Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిండా మునిగిన ఆర్టీసీ కార్మికులు
- నిరర్థక ఆస్తులుగా మారిన బ్యాంకు ఖాతాలు
- అప్పు పుట్టే దిక్కులేదు
- యాజమాన్య అనాలోచిత నిర్ణయం
- ఎస్బీఐ నుంచి యూబీఐకు ఖాతాలు మార్చిన ఫలితం
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్షంగా తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం ఆ సంస్థ ఉద్యోగులను ఆర్థిక నేరగాళ్లుగా నిలిపింది. నిష్ఠూరంగా ఉన్నా ఇది నిజం. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా ఏదైనా బ్యాంకుకు వెళ్ళి తమకు అత్యవసరంగా ఏదైనా రుణం కావాలని అడిగితే ''సారీ...మీకు లోన్ రాదు. మీ ఖాతా నిరర్థక ఆస్తుల జాబితా (ఎన్పీఏ)లో ఉంది'' అనే మాటే వినిపిస్తోంది. చివరకు వారి జీతం ఖాతాలున్న బ్యాంకు కూడా వారికి రుణాలు ఇచ్చేందుకు విముఖత చూపిస్తోంది. ప్రభుత్వ, యాజమాన్య నిర్ణయాలు ఆర్టీసీని అన్ని విధాలా ఆగం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహకారం కోరకుండా, సంస్థను అభివృద్ధి చేసి తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలనే యాజమాన్య తాపత్రయం, ఇప్పుడు సంస్థతో పాటు కార్మికులనూ నట్టేట ముంచేసింది. వివరాల్లోకి వెళ్తే... టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎమ్డీ)గా వీసీ సజ్జనార్ రాకముందు వరకు ఆ సంస్థతో పాటు వారి ఉద్యోగుల ఖాతాలన్నీ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)లో ఉండేవి. సజ్జనార్ ఎమ్‌డీగా వచ్చాక, ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఎస్బీహెచ్ నుంచి ఖాతాలన్నింటినీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)కి మార్చారు. దీనికీ కారణం లేకపోలేదు. టీఎస్ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు అప్పుకావాలని యాజమాన్యం ఎస్బీఐ (అప్పటికి ఎస్బీహెచ్ ఎస్బీఐలో విలీనం అయ్యింది) ని సంప్రదిస్తే, ఇప్పటికే అప్పుల్లో ఉన్న సంస్థకు మరిన్ని అప్పులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీనితో యాజమాన్యం అప్పుకోసం యూబీఐని సంప్రదిస్తే, కొన్ని షరతులతో రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆ షరతుల అమల్లో భాగంగా ఎస్బీఐలో ఉన్న టీఎస్ఆర్టీసీ యాజమాన్య, ఉద్యోగుల ఖాతాలన్నింటినీ యూబీఐకి మార్చేశారు. అయితే అప్పటికే సంస్థ ఉద్యోగులు ఎస్బీఐలో వివిధ రకాల రుణాలను తీసుకొని ఉన్నారు. కరోనా కూడా తోడవడంతో సంస్థలోని ప్రతి ఉద్యోగి ఏదో ఒక రుణం ఎస్బీఐ నుంచి పొందారు. యాజమాన్యం ఒకేసారి జీతం ఖాతాలన్నింటినీ యూబీఐకి మార్చడంతో నెలవారీ వాయిదా (ఈఎమ్ఐ)లను కార్మికులు ఎస్బీఐకి సకాలంలో చెల్లించలేకపోయారు. దీనితో క్రమేణా వీరి ఖాతాలన్నీ నిరర్థక ఆస్తుల జాబితా (ఎన్పీఏ)లోకి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల రుణాలన్నీ ఇలాగే ఎన్పీఏలుగా మారాయి. టీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉన్న హైదరాబాద్‌లోని ఎస్బీఐ టీఎస్ఆర్టీసీ బ్రాంచ్ (ఆర్టీసీ కళ్యాణమండపం ప్రాంగణంలో ఉంది)లోని 28వేల ఆర్టీసీ కార్మికుల ఖాతాలన్నీ ఎన్పీఏలుగా మారాయి. ఇది ఒక్క బ్రాంచ్‌కు సంబంధించిన వ్యవహారమే. