Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ వైద్యుల సంఘంతో మంత్రి హరీశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కొన్ని మెడికల్ కాలేజీల పరిధిలోని కొన్ని విభాగాల్లోనే ఈవినింగ్ క్లినిక్‌లు నిర్వహించనున్నారని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది. సోమవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో ఆ సంఘం అధ్యక్షులు డాక్టర్ పల్లం ప్రవీణ్, ఉస్మానియా విభాగం అధ్యక్షులు డాక్టర్ రంగా, గాంధీ విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ భూపీందర్, నాగర్ కర్నూల్ డాక్టర్ శేఖర్ సమావేశమై చర్చించారు. అనంతరం ఆ సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. సిబ్బంది సరిపడినంతగా ఉన్న చోట మాత్రమే సాయంత్రం క్లినిక్‌లను నిర్వహించనున్నారని తెలిపారు. అక్కడ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు విధులు నిర్వహించే వారికి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఓపి విధుల నుంచి మినహాయింపు ఉంటుందని మంత్రి స్పష్టతనిచ్చినట్టు వారు పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని మంత్రి చేసిన ప్రతిపాదనను తాము వ్యతిరేకించినట్టు నాయకులు వెల్లడించారు. ఈ విషయంపై సీఎంతో చర్చిస్తానని హరీశ్ రావు హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు సంబంధించి ఇతర యూజీసీ టీచర్ల మాదిరిగా సెలవులు ఇస్తానన్న మంత్రి ప్రతిపాదనను కూడా తాము ఆమోదించలేదని నాయకులు చెప్పారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌తో చర్చించి కేబినెట్ ఆమోదానికి ప్రతిపాదనలు పెట్టనున్నట్టు మంత్రి హామీనిచ్చారని వెల్లడించారు. సమీప భవిష్యత్తులో డిమాండ్లు నెరవేరుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.