేపడతాం. రాష్ట్ర కమిటీలో సాధ్యాసాధ్యాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
రాష్ట్రానికే తలమానికం అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌజ్‌లోకి నీళ్లు రావడమేంటీ?
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పిన గొప్పలన్నీ ఈ ఘటనతో కుప్పకూలిపోయాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాస్తవాలను వెల్లడించాలి. అక్కడ జరిగిన లోపం, భవిష్యత్తులో ఆ ప్రాజెక్టు నాణ్యత గురించి వివరించాలి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వరదలు, బాధితులకు సాయం గురించి చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటనష్టం ఎంత జరిగిందంటారు. మీ పార్టీ అధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించండి?.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అధికార యంత్రాంగం బాగానే కృషి చేసింది. అయితే మారుమూల ప్రాంతాల్లో వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోలేదు. భద్రాచలం డివిజన్లో చర్ల మండలంలో కొత్తపల్లిలో బాధితులను పట్టించుకోలేదు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భద్రాచలంలో పెద్దఎత్తున బాధితులకు అండగా సహాయ కార్యక్రమాలు నిర్వహించాం. మంచిర్యాల, గోదావరి పరివాహక జిల్లాల్లో పార్టీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించాం. వీటిని సమీక్షిస్తాం. ప్రభుత్వం ప్రకటించిన కుటుంబానికి రూ.10 వేలు తక్షణం ఏమాత్రం సరిపోదు. రూ.లక్ష ఇవ్వాలి. వరద నష్టాన్ని పూర్తిగా అంచనా వేయాలి. వీటిపై చర్చించి నిర్దిష్ట కార్యాచరణ రూపొందిస్తాం.
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా జక్కలొద్ది వంటి ప్రాంతాల్లో పోరాటాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అణచివేత ధోరణిని అవలంబిస్తున్నది. దీనిపై మీ కార్యాచరణ ఏంటీ?
ఇటీవల ఇండ్లు, ఇండ్ల స్థలాల ఆక్రమణ సమస్య తీవ్రంగా ఉన్నది. వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వందలాది ఎకరాల్లో పేదలు భూమిని ఆక్రమించి గుడిసెలు వేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దారుణమైన నిర్బంధకాడను వారిపై ప్రయోగించింది. ఖమ్మం, మంచిర్యాలతోపాటు ఇంకా కొన్ని జిల్లాల్లో పోడు భూములు, భూనిర్వాసితుల పోరాటాలు జరిగాయి. వాటిని సమీక్షిస్తాం. రాబోయే కాలంలో ఈ పోరాటాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తాం.
ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు మోపుతున్నాయి. దీనిపై ఏమంటారు?
దేశంలో, రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం వల్లే దేశంలో ద్రబ్యోల్బణం పెరిగిందనీ, అందుకే ధరలు పెరుగుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. అది పూర్తిగా కారణం కాదు. చైనాలో రెండు శాతానికి మించి ద్రవ్యోల్బణం పెరగలేదు. ఆ దేశంపై యుద్ధం ప్రభావం ఎందుకు పడలేదో బీజేపీనే చెప్పాలి. ద్రవ్యోల్బణంపై ప్రభావం పడకుండా కేంద్రంలోని బీజేపీ చర్యలు తీసుకోవాలి. కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస, నిత్యావసర వస్తువుల ధరలను తగ్దించేందుకు చర్యలు చేపట్టాలి. వాటిపై సెస్‌ను తగ్గించాలి. దీనిపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
హన్మకొండలో సోమవారం నుంచి మూడు రోజులపాటు జరిగే సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటీ? ఏయే సమస్యలను చర్చించబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు?
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహిస్తున్నాం. సోమవారం నుంచి మూడురోజులపాటు హన్మకొండలో రాష్ట్రకమిటీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎ విజయరాఘవన్ హాజరవుతారు. ఈనెల 26న సాయంత్రం నాలుగు గంటలకు హన్మకొండలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలి. ఈ సమావేశాల్లో పోడు భూమి, కార్మికులు, అసంఘటిత కార్మికులు, బీడీ కార్మికులు, రవాణా కార్మికులు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై చర్చిస్తాం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కనీస వేతనాలను సవరించలేదు. సాంస్కృతిక, సామాజిక రంగాల్లో కులవివక్ష, కులదురహంకార హత్యలు, మహిళలపై ఆకృత్యాలు, లైంగికదాడులు, వికలాంగులు, కౌలురైతుల సమస్యలపై చర్చిస్తాం. ధరణిలో అక్రమాలు, వృత్తిదారులు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించడంలో ఆలస్యం వంటి అంశాలపై నిర్దిష్టంగా చర్చించి జిల్లాలు, ప్రజాసంఘాల వారీగా కార్యాచరణ రూపొందిస్తాం. పార్టీ అఖిల భారత మహాసభల్లో నిర్మాణ కర్తవ్యాలకు అనుగుణంగా రాష్ట్రానికి అన్వయించి పార్టీని పటిష్టపరచడానికి కృషి చేస్తాం.