Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ ఎమ్డీపై ఏపీఎస్ఆర్టీసీ ఫైర్
- పీఎఫ్ సహా అన్ని ట్రస్ట్ల్ని విభజించాలని డిమాండ్
- హాట్‌హాట్‌గా రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎమ్‌డీల భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) ట్రస్ట్ నుంచి మీరు రూ.1,300 కోట్లు సొంతానికి వాడుకున్నారు. ఉద్యోగుల పీఎఫ్ చెల్లించట్లేదంటూ ఆ సంస్థ మాకు నోటీసులు ఇస్తోంది. మీరు చేసే అప్పులకు మేం జవాబుదారీ ఎలా అవుతాం. మమ్మల్ని సంప్రదించి మీరేం అప్పులు చేయట్లేదు. అలాంటప్పుడు మాకెందుకీ తలనొప్పి'' అంటూ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌తో అన్నట్టు సమాచారం. సోమవారంనాడిక్కడి బస్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల ఉమ్మడి సమావేశం జరిగింది. దీనిలో టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావుతో పాటు ఇరు సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు. వాడివేడిగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. అధికారికంగా ఇప్పటికీ ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీ విభజన పూర్తికాలేదు. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్న ఆర్థిక లావాదేవీలన్నీ ఇప్పటికీ ఏపీఎస్ఆర్టీసీ పేరుపైనే సాగుతున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం టీఎస్ఆర్టీసీ ఏర్పడినా, తమ పరిధి వరకు తామే స్వీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ నిర్ణయాలు బెడిసికొట్టి ఏపీఎస్ఆర్టీసీకి తలనొప్పిగా మారుతున్నా యి. దీనిపైనే ఇరు ఆర్టీసీల ఉన్నతాధికారులు చర్చించుకున్నారు. ''మా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయ్యింది. సంస్థ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులే. ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీలో ఉన్న అనేక ట్రస్టులు, బోర్డులు ఇప్పటికీ మాపేరు మీదే ఉన్నాయి. కానీ వాటిని మీరే వాడుకుంటున్నారు. మీరు తీసుకొనే నిర్ణయాలకు మేం జవాబుదారీగా ఎలా ఉంటాం? అందువల్ల ఉమ్మడి ఆర్టీసీకి సంబంధించిన ట్రస్టులు, బోర్డులు సహా అన్నింటినీ విభజించి, మీ నిర్ణయాలు మీరు తీసుకోండి'' అని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్‌కి ఈ సమావేశంలో తేల్చిచెప్పినట్టు తెలిసింది. టీఎస్ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ నుంచి రూ.1,300 కోట్లు సొంతానికి వాడుకున్నప్పుడు రికార్డుల పరంగా ఏపీఎస్ఆర్టీసీ పేరు ఉండటంతో వారికే ఆ సంస్థ అధికారులకే నోటీసులు వెళ్తున్నాయి.ఇప్పటికి పలుమార్లు ఈ తరహా నోటీసుల్ని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తీసుకున్నారు.వాటిని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులకు పంపినప్పుడు తాత్కాలికంగా పీఎఫ్ కార్యాలయం లో ఉద్యోగుల పీఎఫ్‌లో ఎంతో కొంత చెల్లించి, మళ్లీ బకాయిల్ని అలాగే ఉంచేస్తున్నది. దీన్ని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తీవ్రంగా ఆక్షేపించారు. పీఎఫ్ ట్రస్ట్‌తో పాటు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం (ఎస్ఆర్బీఎస్), స్టాఫ్ బెనలెంట్ థ్రెఫ్ట్ ఫండ్ (ఎస్బీటీ) ట్రస్టుల్ని కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విభజించుకోవాలని నిర్ణయించారు. ఏపీఎస్ఆర్టీసీని అక్కడ ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ రెండూ అక్కడ అమల్లో లేవు. వారికి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పథకాలు అమలవుతున్నాయి. ఇవి టీఎస్ఆర్టీసీలోనే అమల్లో ఉన్నాయి. కానీ రికార్డుల్లో ఇవి ఏపీఎస్ఆర్టీసీ పేరుపైనే ఉండటంతో దానికి సంబంధించిన వ్యవహారాల నోటీసులు, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ వారికే వెళ్తున్నాయి. గతంలో రిటైర్ అయిన ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ఈ స్కీంల కింద పెన్షన్లు చెల్లిస్తున్నారు. దానికి సంబంధించిన నిధుల్లోనూ గందరగోళం ఉన్నట్టు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్ దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. వారి అభ్యంతరాలపై టీఎస్ఆర్టీసీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, ఏపీ అధికారులు వినేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. మీ ఆర్టీసీ, మీ ట్రస్టులు, మీ ఆర్థిక లావాదేవీలతో తమకెలాంటి సంబంధాలు వద్దని వారు తెగేసి చెప్పినట్టు సమాచారం. అలాగే టీఎస్ఆర్టీసీలో టిక్కెట్ రేట్లు పెంచిన దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ కూడా అదే స్థాయిలో రేట్లు పెంచాలని కోరినట్టు తెలిసింది. దీనిపై ఏపీ అధికారులు స్పందిస్తూ దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామనీ, నిర్ణయం అక్కడే జరగాల్సి ఉందని దాటవేసినట్టు తెలిసింది. అలాగే అంతరాష్ట్ర రవాణా ఒప్పందంపైనా ఇరు ఆర్టీసీల ఉన్నతాధికారులు చర్చించారు. అయితే దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. నెలరోజుల్లోపు అన్ని ట్రస్టుల ఆర్థిక లావాదేవీల గణాంకాలు, ఆస్తుల విభజన తదితర అంశాలపై పూర్తి సమాచారంతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్టు సమాచారం.