Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డి నిరంకుశ ధోరణి మారకుంటే నిరవధిక సమ్మెకు వెళతామని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) హెచ్చరించింది. ఆదివారం ఆ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అన్వర్, డా జలగం తిరుపతి రావు ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది. సోమవారం నుంచి అన్ని మెడికల్ కాలేజీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించారు. త్వరలోనే డీఎంఈని కలిసి అన్ని సమస్యలపై మళ్లీ వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. ''పూర్తి స్థాయి యూజిసి వేతనాలు ఇవ్వడం లేదు. సాధారణ బదిలీలు చేయడం లేదు. 56 నెలల పీఆర్సీ బకాయిలు ఇవ్వడం లేదు. ఈఎల్ ఎన్ క్యాష్మెంటు ఇవ్వడం లేదు. చాలా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు సరిగా లేవు. జీతాలు మొదటి తారీకున కూడా రావడం లేదు. డీఎంఈ కొత్త కొత్త పద్ధతులతో ప్రభుత్వ డాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నిరంతరంగా మధ్యాహ్నం 2 గం.నుండి మరుసటి రోజు ఉదయం 9 గం. ల వరకు రోస్టర్ ప్రకారం రోగులకు సేవలు అందుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఓపి వల్ల ఒరిగేదేమిటో డీఎంఈకే తెలియాలి '' ....అని సమావేశంలో వక్తలు పేర్కొన్నారు.
ఎనిమిదేండ్ల నుంచి రాష్ట్రంలో డీఎంఈ పోస్టు సష్టించలేదనీ, యూనియన్ ను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని నాయకులు విమర్శించారు. డాక్టర్ కె.రమేశ్ రెడ్డి ఇలాగే ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళితే తమ కార్యాచరణ త్వరలోనే తెలియజేస్తామని హెచ్చరించారు.