Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు ఒకటిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు : రైతు, వ్యకాస, సీఐటీయూ కమిటీల పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ కార్మికుల కోసం 'కనీస వేతనాల చట్టం' తేవాలని తెలంగాణ రైతుసంఘం, వ్యవసాయకార్మిక సంఘం, సీఐటీయూ కమిటీలు డిమాండ్ చేశాయి. ఇదే ఆయా సంఘాల కేంద్ర కమిటీల పిలుపుమేరకు ఆగస్టు ఒకటిన 'నిరసన' కార్యక్రమాలు చేపట్టాలని కోరాయి. కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గనాలని విజ్ఞప్తి చేశాయి. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు విలేకర్లతో మాట్లాడారు. దేశంలో కోట్లాది మంది వ్యవసాయ కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని చెప్పారు. వ్యవసాయకార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించి చట్ట బద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. చారిత్రాత్మకమైన ఉపాధి హామీ చట్టానికి బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. వలసలను నివారించేందుకు ఉపాధి చట్టం ఎంతగానో తోడ్పడుతున్నదని తెలిపారు. ఆ చట్టాన్ని పట్టణాలకు విస్తరింపజేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్టు ధోరణితో రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదని చెప్పారు. దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల ముసుగులో వ్యవసాయ కార్మికులకు భూపంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయకపోగా, ఇండ్ల స్థలాల కోసం అంటూ దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కుంటున్నారని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఇలాంటి బడా కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిం చేందుకు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలకు వరి, పత్తి పంట మొత్తం దెబ్బ తినడంతో వ్యవసాయ కార్మికులు పని దినాలను కోల్పోయారన్నారు. రైతులకు పంటనష్ట పరిహార మివ్వాలని డిమాండ్ చేశారు. చౌకదుకాణాల ద్వారా 18 రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు తదితరులు పాల్గొన్నారు.