Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల పట్ల యాజమాన్యం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారి హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నెల రోజుల్లో సమస్యలు పరిష్కారిస్తామని హామి ఇచ్చారని గుర్తుచేశారు. మంత్రి హామీలు నేరవేరనందున తిరిగి వారు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఆందోళన చేస్తారనే కారణంతో వారి పట్ల అడ్మినిస్ట్రేషన్ అప్రజాస్వామిక చర్యలకు దిగిందని పేర్కొన్నారు. వారి ఫోన్లపై నిషేధం విధించడం, మీడియాను నిషేదించడం, ఆందోళన చేస్తే సమాచారం బయటకు రాకుండా అడ్డుకునే చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఇది విద్యార్థుల హక్కులను పూర్తిగా హరించడమేననీ, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మీడియాకు కూడా పోలీసులు బందోబస్తుతో తీసుకెళ్ళడం, విద్యార్థుల హాస్టళ్ల దగ్గర పోలీసులను కాపలా ఉంచడం లాంటి చర్యలు అప్రజాస్వామికమైనవని తెలిపారు. తమ సమస్యలను బయటకు చెప్పవద్దంటూ విద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ చర్యలను అడ్మినిస్ట్రేషన్ ఉపసంహరించుకోవాలనీ, లేదంటే విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఓయూలో పీహెచ్డీ నోటిఫికేషన్ వేయాలి
ఓయూలో పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల వేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఓయూలో పీహెచ్డీ నోటిఫికేషన్ లేక మూడేండు గడిచిపోయిందని తెలిపారు. దీంతో పరిశోధన చేయాలనుకుంటున్న విద్యార్ధులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. గతంలో వీసీ లేరనే కారణంతో రెండేండ్లు నోటిఫికేషన్ వేయకుండా గడిపారనీ, వీసీలు వచ్చిన తర్వాత కూడా మరో ఏడాది గడిచిపోయిందని తెలిపారు..చాలా మంది విద్యార్థులు నెట్,సెట్ క్వాలిపైడ్ అయి పీహెచ్డీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. జేఆర్ఎఫ్ సాధించిన విద్యార్థులకు కూడా నోటిఫికేషన్ రాకపోతే ఫెలోషిప్ నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. గతంలో ఏ నిందనలైతే ఉన్నాయో వాటికనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.