Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాసత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు
- భయభ్రాంతులకు గురి కావద్దు
- డెంగ్యూ నివారణలో ప్రజలే కీలకం
- ఇంటింటికీ కరోనా బూస్టర్ డోసు
- మంకీపాక్స్ అనుమానితుని ఫలితం నేడోరేపో చెబుతాం: మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల భయంతో ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేల రూపాయలు ఖర్చుపెట్టుకోవద్దని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డెంగ్యూ కేసులు పెరిగిన నేపథ్యంలో ప్లేట్ లెట్లు తగ్గాయంటూ ప్రయివేటు ఆస్పత్రులు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని మీడియా ప్రతినిధులు మంత్రి దష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సమాధానంగా మంత్రి, డెంగ్యూ చికిత్సకు అవసరమైన అన్ని సౌకర్యాలను జిల్లాస్పత్రుల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వాస్పత్రులను ఉపయోగించుకోవాలని కోరారు. గతంతో పోలిస్తే సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయనీ, అయితే ఐదేండ్లకు ఒకసారి డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. డెంగ్యూ నివారణలో ప్రజలే కీలకమనీ, నీరు నిల్వలేకుండా, దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల స్థాయిలో ర్యాపిడ్ కిట్లు, పట్టణాల స్థాయిలో ఆర్టీసీపీఆర్ టెస్టుల కిట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రజలు కాచి వడబోసిన నీటినే తాగాలని సూచించారు. డెంగ్యూ కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి లో ఎక్కువగా ఉంటున్నందున మేడ్చల్ కలెక్టర్ గా పని చేసిన అనుభవమున్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ శ్వేతా మహంతిని ప్రత్యకాధికారిగా నియమించినట్టు తెలిపారు. దోమతెరలను ప్రభుత్వం పంపిణీ చేసిందనీ, ప్రజలు వాటిని వాడేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. అత్యవసర పరిస్థితిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్ల అనుసంధాన పునరుద్ధరణ కోసం రోడ్లు, భవనాలశాఖకు రూ.10 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.10 కోట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి విడుదల చేశారని గుర్తుచేశారు.
కలెక్టర్లు, ఫుడ్ ఇన్ స్పెక్టర్లు హాస్టళ్లను తనిఖీ చేయాలి
సంక్షేమ వసతి హాస్టళ్లలో తరచూ నీటి, ఆహార కాలుష్యాలతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా సమీక్షించినట్టు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు విధిగా ఆయా హాస్టళ్లను సందర్శించి ఆహారం, నీటిని తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆహార నాణ్యత ఉండేలా పౌరసరఫరాల శాఖ మంత్రితో పాటు అధికారులు బాధ్యత తీసుకోవాలని కోరారు. గురుకులాల్లో నాణ్యత లేని బియ్యం ఉంటే వెంటనే వెనక్కి తీసుకుని నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కోరినట్టు మంత్రి తెలిపారు.
ఇంటింటికీ బూస్టర్ డోసు
రాబోయే నెల రోజుల పాటు ఇంటింటికీ తిరిగి కరోనా బూస్టర్ డోసు ఇవ్వనున్నట్టు తెలిపారు. అన్ని విద్యాసంస్థల్లో బూస్టర్ డోసు వేసే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా బూస్టర్ డోసు వేసుకోవాలని పిలుపునిచ్చారు.
మంకీపాక్స్ ఫలితాలు నేడు లేదా రేపు
కువైట్ నుంచి వచ్చిన ఇబ్రహీం ఈ నెల ఆరో తేదీ నుంచి కామారెడ్డికి వచ్చినట్టు మంత్రి తెలిపారు. 20వ తేదీ నుంచి జ్వరం, మొహం, చేతులపై మచ్చలు వంటి మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అతన్ని ఫీవర్ ఆస్పత్రిలో చేర్చినట్టు తెలిపారు. అతని నమూనాలను సేకరించి గాంధీ ఆస్పత్రిలో పరీక్షలకు పంపించామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ నోడల్ సెంటర్ పుణెలోని ల్యాబ్‌కు కూడా పంపించినట్టు తెలిపారు. అతనితో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులు తదితరులను ట్రేస్ చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. బాగా ఉడకబెట్టని మాంసం, మంకీపాక్స్ సోకిన వ్యక్తి శరీరద్రవ్యాలు, వాడిన వస్త్రాలను ఇతరులు వేసుకోవడం ద్వారా ఈ వ్యాధి విస్తరిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు.
విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహించాలి
మంకీపాక్స్ దేశంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో దీన్ని అరికట్టేందుకు విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లోనే పరీక్షలు నిర్వహించాలని హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వారిలో ఎక్కువగా మంకీపాక్స్ అనుమానిత లక్షణలు కనిపిస్తుండటంతో వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఎంఐడీసీ ద్వారా మంకీపాక్స్ పరీక్షల కిట్లను సేకరిస్తున్నట్టు తెలిపారు.
స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ సేకరిస్తాం....
రాష్ట్రంలో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ నిల్వ ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఒకవేళ అలాంటి కొరత ఉంటే తీర్చేందుకు ప్రయత్నిస్తామని హరీశ్ రావు చెప్పారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కొరతపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, అలాంటి పరిస్థితి లేకుండా చూస్తామని చెప్పారు.