Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియాకు సర్కారు ఆస్తిపన్ను బకాయిలు రూ. 5,564 కోట్లు
- మొత్తం బకాయిలు రూ.8,346కోట్లు
- ఓటీఎస్ ద్వారా రావాల్సింది రూ.2782కోట్లు
- పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సర్కార్ నుంచి సాయంలేక అభివృద్ధి కార్యక్రమాలను చేయలేక ఆపసోపాలుపడుతోంది. నిధులు లేకపోయినా అప్పులు తీసుకొచ్చి ఫ్లైఓవర్లను నిర్మిస్తోంది. రోడ్లను నిర్వహిస్తోంది. అయితే బల్దియాకు ప్రధాన వనరుగా ఉన్న ఆస్తిపన్ను భారీగా వసూలు కావడంతో కాస్త ఊపిరిపీల్చుకుంటుంది. ఇదిలా ఉండగా పౌరుల ముక్కుపిండి ఆస్తిపన్ను వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలను మాత్రం వసూలు చేయడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయకపోగా ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను బకాయిలను చెల్లించడంలేదు. ఫలితంగా ప్రజలపై భారాలేయాల్సిన దుస్థితి దాపురించింది.
జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయం వనరుగా ఉన్న ఆస్తిపన్ను వసూళ్లు భారీగా తగ్గాయి. 2020-21లో రూ.1633.75కోట్లు వసూలైతే 2021-22లో రూ.1495.29కోట్లు అంటే రూ.138.46కోట్లు తక్కువగా వసూలైంది. గ్రేటర్ పరిధిలో 17.5లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరి నుంచి
రూ.2,600కోట్లు ఆస్తిపన్ను వసూలు చేయడానికి అవకాశముందని అధికారులు అంచనా వేశారు. దీంతోపాటు ఈ ఏడాది ఎర్లీబర్డ్‌లో రూ.600కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా రికార్డు స్థాయిలో రూ.750కోట్లు వసూలైంది.
పాతబకాయిలు రూ.8,346కోట్లు
ప్రభుత్వానికి చెందిన భవనాల ఆస్తిపన్ను, ప్రయివేటు సంస్థలు, ప్రజలకు చెందిన పాత బకాయిలు అక్షరాల రూ.8,346కోట్లు ఉన్నాయి. వన్‌టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వం వడ్డీలో రాయితీ కల్పించినా బడా కంపెనీలు, పాత బకాయిదారుల నుంచి పెద్దగా స్పందనరాలేదు. 2020లో కరోనా కారణంగా ఆశించిన స్థాయిలో ఓటీఎస్‌లో ఫలితాలు రాలేదు. పన్ను, వడ్డీ కలిపి రూ.2,547కోట్లకు గాను రూ.550 కోట్లు మాత్రమే వసూలైంది. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఓటీఎస్ కింద పన్ను చెల్లించడానికి అవకాశం ఇచ్చింది. 4,80,436 బకాయిదారుల నుంచి రూ.1,540కోట్ల పన్ను, రూ.1,242కోట్ల వడ్డీ మొత్తం రూ.2,782కోట్ల పాత బకాయిలు రావాల్సి ఉంది. అయితే 90శాతం వడ్డీ కల్పించి రూ.1,664కోట్లు వసూల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
సర్కార్ భవనాల బకాయిలు రూ.5,564 కోట్లు
జీహెచ్ఎంసీ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలు రూ.5,564కోట్లు పేరుకుపోయాయి. వీటిలో ప్రభుత్వ భవనాల బకాయిలు రూ.5,258కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థల భవనాల బకాయిలు రూ.306కోట్లు పేరుకుపోయాయి. బకాయిలు చెల్లించాలని జీహెచ్ఎంసీ నుంచి 25ఏండ్లుగా నోటీసులు పంపిస్తున్నా సదరు సంస్థలు స్పందించడంలేదు. వైద్యారోగ్య శాఖ 23 ఏండ్లుగా రూ. 1185 కోట్లు, నగర పోలీసు శాఖ 12 ఏండ్లుగా రూ.420 కోట్లు ఉన్నాయి. అబ్కారీ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.35 వేల కోట్ల ఆదాయం వస్తోంది. కాని జీహెచ్ఎంసీ చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిలు 21ఏండ్లుగా రూ.895 కోట్లు చెల్లించడంలేదు. విద్యాశాఖ 16 ఏండ్లుగా రూ.385 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇలా 87 ప్రభుత్వ సంస్థలు, 30 ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తిపన్ను బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాయి.
అప్పులు రూ.5 వేల కోట్లపైనే
జీహెచ్ఎంసీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఖజానాలో నిధుల్లేక ఉద్యోగులకు వేతనాలిచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ఎస్ఆర్డీపీ పనుల కోసం రూ.2,500 కోట్లు. రుపీ టర్మ్‌లోన్ బాండ్ల ద్వారా రూ.495 కోట్లు సేకరించింది. దాంతోపాటు 709 కిలోమీటర్ల ప్రధాన రోడ్ల నిర్వహణను ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించింది. అందుకోసం రూ.1,839 కోట్ల బ్యాంకు రుణం తీసుకుంది. జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్లను పూర్తిచేయడానికి రూ.330 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే. ఎస్ఆర్డీపీ పనుల కోసం మరో రూ.505 కోట్లను బాండ్ల ద్వారా సేకరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే జీహెచ్ఎంసీకి రావాల్సిన ప్రభుత్వ ఆస్తిపన్ను బకాయిలు, ఓటీఎస్ ద్వారా పన్ను వసూలైతే బల్దియా అప్పుల నుంచి దర్జాగా బయటపడుతోందని, అందుకు సర్కార్ సహకరించాలని నగరవాసులు కోరుతున్నారు.