Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడిసెలను సందర్శించిన సీపీఐ(ఎం) నాయకత్వం
- డప్పు చప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మ, బోనాలతో స్వాగతం
- గుడిసెవాసుల పోరాటాలకు అండ
- పోరాటాలతోనే హక్కుల సాధన : సీపీఐ(ఎం) జాతీయ, రాష్ట్ర నాయకులు
నవతెలంగాణ-మట్టెవాడ
పోరాటాల పురిటి గడ్డ ఓరుగల్లులో పేదవాని సొంతింటి కల సాకారానికి సీపీఐ(ఎం) అండతో జక్కలొద్దిలోని ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేసుకొని ప్రభుత్వ పెద్దలు, రౌడీలు, పోలీసులతో పోరాడిన తీరు రాష్ట్రవ్యాప్తంగా భూ పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అలాంటి పోరుగడ్డ జక్కలొద్దికి సీపీఐ(ఎం) జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు వస్తున్నారన్న సమాచారంతో గుడిసెవాసుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. పార్టీ నాయకులకు ఘనస్వాగతం పలికేందు కు చిన్న చితకా, వృద్ధులు, ఆడ మగ తేడా లేకుండా సిద్ధంకావడంతో సోమవారం ఉదయం నుండే జక్కలొద్ది ఎరుపుమయమైపోయింది. సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర, జిల్లా నాయకులు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు పేదలు బ్రహ్మరథం పట్టారు. సీతారాం ఏచూరికి చిన్నపిల్లలు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలతో బోనాలు తలమీద పెట్టుకుని ఇరువైపులా ఎర్రని కవాతుతో పూలు చల్లుకుంటూ సీపీఐ(ఎం) వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ సభాస్థలి వరకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రంగశాయిపేట ఏరియా కమిటీ పార్టీ నాయకులు సాగర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో సీతారాం ఏచూరి మాట్లాడారు. ఓరుగల్లులోని జొక్కలొద్ది గుడిసెవాసుల భూ పోరాటాలు రాష్ట్రస్థాయిలోనే కాకుండా దేశ వ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. సీపీఐ(ఎం) నాయకత్వంలో గుడిసెవాసుల సొంతింటి స్థలాల కోసం జక్కలొద్దిలో చేస్తున్న పోరాటం ఇల్లు లేని పేద ప్రజలకు జీవంలా నిలిచిందని తెలిపారు. ఇక్కడి ప్రజలకు పట్టాలివ్వాలని ప్రధాని మోడీకి, సీఎం కేసీఆర్‌కి లేఖలు రాస్తానని గుడిసె వాసులకు హామీ ఇచ్చారు.
పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. జానెడు జాగ కోసం పేదలు 50 ఎకరాల్లో 4 వేల గుడిసెలు వేసుకుంటే దుర్మార్గమైన ప్రభుత్వం పోలీసులు, రౌడీలతో గుడిసెలపై బుల్డోజర్లను ఎక్కించి హీనంగా ప్రవర్తించిందన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు జక్కలొద్దిలోని భూములను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని కోర్టులో కేసు వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకులే 250 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జాలు చేస్తే వారిని వదిలేసి పేదలపై కేసులు పెట్టారని, ఈ భూముల బాగోతాన్ని కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటున్న కేటీఆర్‌కి భూ పత్రాలు పంపిస్తామని తెలిపారు. కాలికి దెబ్బతగిలి ఇంట్లో కూర్చున్న కేటీఆర్.. కాలక్షేపం కోసం ఓటీటీలో సినిమాలు చూసే బదులు ఈ పేద ప్రజల న్యాయమైన హక్కుకు న్యాయం చేస్తే బాగుంటుందని హితవు పలికారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. నైజాములకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల హక్కులను సాధించుకున్న చరిత్ర సీపీఐ(ఎం)కు ఉందన్నారు. అదే స్ఫూర్తితో జక్కలొద్ది గుడిసెవాసులకు స్థలాలిచ్చే వరకూ అండగా నిలబడుతుందన్నారు. త్వరలో ఎలక్షన్లు రాబోతున్నాయని,ఇప్పుడే మన కలలను సాకారం చేసుకోవాలని,ఓట్ల కోసం వచ్చే నాయకులను వారిచ్చిన డబుల్ బెడ్రూం హామీలు ఎక్కడ అని నిలదీయాలని పిలుపునిచ్చారు.అనంతరం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ.. జక్కలొద్దిలో పేదలేసుకున్న గుడిసెలను ప్రభుత్వం, రౌడీలు దౌర్జన్యంగా రెండుసార్లు తొలగించినా మళ్లీ వేసుకుని అకుంఠిత దీక్షతో రాణి రుద్రమదేవిలా, సమ్మక్క సారలమ్మలు చేసిన పోరాటాల వలే ఇక్కడ మహిళలు చేస్తున్న పోరాటాలు అద్భుతమన్నారు. ఈ పోరాట స్ఫూర్తితోనే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఇల్లు లేని ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, టి.జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీశ్, స్కైలాబ్‌బాబు, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సిహెచ్.రంగయ్య, కార్యదర్శివర్గ సభ్యులు నలిగంటి రత్నమాల,ఆరూరి కుమార్,ఓదేలు రంగశాయిపేట ఏరియా కమిటీ నాయకులు పాల్గొన్నారు.