Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌలు రైతులను ఆదుకోవాలి
- రైతు స్వరాజ్యవేదిక డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి, తగిన పరిహారం చెల్లించాలని రైతు స్వరాజ్యవేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ వాదోపవాదాలు చేసుకోవడం సరైందికాదని అభిప్రాయపడింది. శనివారం హైదరబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వేదిక నాయకులు విస్సాకిరణ్, కన్నెగంటి రవి, కొండల్‌రెడ్డి, శంకర్, శ్రీహర్ష విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు కరపత్రాన్ని విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ మధ్య వివాదాలను పక్కకు పెట్టి, నష్టపోయిన రైతులకు తక్షణం నష్ట పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ జిల్లాలలో భారీ వర్షాల వల్ల పంటలకు, సాగు భూములకు జరిగిన భారీ నష్టాన్ని వివరించారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది లాంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందనీ, చెరువుల కట్టలు తెగడం, రిజర్వాయర్ల బ్యాక్ వాటర్ ఇందుకు ప్రధాన కారణమయ్యాని తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 11 లక్షల ఎకరాలలో పంటలకు నష్టం జరిగిందన్నారు. వానల వల్ల పంటలకు, భూములకు, పశుసందపకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులతోసహా వాస్తవ సాగుదారుల విషయాలు తప్పక నమోదు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పంటనష్టం అంచనా పూర్తి చేసి ఆ నివేదికను కేంద్రానికి పంపించాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్ నుంచి నిధుల సహాయాన్ని కోరాలన్నారు. ఎస్డీిఆర్ఎఫ్ నిధుల ఖర్చుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల పరిహారాన్ని వెంటనే పూర్తిగా అందించాలని కోరారు. 2020 అక్టోబర్‌లో నష్ట పోయిన రైతుల వివరాలను సేకరించి అందరికీ వెంటనే పరిహారాన్ని అందించాలనీ, రాష్ట్రంలో సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రారంభించాలనని కోరారు. కౌలు, పోడు, మహిళా రైతులతో సహా వాస్తవ సాగుదారులందరినీ ఈ బీమా పరిధిలోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు.