Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలల తరబడి ఎదురుచూపులు
- డిస్పెన్సరీకి రెఫరల్ ఆస్పత్రికి మధ్య రోగుల పరుగులు
- సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి నో రెస్పాన్స్
- ఈఎస్ఐ ఆస్పత్రుల్లో రోగుల ఇబ్బందులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈఎస్ఐ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా డాక్టర్లు రాసిన మందుల్లో కొన్నింటినీ తీసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. డిస్పెన్సరీ నుంచి రెఫరల్ ఆస్పత్రికి మధ్య పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు రాసిన పూర్తి మందులు దొరకక రెఫరల్ ఆస్పత్రిలో అడిగితే డిస్పెన్సరీలో తీసుకోవాలనీ, అక్కడ అడిగితే రెఫర్ ఆస్పత్రిలో దొరుకుతాయని సమాధానం చెబుతున్నారు. మళ్లీ డిస్పెన్సిరీలో అడిగితే స్పెషల్ మెడిసిన్ క్రింద ప్రత్యేక దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలా దరఖాస్తు చేసుకున్న వాటికి సంబంధించి కూడా వెంటనే సమాధానం చెప్పకుండా మందులను తెప్పించకుండా కాలయాపన చేస్తున్నారు. వారాల తరబడి జరుగుతున్న కాలయాపనతో విసిగిపోతున్న రోగులు అనివార్యంగా ప్రయివేటును ఆశ్రయిస్తున్నారు.రాష్ట్రంలో 20 లక్షల మందికిపైగా ఈఎస్ఐ కార్డుదారులున్నారు. వారి కుటుంబాలతో కలుపుకుని 80 లక్షల మందికి పైగా లబ్దిదారులు ఉన్నారు. ప్రతి నెలా వీరి నుంచి వాటా క్రింద సొమ్ము చెల్లించుకుంటున్న ఈఎస్ఐ యాజమాన్యం అదే స్థాయిలో సేవలందించలేకపోతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మందుల పంపిణీ విషయంలో ఈ విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఆస్పత్రుల్లో డాక్టర్లు రాసిన మందులు పూర్తి స్థాయిలో దొరకకపోగా వాటిని డిస్పెన్సరీల్లో తీసుకోవాలని రెఫరల్ ఆస్పత్రిలో సూచిస్తుండగా, రెఫరల్ ఆస్పత్రుల్లోనే దొరుకుతాయనీ డిస్పెన్సరీల్లో చెబుతుండటం గమనార్హం. అటూ, ఇటు తిరిగిన రోగులకు అవి కాస్తా ప్రత్యేక మందుల కేటగిరీలోకి వస్తాయంటూ నాలుగు రకాల డాక్యుమెంట్లను తెప్పించుకుని దరఖాస్తు చేయించుకుంటున్నారు. దీంతో రోగులు మందులు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి స్పందన లేదని డిస్పెన్సరీల్లో సిబ్బంది సమాధానమిస్తున్నారు.
మందులున్నాయా? లేవా?
డాక్టర్లు రాసిన మందుల కోసం రోగులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తున్నది. తీరా తమ వంతు వచ్చాక మందులు లేవనే సమాధానం ఇస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అసలు రెఫరల్ ఆస్పత్రుల్లో ఏ మందులు అందుబాటులో ఉన్నాయి? . డిస్పెన్సరీల్లో ఏ మందులు అందుబాటులో ఉన్నాయనే సమాచారం పారదర్శకంగా రోగులకు అందుబాటులో ఉంచాలని కార్మికసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ప్రత్యేక మందులంటూ కాలయాపన చేస్తూ ప్రయివేటుకెళ్లేలా తప్పనిసరి పరిస్థితిని సష్టించకుండా నిలువరించాలని కోరుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక మందుల కేటగిరీలో ఉంటే నిర్దిష్ట కాలపరిమితిలోపు ఆ మందులు అందుబాటులో ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని రోగులకు తెలపాలని కార్మికసంఘాలు సూచిస్తున్నాయి. అన్ని మందులను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.