Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గందరగోళంలో వీఆర్వోలు
- మళ్లీ తెరపైకి సర్దుబాటు అంశం
- సీనియార్టీ, తదితరాంశాలపై స్పష్టత కరువు
- కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర సర్కారు!
- న్యాయపోరాటానికైనా సిద్ధం : జేఏసీ చైర్మెన్ గోల్కొండ సతీశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్వోలను ఆయా శాఖల్లో సర్దుబాటు చేస్తారనే నేపథ్యంలో ఆ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. తమ పరిస్థితేంటి? సీనియార్టీ సంగతేంటి? పదోన్నతుల మాటేంటి? సర్వీసు సమస్యలొస్తే దిక్కెవరు? చివరకు తమ బతుకులు ఇటో..అటో.. అనే విషయం తెలియక వీఆర్వోలు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. మరోవైపు జిల్లాల వారీగా వారిని సర్దుబాటు చేయాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కసరత్తు కూడా మొదలైనట్టు ప్రచారం జరుగుతున్నది. తమ హక్కులను కాపాడుకోవడం కోసం అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతామని వీఆర్ఓ జేఏసీ రాష్ట్ర సర్కారుకు అల్టిమేటం జారీ చేసింది. అందులో భాగంగానే ఆ ఉద్యోగులు విధులకు దూరంగా ఉంటున్నారు.మన రాష్ట్రంలో ఉన్న 5485 వీఆర్వోలు రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో కీలకపాత్ర వహిస్తూ వచ్చారు. ప్రతి గ్రామంలోని భూ సమస్యలపైనా, భూముల వివరాలపైనా ఆ మండల, డివిజన్ స్థాయి అధికారుల కంటే వీరికే పట్టు ఎక్కువగా ఉందన్నది జగమెరిగిన సత్యం. రెవెన్యూ వ్యవస్థలో అవినీతి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలోని వీఆర్వోలే కారణమంటూ సీఎం అసెంబ్లీ సాక్షిగా వారిపై ముద్ర వేసి మరీ ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది జరిగి దాదాపు రెండేండ్లు కావస్తున్నది. ఆ సమయంలోనే పంచాయతీరాజ్, నీటిపారుదల, పురపాలక, విద్యా శాఖల్లో వారిని సర్దుబాటు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే, నేటికీ దేనిపైనా స్పష్టత లేదు. వారికి ఎలాంటి హోదా లేదు. వీరిని ఏ పేరుతో పిలవాలో అధికారులకే తెలియని పరిస్థితి. అయినా, వారికి పనిభారం మాత్రం తప్పట్లేదు. వ్యవస్థలోని కొందరు చేసిన తప్పిదాలకు వీఆర్వోలందరిపైనా అవినీతిపరులనే ముద్రపడటంతో నూన్యతాభావంతో బతుకులనీడుస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 200కిపైగా వీఆర్వోలు మానసిక వేదనకు తట్టుకోలేక గుండెపోటు, ఇతరత్రా అనారోగ్యాలతో చనిపోయినట్టు జేఏసీ నేతలు పలుమార్లు మొరపెట్టుకున్నారు. ఓ పనంటూ లేక అధికారులు చెప్పిందలా గొడ్డుచాకిరీ చేయాల్సి వస్తున్నది. ఓటర్ల జాబితా రూపొందించటం, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కుల, ఆదాయ, తదితర ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్లియరెన్స్ ఇవ్వటం, తదితర పనులను ఉన్నతాధికారులు చేయిస్తున్నారు.
ఆయా శాఖల్లో వీఆర్వోలను సర్దుబాటు చేయడం వల్ల 10 నుంచి 14 ఏండ్ల సీనియార్టీనీ, పదోనోత్నతులను కోల్పోయే ప్రమాదముంది. సీనియారిటీ, సర్వీసు రూల్స్, ప్రమోషన్లు, 2019లో అపాయింట్ అయిన వీఆర్వోల సంగతి, కారుణ్యనియామకాలు, తదితర అంశాలనేమీ పరిగణనలోకి తీసుకోకుండా జిల్లా యంత్రాంగాలకు సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేసిందనే ప్రచారంపై వీఆర్వోలు భగ్గుమంటున్నారు. సర్వీస్ కోల్పోకుండా రెవెన్యూ శాఖలోనే అర్హతను బట్టి సీనియర్ అసిస్టెంట్లు, గిర్దావర్లుగా ఉద్యోగోన్నతి కల్పించి మిగతావారిని జూనియర్ అసిస్టెంట్లుగా రెవెన్యూ శాఖలో కొనసాగించాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.
రెవెన్యూలోనే ఉంచాలి.. హక్కుల కోసం న్యాయపోరాటానికైనా సిద్ధం
వీఆర్వోలను వేరే శాఖల్లోకి సర్దుబాటనేది సరిగాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం వల్ల సీనియార్టీ, ప్రమోషన్ల విషయంలో మాకు తీవ్ర నష్టం చేకూర్చే ప్రమాదముంది. మా గోడును సీఎస్, సీఎంను చెప్పుకుందామంటే అనుమతి దొరకట్లేదు. నూతనంగా ఏర్పడిన జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో పోస్టులను సృష్టించి వీఆర్వోలతో భర్తీచేయాలి. జనాభా దామాషా పద్ధతి ప్రకారం రెవెన్యూ శాఖలో పోస్టుల సంఖ్యను పెంచి ఇప్పుడున్న వీఆర్వోలతో నింపాలి. లేనిపక్షంలో తమ హక్కుల కోసం రాష్ట్ర సర్కారుపై న్యాయపోరాటానికి సిద్ధమవుతాం.
- గోల్కొండ సతీశ్, వీఆర్వోల జేఏసీ చైర్మెన్