Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లబ్యాడ్జీలతో టీచింగ్ డాక్టర్ల నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్-డీఎంఈ) పోస్టును సష్టించాలని బోధనా వైద్యులు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌పై తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) పిలుపులో భాగంగా సోమవారం ఉస్మానియా, గాంధీ, నిజామాబాద్ తదితర బోధనాస్పత్రుల్లో వేలాది మంది డాక్టర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల సాధన కోసం మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో ఇదే విధంగా నిరసన తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు అందజేశారు. 56 నెలల పీఆర్సీ బకాయిలను చెల్లించాలనీ, సాధారణ బదిలీలను చేపట్టాలనీ, ఈఎల్ ఎన్క్యాష్మెంటు, కెరీర్ అడ్వాన్సుమెంటు స్కీం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నల్లబ్యాడ్జీల ప్రదర్శన మంగళవారం కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను సాధించుకునే క్రమంలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరసన ప్రదర్శనల్లో తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం అధ్యక్షులు డా.అన్వర్ , ప్రధాన కార్యదర్శి డా. జలగం తిరుపతి రావు , ట్రెజరర్ డా. కిరణ్ ప్రకాష్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్ మాదాల, డా. ప్రతిభా లక్ష్మి ,లోకల్ యూనిట్ అద్యక్షులు, కార్యదర్శులు, ట్రేజరర్లు , ఇతర వైద్యులు పాల్గొన్నారు.
నిరసన కొనసాగుతుంది....పుకార్లు నమ్మొద్దు
సమ్మెను నీరుగార్చేందుకు ఒక అధికారి ప్రయత్నిస్తున్నారని టీటీజీడీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అన్వర్, డాక్టర్ జలగం తిరుపతిరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ అధికారి తన తొత్తులను పిలిచి లోపాయికారి ఒప్పందాలను చేసుకుంటున్నారని ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. అసోసయేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పేర్లతో వచ్చే ప్రకటనలు తప్ప సభ్యులు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని కోరారు.