Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
- గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహించాలి
- తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మెన్ రాజిరెడ్డి
- తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చలో లేబర్ కమిషన్ ఆఫీస్
నవతెలంగాణ-అడిక్ మెట్
ఆర్టీసిలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మెన్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలు అమలు చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సంతకాలను శనివారం లేబర్ కమిషనర్ ఆఫీసులో అందజేశారు. అనంతరం కమిషనర ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేసీ చైర్మెన్ రాజిరెడ్డి, వైస్ చైర్మెన్ హన్మంత్ ముదిరాజ్, పి. రవీందర్ రెడ్డి, కో కన్వీనర్ ఎస్.సురేష్ మాట్లాడారు. టీఎస్ ఆర్టీసీలో యాజమాన్యం కార్మిక హక్కులను రాస్తోందని, ఏకపక్షంగా పని గంటలు పెంచుతోందని అన్నారు. డ్యూటీ పని దినాలను తగ్గిస్తూ డబల్ డ్యూటీలు వేయించుకుని ఓవర్ టైం చెల్లించడం లేదన్నారు. ఆర్టీసీలో ఉన్న సర్వీస్ రెగ్యులేషన్, రిక్రూట్మెంట్ రెగ్యులేషన్ ప్రకారం కారుణ్య నియామకాల డ్యూటీలు రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల ద్వారా నడుపుకుంటున్న కో-ఆపరేటివ్ సొసైటీని యాజమాన్యం నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల నుంచి రికవరీ చేసిన డబ్బులు సీసీఏను జమ చేయకుండా రూ.700 కోట్లకు పైగా వాడుకున్నందున 70 వేల మంది రిటైర్ కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. కార్మికులకు న్యాయబద్ధంగా రావలసిన వేతనాలను పెంచాలని, రెండు వేతన సవరణలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2013 వేతన సవరణకు సంబంధించిన ఏరియర్స్ 50 శాతం బాండ్ల డబ్బులు చెల్లించాలని, కార్మికుల జీతాల నుంచి రికవరీ చేసిన డబ్బులను వెంటనే సీసీఏకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కండక్టర్లకు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పని భారాన్ని తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడిసెల అబ్రహం, కత్తుల యాదయ్య, వి.యాదయ్య, కో-కన్వీనర్లు ఇ. వెంకన్న, కె. రామిరెడ్డి, బి.జక్కరయ్య, మంగ, స్వాములయ్య, జి.ఆర్. రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జేఏసీ సభ్యులు, సంఘాల రాష్ట్ర, రీజనల్, డిపో, కమిటీ సభ్యులతో పాటు కార్మికులు పాల్గొన్నారు.