Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడిదారీ వ్యవస్థలోని తాజా పరిస్థితులే కారణం
- కోడ్ల పేరుతో కార్మిక హక్కుల హననం : ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి.పాపారావు
- జుట్టు పన్ను గురించి విన్నాం..మోడీ హయాంలో చూస్తున్నాం : పాలడుగు
- మిలిటరీ నుంచే టైమ్బేస్డ్ ఉద్యోగుల నియామకం మొదలైంది : యూసుఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ట్రేడ్ యూనియన్లు బలంగా ఉంటేనే కార్మికులకు మెరుగైన జీతాలు లభిస్తాయనీ, ఎక్కడైతే బలహీనంగా ఉంటాయో ఆయా దేశాలలో సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో అవి ఆర్థిక పతనం దిశగా సాగుతాయని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి.పాపారావు అభిప్రాయపడ్డారు. కార్మికులు బలమైన పోరాటాల ద్వారా భిన్నమైన ప్రపంచం వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఆదివారం హైదరాబాద్‌లోని కవాడీగూడలోని సీజీఓ టవర్స్‌లో కాన్ఫిడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వర్కర్స్(సీసీజీఈడబ్ల్యూ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యూనిట్ల 13వ మహాసభ ఆ యూనియన్ చైర్మెన్ నాగేశ్వర్రావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథి పాపారావు మాట్లాడుతూ.. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒడిదుడుకుల వల్ల అమెరికాలో ఆర్థికపరిస్థితి కూలిపోయేస్థితికి చేరకున్నదనీ, డాలర్ విలువ ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అందుకే అమెరికా అధ్యక్షులు బైడెన్ బలమైన కార్మిక సంఘాలు ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కిచెబుతున్నారని వివరించారు. సామాన్య ప్రజానీకం బాగుంటేనే సమాజం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మోడీ సర్కారేమో పెట్టుబడిదారులు, కార్పొరేట్లు సంపద పెరిగితే పేదలు బాగుంటారనే ఆలోచనతో ముందుకెళ్తున్నదని విమర్శించారు. అందులో భాగంగానే కార్పొరేట్ల మేలు కోసం కార్మికకోడ్లను తెచ్చిందన్నారు. ప్రపంచ కుబేరుడు వారన్ బఫెట్ సంపన్నుల మీద పన్నులు వేయాలని కోరుతుంటే..మన దేశంలోనేమో మోడీ సర్కారు అంబానీ, అదానీ, తదితర కార్పొరేట్ దిగ్గజాలకు రాయితీలమీద రాయితీలిస్తూ పేదల మీద జీఎస్టీ పేరుతో భారాలు మోపుతూ పోతున్నదని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1990 వరకు మన దేశంలో సోషలిస్టు భావజాలం ఆధారితంగా పాలన నడిచిందన్నారు. ఆ తర్వాత మనం అమెరికా ప్రేరేపితమైన సంస్కరణలను పాలకులు తీసుకొచ్చారని తెలిపారు. అందులో భాగంగానే ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకులు మన దేశానికి ఖర్చులు తగ్గించాలనీ, సంక్షేమపథకాల్లో కోత విధించాలనీ, ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించి పెన్షన్లు తొలగించాలని షరతులు విధించాయని తెలిపారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాయని వివరించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ..కేంద్రంలోని మోడీ సర్కారు ఉద్యోగుల మీద ఖర్చును తగ్గించి కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే దాని గురించే ఆలోచిస్తున్నదని విమర్శించారు. టెలికాం, రక్షణరంగాల్లోకి ప్రయివేటు పెట్టుబడుల ఆహ్వానం తర్వాత దేశ భద్రతకే ప్రమాదం వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కులం, మతం, ప్రాంతం ఇలా ప్రతి కారణాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను చీల్చి దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను కార్పొరేట్లకు కారుచౌక కట్టబెట్టేందుకు కొత్తకొత్త పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నదని విమర్శించారు. మరోవైపు ప్రజలు తినే తిండిపైనా జీఎస్టీ భారాన్ని మోపుతున్నదన్నారు. రాజుల కాలంలో జుట్టుపై పన్ను వేసేవారని విన్నాంగానీ...ఇప్పుడు మోడీ హయాంలో స్వయంగా చూస్తున్నామని విమర్శించారు. ఆజాదీకా అమృత్‌మహోత్సవ్ ఎవరి కోసం అని ప్రశ్నించారు. ఆ ఉత్సవాలను ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లను అమ్మేస్తున్నందు జరుపుకోవాలా? ఉద్యోగులను తొలగిస్తున్నందుకు నిర్వహించాలా? జీఎస్టీ భారాలు మోపుతున్నందుకు చేయాలా? దేశాన్ని అమ్మేస్తున్నందుకు నిర్వహించాలా? అని నిలదీశారు. ఏఐటీయూసీ కార్యనిర్వాహక అధ్యక్షులు యూసుఫ్ మాట్లాడుతూ..మన దేశంలో రష్యా సహకారంతో ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం అయిందన్నారు. ప్రపంచ దేశాలన్నీ రష్యావైపు చూస్తుండటంతో అమెరికా నేతృత్వంలోని 32 పెట్టుబడిదారీ దేశాలు కుయుక్తులు పన్ని సోవియట్ రష్యాను దెబ్బతీశాయన్నారు. ఆ తర్వాత అమెరికా ఎల్పీజీ విధానాలతో అన్ని దేశాలనూ దోచుకునే పద్ధతిని మొదలుపెట్టిందని విమర్శించారు. ఓవైపు కార్పొరేట్ల కోసం దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ మరోవైపు సామాన్యులు, పేదలు దేశం కోసం త్యాగాలు చేయాలని మోడీ పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వ రంగంలోనూ రెగ్యులర్ ఉద్యోగులుండరనీ, అగ్నిపథ్తోనే మిలిటరీలో టైమ్ బాండ్ ఎంప్లాయిమెంట్ పద్ధతిని మోడీ సర్కారు తీసుకొచ్చిందని విమర్శించారు. నేడు దేశంలో వ్యాపారస్తుల పార్టీ అధికారంలో ఉందని ఆరోపించారు. కార్మికులు, ఉద్యోగులు కలిసికట్టుగా కేంద్రం విధానాలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీసీజీఈడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎ.అజీజ్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, ఏఐడీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి జీటీ గోపాల్‌రావు, ఆయా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు కృష్ణమోహన్, ముక్తార్, ప్రభాకర్నాయర్, ఎమ్ఎన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.