Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగం, మానవ హక్కులపై కేంద్రం దాడులు
- బీజేపీ ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ ఆగస్టు 1 నుంచి ప్రచారోద్యమం
- సావర్కార్ సిద్ధాంతంతో మోడీ : సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
భారత రాజ్యాంగం, మానవ హక్కులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 1వ తేదీ నుంచి 15 వరకు జాతీయస్థాయిలో ప్రచారోద్యమం నిర్వహించనున్నట్టు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. సోమవారం హనుమకొండ జిల్లా కాజీపేటలోని బాలవికాస భవనంలో నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలను ఏచూరి ప్రారంభించి మాట్లాడారు. ఈఏడాది ఏప్రిల్లో కేరళలో జరిగిన సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై చేసిన తీర్మానానికి అనుగుణంగా దేశంలో సెక్యులర్ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, ఆర్ధిక స్వావలంబన పరిరక్షణకు సీపీఐ(ఎం) ఉద్యమిస్తుందన్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న కేంద్ర కమిటీ సమావేశాల్లో దీనిపై చర్చించనున్నట్టు తెలిపారు.
సావర్కార్ సిద్ధాంతంతో మోడీ
హిందువులను సైన్యీకరించడం ద్వారానే దేశాన్ని హిందూ రాజ్యం చేయడం సాధ్యమవుతున్నదని 1923లో సావర్కార్ అన్నారని, దాని కోసమే ప్రధాని మోడీ కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే 'అగ్నిపథ్'ను ప్రవేశపెట్టారన్నారు. అంతేకాదు, ఇటీవల తమిళనాడులోని ఓ పాఠశాలలో 'సవార్కర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్' పేరిట వ్యాసరచన పోటీలను నిర్వహించారని, గాంధీని మరిపించి సావార్కర్ను జాతిపితగా చిత్రీకరించే కుట్ర జరుగుతుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మోడీ హయాంలో అరెస్టులు పెరిగాయని, ఛార్జ్షీట్లు వేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్లను జైళ్లల్లో మగ్గేలా చేస్తున్నారని విమర్శించారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను తీవ్రంగా దుర్వినియోగపరుస్తూ బీజేపీ రాజకీయాధికారం అనుభవిస్తుందన్నారు. మహారాష్ట్ర, గోవా, కర్నాటక, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రాకపోయినా వారి ప్రభుత్వాలే ఉండటం ఇందుకు నిదర్శనమని చెప్పారు. కేరళలో సీపీఐ(ఎం) నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తుందన్నారు. కేరళ రాజకీయాల్లో 60 ఏండ్లలో వరుసగా రెండోసారి సీపీఐ(ఎం) నాయకత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చిందని, ఇందుకు వారు అమలు చేసిన ప్రత్యామ్నాయ విధానాలే కారణమన్నారు. ఈ విషయాలపై యువతను చైతన్యవంతులను చేసి వాస్తవిక చరిత్రను ప్రచారం చేయాలని కోరారు.
నాడు బ్రిటిషు పాలనలో.. నేడు మోడీ పాలనలో
ఆహార పదార్ధాలపై పన్ను విధించే విధానాలు నాడు బ్రిటిషు పాలనలో అమలయ్యాయని, స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత నేడు అవే విధానాలను జీఎస్టీ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలుచేస్తుందని విమర్శించారు. నాడు ఉప్పుపై పన్ను వేస్తే దాన్ని నిరసిస్తూ గాంధీ దండి యాత్ర చేపట్టారని, నేడు మళ్లీ అలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. బడా పెట్టుబడిదారులకు అధిక లాభాలిచ్చి సామ్రాజ్యవాదాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు. దేశంలో బడా సంపన్నుల లాభాలు గత పదేండ్లలో ప్రతియేటా వచ్చే లాభాల కంటే ఈ ఏడాది 3 రెట్లు అధికంగా పొందారని తెలిపారు. అదానీ ప్రపంచంలోనే 4వ సంపన్నుడుగా ఎదిగాడని, ఇందుకు దేశంలో మోడీ అవలంభించిన విధానాలే కారణమన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, బతుకుదెరువుపై దాడులు పెరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాల్లో బీజేపీయేతర పాలనలో ఉన్న రాష్ట్రాలకు వాటాలను తగ్గిస్తున్నారన్నారు. కేరళలో 3 శాతం తగ్గించారన్నారు. అయోధ్యలో దేవాలయాన్ని ట్రస్టు నిర్మించాలని సుప్రీంకోర్టు తీర్పునిస్తే.. రాష్ట్రపతి, ప్రధాని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ పాల్గొని ప్రభుత్వం కార్యక్రమంగా నిర్వహించి, రాజ్యాంగం పేర్కొన్న సెక్యులర్ భావాలకు విఘాతం కలిగించారని విమర్శించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా, మరోవైపు రాజ్యాంగం, అది ఇచ్చిన హక్కులు, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వాదాన్ని కాపాడుకోవడానికి ఉద్యమించాలన్నారు.
మౌలిక వసతులతో ప్రత్యామ్నాయ విధానాలు : తమ్మినేని
మౌలిక వసతుల కల్పనే ప్రత్యామ్నాయ విధానంగా రాబోయే కాలంలో పోరాటాలు చేయాల్సిన అవసరముందుని, ఈ మేరకు రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కమ్యూనిస్టులు లేకుండా ఈ దేశానికి భవిష్యత్తు ఉందా.. అనే ఆలోచన వచ్చేలా పోరాటాలతో ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని అన్నారు. దళితులకు మూడెకరాలు, ఫించన్లు, పోడు భూములకు పట్టాలు ఇచ్చే విషయంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. పోడు భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వరంగల్, హన్మకొండ నగరాల్లో పేదలు ఇండ్ల స్థలాల కోసం ఉద్యమిస్తే గర్భిణి స్త్రీలను తన్నిన ఘటనలు ఇక్కడ జరిగాయన్నారు. అక్రమంగా ఎకరాల భూమిని కబ్జా చేస్తే పట్టించుకోని పాలకులు, పేదలు గుడిసెలు వేసుకుంటే అణచివేత చర్యలకు దిగుతున్నారు. వారి పోరాటానికి మద్దతు తెలపడానికి వస్తుంటే మార్గమధ్యలో తనని అరెస్ట్ చేశారన్నారు. తెలంగాణ వచ్చాక కాంట్రాక్టు అనే పదం ఉండదని సీఎం కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు పర్మినెంట్ అనే పదం తప్పా అన్ని పదాలు ఉన్నాయన్నారు. సమావేశంలో పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎ. విజయరాఘవన్, సీనియర్ నాయకులు కె. వెంకటయ్య, ఎస్. మల్లారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య, పోతినేని సుదర్శన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పాలడుగు భాస్కర్, డిజి నర్సింహారావు, మల్లు లక్ష్మీ, టి. జ్యోతి, జాన్వెస్లీ, టి. సాగర్ తదితరులు పాల్గొన్నారు.
సీతారాం ఏచూరికి మత్స్యకారుల ఘనస్వాగతం
రాష్ట్ర కమిటీ సమావేశాలకు విచ్చేసిన సీతారాం ఏచూరికి తెలంగాణ రాష్ట్ర మత్స్యకార్మిక సంఘం కార్మికులు వల, బుట్ట ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి డుబ్బులు వాయించి వారందరిని సంబురంలో ముంచారు.