Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బఫర్‌జోన్ పరిధిలోని ఇండ్ల కూల్చివేత
- అడ్డుకున్న స్థానికులు
- పోలీస్ పహారా మధ్య కూల్చివేతలు
నవతెలంగాణ - వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని మూలవాగు ఒడ్డున బఫర్ జోన్ పరిధిలో ఇరిగేషన్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన ఇండ్లను జేసీబీల సాయంతో అధికారులు కూల్చేశారు. దీంతో ఇండ్ల యజమానులు ఆందోళన చేశారు. తాము అన్ని అనుమతులు తీసుకున్నామని, సక్రమంగానే కట్టుకున్నామని తెలిపారు. అధికారులు అన్యాయంగా కూల్చడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు మహిళలు ఇండ్లు కూల్చొద్దని అధికారులకు దండం పెడుతూ వేడుకున్నారు. ఈ క్రమంలో అడ్డుకోవడంతో కొంత ఉద్రికత్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు వచ్చి ఆందోళన కారులను చెదరగొట్టారు. మున్సిపల్ కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావు మాట్లాడుతూ.. బఫర్‌జోన్‌లో మొత్తం 41 ఇండ్లను గుర్తించగా.. అందులో 5 ఇండ్లు సక్రమంగా ఉన్నాయని, 28ఇండ్లు కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మిగతా ఇండ్లను పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి కూల్చినట్టు తెలిపారు. బాధితులకు ఎలాంటి ఆస్తినష్టం జరగకుండా కూల్చివేతలు జరిపినట్టు చెప్పారు.