Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితి సభలో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రముఖ కవులు గుర్రం జాషువా, దాశరధి కృష్ణమాచార్యులు కోరిన మార్పు సమాజంలో ఇంకా రాలేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అందుకే వారి కవిత్వం ఇప్పటికీ సజీవంగా జనబాహుళ్యంలో నిలిచే ఉందన్నారు. తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో శనివారంనాడిక్కడి ఎమ్హెచ్ భవన్లో గుర్రం జాషువా వర్థంతి, దాశరధి కృష్ణమాచార్యులు జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సాహితీ సభకు ప్రముఖ కవి, తెలంగాణ సాహితి ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా సిటీ కాలేజ్ తెలుగు శాఖ అధ్యక్షులు కోయి కోటేశ్వరరావు, ప్రముఖ కవి విమర్శకులు కవి యాకూబ్ హాజరయ్యారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఆనందాచారి, కథా రచయిత్రి నస్రీన్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహాకవి దాశరధి కృష్ణమాచార్యులు తన కవిత్వం ద్వారా తెలంగాణ నేత చైతన్యాన్ని సజీవంగా నిలిపి, ఉద్యమాగ్ని రగిల్చారని చెప్పారు.
గుర్రం జాషువా తన కవిత్వంతో అంటరానితనం, ఆధ్యాత్మిక అంధత్వం, సామ్రాజ్యవాద పోకడలపై కత్తికంటే పదునుగా కలాన్ని ఎక్కుపెట్టి దునుమాడారని కొనియాడారు. దాశరధి జైలు జీవితం అనుభవిస్తూ, తీవ్ర నిర్భంధంలోనూ 'ఓ నిజాం పిశాచమా...' అని గర్జించి, అక్షరోద్యమ స్ఫూర్తిని రగిలించారని అన్నారు. కవులు, సాహిత్యకారుల కృషిని స్మరించుకోవడం ద్వారా వారి చైతన్యాన్ని భవిష్యత్ తరాలకు అందించే ఒరవడి కేరళ నుంచి స్ఫూర్తిగా పొందాలని ఆకాంక్షించారు. కేరళలో అక్కడి మహాకవి కుంచన్ జ్ఞాపిక వద్ద ఇక్కడి బాసర తరహాలో అక్షరాభ్యాసాలు చేస్తారని గుర్తుచేస్తారు. అదే తరహాలో సాహిత్యకారులు పుట్టిన ఊరు, గ్రామాల్లో నిత్య పర్యటనలు చేస్తూ, గ్రంథాలయాల పునరుద్ధరుణ ద్వారా వారిని స్మరించుకొనే కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షించారు. దీనికి కేరళను స్ఫూర్తిగా తీసుకోవాలని ఉదహరించారు. ప్రజాకవులు దాశరధి, జాషువా ఇద్దరి కార్యక్రమాలను ఒకే వేదికపై నిర్వహించి ప్రజాసాహిత్య ఉద్యమ స్ఫూర్తిని 'తెలంగాణ సాహితి' నిలిపిందని కొనియాడారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. అంతకుముందు ఆహూతులను సహాయ కార్యదర్శులు సలీమ వేదికపైకి ఆహ్వానించారు. మోహనకృష్ణ కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు. కవిసమ్మేళనాన్ని ఎమ్ రేఖ, ముజాహిద్ నిర్వహించారు. అంతకుముందు ములక్కనూరు గ్రంథాలయం నిర్వహించిన కథల పోటీల్లో ద్వితీయ బహుమతి విజేత నస్రీన్ఖాన్ను సన్మానించారు.