Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి, నిర్మాణలోపాలతో కాళేశ్వరం ప్రాజెక్టు
- జరిగిన నష్టాన్ని మెగా సంస్థే భరించాలి
- అవినీతి ఎస్ఈలను సస్పెండ్ చేయాలి :
- అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
నిర్మాణ వైఫల్యం, అవినీతి అక్రమాలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, కన్నేపల్లిలో 11 మోటారు పంపులు మునిగిపోయాయని, వాటికి కనీసం రక్షణాచర్యలు ఏర్పాటుచేయకపోవడం మానవతప్పిందమేనని అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి తెలిపారు. ఇటీవల భారీగా కురిసిన వర్షాలతో భద్రాచలం ముంపునకు గురైతే.. ముఖ్యమంత్రి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వరుసగా కురిసిన వర్షాలకు విదేశీ కుట్ర చేసి, క్లౌడ్ బ్రెస్ట్ జరిగిందంటూ ప్రజల ఆలోచనలు మళ్ళించారని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలకేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూ.35,500 కోట్లతో డిజైన్ చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రీ డిజైన్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని రూ.1,10,000 కోట్లు ఎస్టిమేషన్ చేశారని తెలిపారు. ప్రాణహిత చేవెళ్లకు మూడురెట్లు నిర్మాణ ఖర్చులను పెంచారన్నారు. ఇప్పటికీ రూ.80 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్న ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మించిన మెగా కంపెనీకి పెద్దఎత్తున లాభాలను దోచిపెట్టిందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మించినప్పుడు మోటార్ల రక్షణకు ఏర్పాట్లు చేయాలని, కానీ వాటి రక్షణపై ఎస్ఈ పెంటారెడ్డి దుర్మార్గమైన కామెంట్ చేశారని విమర్శించారు. వాస్తవానికి కరెంటు మోటార్లలో వరద వచ్చినప్పుడు ఒండ్రుమట్టి చేరుతుందని, దాంతో వాటిలో రివైండింగ్ చేయడానికి రూ. 20 కోట్లు కావాల్సి వస్తుందన్నారు. ఇలాంటివేవీ పరిగణలోకి తీసుకోకుండా ఎస్ఈ దుర్మార్గపూరితంగా ఆలోచించారని అన్నారు. గతంలో కల్వకుర్తి పంపుసెట్లు శ్రీశైలంలో మునిగిపోయిన సంఘటనలు కండ్ల ముందున్నా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మానవ తప్పిదాలను చేసి ప్రకృతిపై రుద్దడం పద్ధతి కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 12 లిఫ్టు పథకాలు ఉంటే 4550 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుందని, దీని నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి అనేక రకాలుగా మాటలు మారుస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హైడ్రాలిక్ సిస్టం తప్పుగా ఉందని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ, ఫారెస్ట్, పర్యావరణం, టెక్నికల్కు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఉన్నందువల్ల జాతీయహోదా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు కేవలం 7,20,000 ఎకరాలకు మాత్రమే ఆయకట్టు ఉందని తెలిపారు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు కింద 37 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని వివరించారు. జాతీయ హోదా కల్పిస్తే 90 శాతం నిధులు కేంద్రప్రభుత్వం, 10శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 50శాతం నిధులు ఖర్చు చేసినట్లు చెప్తుందన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా ఉండేందుకు జాతీయహోదా కల్పించడం లేదన్నారు. కరువు ప్రాంతాలుగా ఉన్న మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించే పాలమూరు ఎత్తిపోతలకు కూడా జాతీయహోదా ఇవ్వాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేశం, బోయయాదయ్య పాల్గొన్నారు.