Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సారెస్పీ 18 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
నవతెలంగాణ-నిజాంసాగర్/మెండోరా
నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. 56,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో 8 వరద గేట్లు ఎత్తి 55,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జన్కో ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1402.92 అడుగుల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 17.802 టీఎంసీల కాగా ప్రస్తుతం 14.881 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఎస్సారెస్పీ 18 గేట్లు ఎత్తివేత
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. ఉధృతి తగ్గట్టు గేట్లు ఎత్తుతూ, దించుతూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రాజెక్టుకు 82 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో 18 గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు ఏఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టు లోకి కొనసాగుతున్న వరద ప్రవాహాన్ని బట్టి మిగులు జలాలు దిగువ ప్రాంతాలకు వదులుతున్నామని అన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1087.6 అడుగుల 75.145 టీఎంసీల నీరు నిలకడగా ఉంది. ప్రాజెక్టులోకి జూన్ నుండి ఇప్పటివరకు 170.409 టీఎంసీల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరగా 115.332 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.