Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరిగాయి. వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేక్ కట్ చేసి, మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండూ నూరేండ్లు జీవించాలని ఆకాంక్షించారు. పలు చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు మొక్కలు నాటాయి. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నిరుపేదలకు అన్నదానాలు, ఆర్థిక సహాయాలు చేశారు. 'గిఫ్ట్ ఏ స్మైల్'లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా ఏనుగొండలోని సన్నిధి అనాధాశ్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా వికలాంగులకు ట్రైసైకిళ్లు అందచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ తలసాని సాయి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి కేటీఆర్‌పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఇసుకతో రూపొందించిన కేటీఆర్ చిత్రం (స్యాండ్ ఆర్ట్), త్రీడీ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంత్రి కేటీఆర్‌కు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాలికి తగిలిన గాయం వల్ల ప్రజాసేవకు కొంత అంతరాయం కలిగిందని తెలిసిందనీ, ఆ గాయం నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలో మమేకం కావాలని ఆకాంక్షించారు. వేదం ఫౌండేషన్ చైర్మెన్ అలిశెట్టి అరవింద్ హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కార్లతో ప్రదర్శన నిర్వహించారు. వాటిపై హ్యపీ బర్త్ డే కేటీఆర్ అని రాసి ప్రదర్శించారు. సౌత్ ఆఫ్రికా, కువైట్ పలు దేశాల్లోనూ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు నిర్వహించారు. కాలికి గాయం కారణంగా మంత్రి కేటీఆర్ ఇంటికే పరిమితమ య్యారు. వైద్యులు ఆయన్ని మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.