Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాస్పైర్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఐటీ ఆధారిత సేవల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన 'యాస్పైర్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ'ని శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరల్డ్ టాప్ ఐదు టెక్ కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా మారిందని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. తెలంగాణ యువతకు మంచి నైపుణ్యాలు ఉన్నాయని, ఇటీవల కేంద్రం విడుదల చేసిన నిటి అయోగ్ ఆవిష్కరణల ర్యాంకింగ్‌లో తెలంగాణ రెండో స్థానంలో నిలవడం గొప్ప విషయమని అన్నారు. ఫ్లోరిడా, యూఎస్ ఏ ఆధారిత సాంకేతిక సేవల సంస్థ ఫోనెక్ష టెక్నాలజిస్ట్లో భాగంగా ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తెలుగు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం మంచి విషయమన్నారు. ప్రస్తుతం 300 మందితో ప్రారంభమై వచ్చే మూడేండ్లలో 3 వేల మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కల్పించేలా విస్తరింపజేయాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోని అతి పెద్ద బహుళజాతి సంస్థలు తమ విస్తరణ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాయన్నారు. తెలంగాణ యువతకు ఎంతో టాలెంట్ ఉందని, వారికి నూతన అవకాశాలు అనేకం ఉన్నాయని చెప్పారు. ఈ ఆవిష్కరణల సుచీలో కర్ణాటక, తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో ఉంటే గుజరాత్, బీహార్ 14, 15 స్థానాల్లో ఉన్నాయని తెలిపారు. డబుల్ ఇంజన్ గ్రోత్ రాష్ట్రాలు వెనకబడ్డాయని ఎద్దేవా చేశారు. యువత చేసే పనిలో నిబద్దత, లక్ష్యంతో అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.