Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిథిలాలు గుడిసెపై పడి ఇద్దరు మృతి
- పెండ్లి పీటలెక్కాల్సిన యువకుడు మృతి
నవతెలంగాణ-మట్టెవాడ
ముసురు వర్షం ముప్పుగా మారింది. శనివారం తెల్లవారకముందే నిద్రలోనే రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. వర్షానికి నానిన పాత భవనం కూలి గుడిసెపై పడటంతో ఇద్దరు మృతిచెందారు. త్వరలో పెండ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు పాడెక్కాడు. ఆ యువకుడి పెండ్లి కోసం ఎదురు చూసిన తల్లి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ముగ్గురు పిల్లలకు అండగా ఉంటూ పెద్ద దిక్కుగా ఉంటున్న 62 ఏండ్ల వృద్ధుడు శిథిలాల కింద నలిగి అసువులు బాశాడు. ఈ విషాదకర ఘటన శుక్రవారం అర్ధరాత్రి వరంగల్ నగరంలోని మండి బజార్లో జరిగింది. స్థానికులు, పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేపల్లె గ్రామానికి చెందిన తిప్పారపు పైడి(62), మండి బజార్లో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి సెక్యూరిటీ గార్డుగా ఉంటున్నాడు. పక్కనే గుడిసెలో నివాసముంటున్నాడు. ఖమ్మం జిల్లా వైఎస్సార్ కాలనీకి చెందిన సమ్మక్క అలియాస్ సాలిమా కూడా స్థానికంగా పనిచేస్తోంది. ఆమె రెండో కొడుకు ఫిరోజ్(23) నిశ్చితార్థం కోసం బట్టలు కొనేందుకు శుక్రవారం తల్లివద్దకొచ్చాడు. వర్షం అధికంగా కురుస్తుండటంతో ఖమ్మం వెళ్లలేక రాత్రికి తిప్పారపు పైడి గుడిసెలో తలదాచుకుని మరుసటి రోజు వెళ్లాలనుకున్నారు. తల్లీకొడుకు పైడితోపాటు గుడ ిసెలో పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో గుడిసె పక్కనే ఉన్న పురాతన రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి గుడిసెపై పడింది. స్థానికులు గమనించి 100కు డయల్ చేయగా.. పోలీసులు వచ్చారు. స్థానికులతో కలిసి శిథిలాలను తొలగించారు. శిథిలాల కింద ఫిరోజ్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన పైడిని, సాలిమాను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పైడి చనిపోయాడు.ండంతస్తుల భవనంలో మూడు పోర్షన్లలో ఒక్కో పోర్షన్లో 15 మంది పనిచేసే గ్రంబస్ బేకరీ, ఐదుగురు పనిచేసే మోడ్రన్ స్వీట్ హౌస్, దాని పైనే ఉన్న పోర్షన్లో ఐదుగురు పని చేసే చిట్ఫండ్లు ఉన్నాయి. ఈ ప్రమాదం మధ్యాహ్నం జరిగి ఉంటే ప్రాణ నష్టం పెద్దఎత్తున ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్షం..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు పురాతన భవనాల పట్ల చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల పాత భవనాలు నాని కూలుతున్నాయి. ఇకనైనా మేయర్, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్లు స్పందించి పురాతన భవనాలను నేలమట్టం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.