Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేళ్లచెర్వు గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం
నవతెలంగాణ-మేళ్లచెరువు
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం మైహోం యూనిట్ -4 నిర్మాణ అనుమతులకు నిరాకరించింది. మై హోం సిమెంట్ పరిశ్రమ నూతనంగా నిర్మించనున్న యూనిట్-4 అనుమతులపై సోమవారం గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ పందిళ్ళపల్లి శంకర్రెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో గ్రామాభివృద్ధి, మైహోం సంస్థ నిర్మాణ అనుమతులపై కీలకచర్చ జరిగింది. మైహోం నిర్మించతలపెట్టిన ప్రాజెక్ట్ వివరాలు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతుల గురించి, ప్రజాభిప్రాయ సేకరణలో ఆ సంస్థ ఇచ్చిన హామీల గురించి, ప్రస్తుత నిర్మాణ అనుమతులకు సంబంధించిన వివరాలు పాలకవర్గ సభ్యులకు సర్పంచ్ శంకర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నారాయణరెడ్డి వివరించారు. స్థానికులకు ఉద్యోగుల కల్పనపై స్పష్టమైన హామీ, పలువురు నిరుద్యోగ యువతకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేంతవరకు నిర్మాణ అనుమతులు జారీ చేయవద్దని పాలకవర్గసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. నిర్మాణ అనుమతుల కోసం ఆ సంస్థ చేసుకున్న దరఖాస్తుల్లో కనీస ప్రమాణాలు పాటించలేదని తెలిపారు. నిర్మాణాలు చేపట్టే ప్రదేశానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్, రెవెన్యూ క్లియరెన్స్ పత్రాలు సమర్పించలేదని, 64 దరఖాస్తులకు సంబంధించి ఏ ఒక్క దరఖాస్తులో కూడా నిర్మాణ స్థలం సర్వే నెంబర్ కానీ, హద్దులు గాని పేర్కొనకపోవడంతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. మేళ్లచెరువు పరిధిలోని వివాదాస్పద సర్వేనెంబర్ 1057లోని 113 ఎకరాల భూదాన్ భూముల్లో మైహోం యాజమాన్యం ఎటువంటి అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమకట్టడాలను రెవెన్యూ అధికారుల సహాయంతో తొలగిస్తామని అధికారులు చెప్పారు. సమావేశంలో జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇమ్రాన్, ఉపసర్పంచ్ బుస్సా లక్ష్మీశ్రీనివాస్, గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యులు పసుపులేటి అంజయ్య,ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్ బ్రహ్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.