Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రి జిల్లాలో గోదావరి వరద ముంపు
- ఖమ్మంలో అధిక వర్షం
- పల్లపు ప్రాంతాల్లో నీరు నిల్వ.. కుళ్లుతున్న వేర్లు
- పసుపు వర్ణంలోకి పత్తి.. చేలలో భారీగా కలుపు
- యాజమాన్య చర్యలపై ఆందోళనలో రైతాంగం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎడతెరపిలేని వానలతో పంటలు ఊటలు బారుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో చేలు ముంపునకు గురై ఎందుకూ పనికిరాకుండా దెబ్బతిన్నాయి. పరివాహక ప్రాంత పరిసర మండలాల్లోనూ పంట చేలలో నీరు నిలిచి పైరు వేర్లు కుళ్లిపోతున్నాయి. ఆకులు పసుపు వర్ణంలోకి మారుతున్నాయి. అటు మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, దంతాలపల్లి, మరిపెడ తదితర ప్రాంతాల్లో శుక్రవారం 20 సెం.మీ వరకూ వర్షం కురిసింది. దాని ప్రభావంతో ఆకేరులోకి భారీగా వరద నీరు చేరింది. ఆ నీరంతా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద సీలేరు, మున్నేరుతో జత కట్టడంతో ఖమ్మం సరిహద్దున ఉన్న మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఎగువన మహబూబాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుపై నిర్మించిన తనగంపాడు చెక్ డ్యాంకు ముప్పు పొంచివుంది. గోళ్లపాడు- తీర్ధాల మధ్య వంతెనపై వరద నీరు నాలుగు అడుగుల మేర ప్రవహిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. గుండాలతండా- మంగళగూడెం మధ్య లోలెవల్ వంతెన మున్నేటి ఉధృతికి కొట్టుకుపోయింది. అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి.
పంటలను ముంచిన గోదారి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి రైతులను కోలుకోని దెబ్బతీసింది. జిల్లాలో 99 గ్రామాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. 5,043 మంది రైతులపై దీని ప్రభావం పడిందని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా. 10831 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్టు గుర్తించారు. ఎకరానికి రూ.5,400 చొప్పున మొత్తం రూ.584.88 లక్షల నష్టపరిహారం కోసం కేంద్రానికి నివేదించనున్నారు. జిల్లాలో పత్తి 7,417, వరి 3,305, పెసలు ఏడు, ఇతరత్రా పంటలు 102 ఎకరాల్లో దెబ్బతిన్నాయని గుర్తించారు. ఉద్యాన పంటల విషయానికొస్తే 25 ఎకరాల్లో కూరగాయలు, పసుపు 8, డ్రాగాన్ఫ్రూట్ 2 ఎకరాలు, మొత్తం 35 ఎకరాల్లో రూ.40.50 లక్షల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో ఎక్కువగా పంటలు గోదావరి ముంపనకు గురైనట్లు నివేదించారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ అధిక వర్షపాతమే నమోదైంది.
అధిక నష్టం
భద్రాద్రి జిల్లాలో గోదావరి ముంపు మండలాలు మినహా మిగిలిన ప్రాంతాలు, ఖమ్మం జిల్లాలోని అనేక మండలాల్లో అధిక వర్షం కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 5.91 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. పత్తి 2.69 లక్షలు, వరి 2.80 లక్షలు, మిర్చి 80వేలు, పెసర 25వేల ఎకరాల్లో సాగు చేయొచ్చని అంచనా వేశారు. దీనిలో పత్తి దాదాపు అంచనా మేరకు సాగు చేయగా మిగిలిన పంటల్లో వరి లక్ష ఎకరాల లోపు, మిర్చి నారు పోశారు. పెసర దాదాపు అంచనా మేరకు సేద్యం చేశారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా జిల్లాలో రైతు రెండు సార్లు పత్తి విత్తనాలు నాటాల్సి వచ్చింది. తొలుత నాటిన గింజలు అధిక వర్షాలకు భూమిలో నాని మొలకెత్తలేదు. దీనివల్ల రెండోసారి విత్తనాలు నాటాల్సి వచ్చింది. కొందరు రైతులు పూర్తిగా చెడగొట్టి సాగు చేయగా.. మరికొందరు రైతులకు చావు గింజలు అధికంగా పట్టాయి. అధిక వర్షాల కారణంగా పల్లపు ప్రాంతాల్లోని పత్తి చేలల్లో భారీగా నీరు నిలుస్తోంది. ఎడతెరపి లేని వర్షాలతో నల్ల నేలల్లో నాటిన పత్తి చేలలో నీరు నిల్వ ఉండి వేర్లు కుళ్లుతున్నాయని, ఆకులు పసుపు వర్ణంలోకి మారుతున్నట్టు రైతులు వాపోతున్నారు. ముసురు ప్రభావంతో ఎర్రనేలల్లో నాటిన పత్తి చేలల్లో కలుపు తీత సాధ్యం కావట్లేదని చెబుతున్నారు. అలుగులు, చెరువు శిఖం భూములు, పల్లపు ప్రాంతాల్లో నాటిని వరి, నారు దెబ్బతిన్నాయి. మిరప గింజలు నాటిన రైతులు అధిక వర్షాలకు గింజలు దెబ్బతినకుండా, కొట్టుకుపోకుండా మొలిచేందుకుగాను నారు మళ్లపై పాతచీరలు కప్పుతున్నారు. పెసర చేలల్లోనూ కలుపు బాగా పెరిగింది. గొంగళి పురుగుల ఉధృతి పెరుగుతోందని రైతులు వాపోతున్నారు.
ఖమ్మం జిల్లాలో దాదాపు 2000 ఎకరాల వరకూ కూరగాయ పంటలు సాగు చేస్తారు. సాగు చేసిన పంటల్లో అధిక శాతాన్ని ఈ వర్షాలు దెబ్బతీశాయని రైతాంగం వాపోతోంది. ఈ జిల్లాలో పంట నష్టాలు లేనప్పటికీ ఎడతెరపిలేని వర్షాల కారణంగా యాజమాన్య చర్యలు చేపట్టడం సాధ్యం కావట్లేదు.
అధిక వర్షాలకు పత్తి దెబ్బతింటోంది
రెండు ఎకరాల్లో పత్తి నాటాను. అధిక వర్షాలతో చేలో పూర్తిగా నీళ్లు నిలిచాయి. దాదాపు రూ.20వేల పెట్టుబడి నష్టపోయే పరిస్థితి ఉంది. ఎకరానికి మూడు ప్యాకెట్ల చొప్పున ఆరు ప్యాకెట్ల పత్తి గింజలు వేశాను. ప్యాకెట్ రూ.800 చొప్పున తీసుకొచ్చాను. నీళ్లు నిల్వ ఉండటంతో మొక్కలు దెబ్బతింటున్నాయి. బయటకు తీద్దామన్నా పల్లపు భూమి కావడంతో నీరు పోయేలా లేదు. చావు గింజలు కూడా బాగా పోవడంతో ఒక్కో ఎకరానికి అదనంగా ప్యాకెట్న్నర విత్తనాలు పట్టాయి. దున్నుడు, నాటుడు కూళ్లు, ఎరువులకు అన్నీ కలిపి రూ.20వేలకు పైన్నే పెట్టుబడి పెట్టా. వానలు ఇట్లనే వస్తే ఆ పెట్టుబడి కూడా పూడుద్దన్న నమ్మకం లేదు.