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్బీఐ శాఖల్లోనూ ఆర్టీసీ కార్మికుల ఖాతాలన్నీ ఎన్పీఏలుగా మారాయి (దాదాపు 48వేల ఖాతాలు) ఈ ఏడాది మార్చి నాటికే క్రమేణా ఎస్బీఐలో ఎన్పీఏల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీనిపై ఆ బ్యాంకు ఉన్నతాధికారులు అనేకసార్లు ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తులు చేశారు. అయినా యాజమాన్యం పట్టించుకోలేదు. దీనితో కార్మికుల రుణాలకు ఆర్టీసీ యాజమాన్యం పూచీకత్తు ఇచ్చిందనీ, ఉద్యోగులు రుణాలు చెల్లించట్లేదు కాబట్టి ఆ సొమ్మును యాజమాన్యమే చెల్లించాలని కోరుతూ ఎస్బీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి టీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి గత నెలలో లీగల్ నోటీసులు పంపినట్టు సమాచారం. దీనితో బిత్తరపోయిన యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
మీ జీతాల్లో కోత పెడతాం-చీఫ్ పర్సనల్ మేనేజర్
ఉద్యోగులు ఎస్బీఐలో తీసుకున్న రుణాలను చెల్లించకపోవడంతో యాజమాన్యమే నేరుగా వారి జీతాల్లోంచి కోతలు పెడతామంటూ టీఎస్ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎమ్) ఓ సర్క్యులర్ విడుదల చేశారు. 2022 జూన్ నుంచి ఉద్యోగుల జీతాల్లో ఎస్బీఐ రుణం మొత్తాన్ని మినహాయించి, తామే బ్యాంకుకు చెల్లిస్తామని దానిలో పేర్కొన్నారు. అలాగే ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక అవసరాలు సాఫీగా సాగాలంటే బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించాలనీ, లేకుంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (సిబిల్) స్కోర్ తగ్గి, ఎన్పీఏలుగా మారతారనీ, ఆ తర్వాత ఏ బ్యాంకూ రుణాలు ఇవ్వబోదని ఆ సర్క్యులర్‌లో హెచ్చరించారు. అయితే జూన్ నెల జీతంలో ఈఎమ్ఐల సొమ్ము కోత పెట్టిన యాజమాన్యం దానిని ఎస్బీఐకి చెల్లించలేదని సమాచారం.
మా బ్రాంచ్‌లోనే రూ.11.8 కోట్లు ఎన్పీఏ అయ్యాయి
రాగంపూడి శ్రీనివాస్, చీఫ్ మేనేజర్, ఎస్బీఐ టీఎస్ఆర్టీసీ బ్రాంచ్
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు గతంలో తీసుకున్న రుణాలను చెల్లించట్లేదు. వారికి సంబంధించి 28 వేల ఖాతాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1.80 కోట్లు ఎన్పీఏ కాగా, జూన్ నాటికి ఆ మొత్తం రూ.11.8 కోట్లకు పెరిగింది. ఇది మా ఒక్క బ్రాంచ్‌కు సంబంధించిన మొత్తమే. రాష్ట్రవ్యాప్తంగా మా బ్యాంకు శాఖలన్నింటిలో కలిపి ఖాతాలు, బకాయిల సొమ్ము మొత్తం ఇంకా ఎక్కువే ఉంటాయి. నేను ఇటీవలే బ్యాంకు చీఫ్ మేనేజర్‌గా వచ్చాను. ఇంకా దీనిపై పూర్తిస్థాయి సమాచారం తెలీదు. మా బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి టీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు పంపి ఉండొచ్చు. ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగుల జీతాల్లోంచి ఈఎమ్ఐ సొమ్ము మినహాయించినా, నేరుగా మాకు చెల్లించలేరు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ఈసీఎస్) ఫామ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే యూబీఐ నుంచి మా రుణ వాయిదాల సొమ్మును తీసుకోగలుగుతాం. జూన్ నెలలో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నుంచి మాకెలాంటి రుణ వాయిదాల సొమ్మూ రాలేదు. ఆర్టీసీ ఉద్యోగుల ఎన్పీఏల సొమ్ము మా బ్యాంక్ తెలంగాణ సర్కిల్ పరిధిలోనే అత్యధికంగా నమోదై ఉన్నాయి. సొమ్ము చెల్లించమనే మేం కోరుతున్నాం.