Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విపత్తు నిర్వహణ సిఫారసులను అమలు చేయాలి
- వరదల నుంచి పట్టణాలను రక్షించేందుకు ఇదే మార్గం: రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో పోటెత్త వరదల నుంచి పట్టణాలను కాపాడాల్సిన అవసరముందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అందుకోసం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ), నిపుణుల సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ కన్వీనర్ బొల్లంపల్లి ఇంద్రసేన్ రెడ్డి అధ్యక్షతన శనివారం హైదరాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్డీఎంఏ మాజీ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డి, బాంబే ఐఐటీ వాటర్ ఇంజినీరింగ్ సర్వీసెస్ నిపుణులు ప్రొఫెసర్ కపిల్ గుప్తా, ఐఏఎస్ అధికారి నవీన్ మిత్తల్, వాటర్ రిసోర్సెస, క్లైమెట్ ఛేంజ్ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ బి.వి.సుబ్బారావు, హక్కు ఇన్షియేటివ్ హెడ్ డాక్టర్ కోట నీలిమ, మిడిల్ టెన్నెస్సె స్టేట్ యూనివర్సిటీ (యూఎస్ఏ) ఫల్ బ్రైట్ స్కాలర్ సంజరు ఆస్తానా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు పట్టణాలపై వరదల ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు గల అవకాశాలపై మాట్లాడారు. పట్టణ మౌలిక వసతులు, సమస్యలపై ఎన్డీఎంఏ, నిపుణులు చేసిన సిఫారసులను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వరదల ప్రభావానికి గురవుతున్న పట్టణాలు ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారాయని చెప్పారు. క్రమపద్ధతి, నియంత్రణ, సరైన నగర ప్రణాళిక లేకపోవడం, నీటి వనరుల కబ్జా, విపత్తుల తర్వాత నిర్వహణ, ముందుగా సిద్ధపడకపోవడం హైదరాబాద్లో వరసగా వరదల సమస్యలకు కారణమని వారు పేర్కొన్నారు.
వేల ఏండ్ల నుంచి నీటి సహజ ప్రవాహ మార్గానికి ఇబ్బందులు కలిగించడం, నీటి వనరులపై పట్టణీకరణ చేపట్టటం, వ్యర్థాలను నీటి ప్రవాహానికి అడ్డుగా వేయడం తదితరాంశాలు ఇబ్బందులను మరింత పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణాలు పెరుగుతున్న వేగంగా వ్యర్థ నిర్వహణ వ్యవస్థల సదుపాయాలు పెరగకపోవడం కూడా హైదరాబాద్ వరదలకు కారణాలుగా వారు విశ్లేషించారు. ఈ సమస్యలపై అంతా ఐక్యంగా కలిసి కృషి చేయాలని నిర్ణయించారు.
నోడల్ అధికారులను నియమించాలి.... మర్రి శశిధర్ రెడ్డి
విపత్తు నిర్వహణ కోసం అన్ని పట్టణాల్లో నోడల్ అధికారులను నియమించాలని మర్రి శశిధర్ రెడ్డి సూచించారు. ఎన్డీఎంఏకు శాశ్వత ప్రాతిపదికన చైర్మెన్ నియమించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల స్థాయిలోనూ తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
'ఫిరంగి' ని పునరుద్ధరించకుంటే.... పాతనగరం కనుమరుగే...ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి
ఫిరంగి నాలాను కబ్జాల నుంచి పునరుద్ధరించకుంటే హైదరాబాద్ లో పాత నగరం కనుమరుగు కావడం ఖాయమని పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు. 1908 వరదల తర్వాత నాటి బ్రిటీష్ అధికారి హైదరాబాద్ దక్షిణ భాగంలో శాస్త్రీయ అవగాహనతో ఫిరంగి నాలాను నిర్మించారని గుర్తుచేశారు. 25 చెరువుల అనుసంధానించడం ద్వారా ఏర్పాటైన ఈ నాలా చందనపల్లి నుంచి మొదలై ఇబ్రహీంపట్నం వరకు కొనసాగుతుందనిచెప్పారు. అది కబ్జాలకు గురైందనీ, దీన్ని పునరుద్ధరిస్తే తప్ప పాతనగరానికి భవిష్యత్తు లేదని తెలిపారు. బొల్లంపల్లి ఇంద్రసేన్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ పట్ల జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు ఫౌండేషన్ కృషిని మొదలు పెట్టిందని తెలిపారు.