Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదేండ్ల సర్వీస్ ఉంటే...రూ.వెయ్యి పెన్షన్
- స్పష్టత ఇచ్చిన టీఎస్ఆర్టీసీ యాజమాన్యం
- ఉద్యోగులు మాయలో పడొద్దు-కార్మిక సంఘాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీలో ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) తీసుకుంటే, సంస్థ రెగ్యులేషన్స్‌లో ఏవైతే ఉన్నాయో, వాటినే చెల్లిస్తామని యాజమాన్యం వివరణ ఇచ్చింది. అంటే...సాధారణ రిటైర్మెంట్కు ఏ ప్రయోజనాలైతే వర్తిస్తాయో, వీఆర్ఎస్ తీసుకున్నా, వాటినే ఇస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం సోమవారం వీఆర్ఎస్పై ఉద్యోగులకు వివరణ ఇస్తూ సర్వీస్ రెగ్యులేషన్స్ సర్క్యులర్ విడుదల చేసింది. నిబంధనల ప్రకారం ఉద్యోగులకు వర్తించే గ్రాట్యుటీ, పీఎఫ్ ఇస్తామని పేర్కొంది. స్టాఫ్ బెనివలెంట్ కమ్ థ్రెఫ్ట్ స్కీం (ఎస్బీటీ)కు ఉద్యోగులు కట్టిన సొమ్ముకు వడ్డీతో కలిపి ఇచ్చేస్తామని తెలిపారు. అలాగే స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం (ఎస్ఆర్బీఎస్) కూడా ఉద్యోగుల కట్టిన సొమ్మును వీఆర్ఎస్ తీసుకొనే నాటికి వడ్డీని లెక్కించి ఇస్తామన్నారు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం (ఈపీఎస్)లో కనిష్ట సర్వీసు 10 ఏండ్లు ఉంటే నెలకు రూ.వెయ్యి చొప్పున పెన్షన్ ఇస్తామని తెలిపారు. టెర్మినల్ బెనిఫిట్ ఆఫ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఒకనెల జీతంతో పాటు సంస్థ రెగ్యులేషన్స్‌లోని సాధారణ బెనిఫిట్స్ అన్నీ వర్తిస్తాయని వివరణ ఇచ్చారు. అలాగే వీఆర్ఎస్ తీసుకునే అధికారులకు సిటీ, సబర్బన్, ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, జిల్లాల్లో డీలక్స్ సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంటుందని చెప్పారు. జిల్లా సర్వీసుల్లో సూపర్ లగ్జరీ ఆపై సర్వీసుల్లో 50 శాతం టిక్కెట్ రాయితీ ఉంటుందనీ, ఉద్యోగి మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి ఈ రాయితీలు వర్తిస్తాయని తెలిపారు.
కార్మికులు మాయలో పడొద్దు: వీ తిరుపతి, అధ్యక్షులు, టీఎమ్‌యూ
పాత సర్కులర్‌నే వివరంగా ఇచ్చారు. అన్ని కండిషన్స్ ఆర్టీసీ రెగ్యులేషన్స్‌లో ఉన్నవే. ఇది ఏ మాత్రం కార్మికులకు మేలు చేయదు. వీఆర్ఎస్ ఇవ్వాలనే ఆలోచన యాజమాన్యానికి ఉంటే 'గోల్డెన్ షేక్ హ్యాండ్' లాగా మంచి పథకం తేవాలి. అంతే కానీ, మసి పూసి మారేడు కాయ చేయడం తగదు. ఇప్పటికే రావాల్సిన రెండు పే రివిజన్లు, ఆరు డిఏల ప్రస్తావనే లేదు. కార్మికులెవరు ఈ మాయలో పడొద్దు.
అదనంగా ఇచ్చేదేం లేదు: వీఎస్ రావు,
ప్రధాన కార్యదర్శి టీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్
యాజమాన్యం సోమవారం ఇచ్చిన సర్క్యులర్ ద్వారా కార్మికులకు అదనంగా ఇస్తున్నది ఏమీ లేదు. రిటైర్డ్ ఎంప్లాయి మెడికల్ స్కీం వర్తించదు. ఎస్ఆర్బీఎస్ నెలవారీ ప్రయోజనాలు ఇవ్వరు. 2017, 2021 పే స్కేల్, రావల్సిన ఆరు డిఏల పరిస్థితి ఏంటి? కార్మికులు ఆలోచించుకొని స్పందించాలి.
వీఆర్ఎస్ తీసుకోవద్దు:కే రాజిరెడ్డి,
ప్రధాన కార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్
ఆర్టీసీ కార్మికులు ఎవరూ వీఆర్ఎస్ తీసుకోవద్దు. ఈ స్కీం వల్ల కార్మికులకు వచ్చే అదనపు ఆర్థిక ప్రయోజనాలు ఏమీ లేవు. అనవసరంగా కుటుంబాలను ఇబ్బందులపాలు చేసుకోవద్దు. ఈ స్కీంను గతంలోనే అమల్లోకి తేవాలనుకున్నారు. కరోనా కారణంగా వాయిదా పడి, ఇప్పుడు అమల్లోకి తెస్తున్నారు.