Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల తిండిపై పన్నేస్తున్న కాషాయ ప్రభుత్వం
- ఆంగ్లేయులను తరిమినట్టే బీజేపీనీ గద్దె దింపుదాం
- అప్పుడే ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం
- స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా అందరికీ విద్య, వైద్యం, ఇండ్లు, ఉపాధి ఏది..?
- మోడీకీ ఇందిరాగాంధీకి పట్టినగతే ...
- మతోన్మాదాన్ని తిప్పికొట్టాలి
- కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
- రాజ్యాంగం మూలస్తంభాలపై బీజేపీ సర్కార్ దాడి
- దేశాన్ని, లౌకికప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
- 8 ఏండ్లయినా ఇండ్లు కట్టివ్వని రాష్ట్ర ప్రభుత్వం :
- హన్మకొండ బహిరంగసభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
హన్మకొండ నుంచి బొల్లె జగదీశ్వర్
దేశానికి స్వాతంత్య్రం సంపాదించడం కోసం నాడు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా ఎలా పోరాటం చేశారో అదేతరహాలో నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం వస్తుందన్నారు. ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీనే ప్రజలు ఓడించారని ఆయన గుర్తు చేశారు. ఆమెకు పట్టినగతే ప్రధాని మోడీకి పడుతుందని హెచ్చరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా హన్మకొండ పట్టణంలో మంగళవారం పబ్లిక్ గార్డెన్ నుంచి అమృత గార్డెన్ వరకు పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ జిల్లా కన్వీనర్ చక్రపాణి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభనుద్దేశించి సీతారాం ఏచూరి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయిన సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమృత మహోత్సవాలను నిర్వహిస్తున్నదని చెప్పారు. ఈ క్రమంలో ఇప్పటికీ అందరికీ విద్య, వైద్యం, ఇండ్లు, ఉపాధి అవకాశాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమృత మహాత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇండ్లపై జాతీయ జెండాను ఎగరేయాలంటూ ప్రధాని మోడీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆయన హయాంలో ఏం ప్రగతి సాధించారని జాతీయ జెండాను ప్రతి ఇంటిపై ఎగరేయాలంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. బ్రిటీష్ ప్రభుత్వం అన్నం, ఉప్పుపై పన్ను వేస్తే గాంధీ పోరాటం చేశారని గుర్తు చేశారు. తద్వారా దాన్ని రద్దు చేయించారని చెప్పారు. 75 ఏండ్ల తర్వాత మోడీ ప్రభుత్వం తినే తిండిపైనా, ఆహారంపైనా, నిత్యావసర వస్తువులపసైనా జీఎస్టీ వేసిందని విమర్శించారు. ఆనాడు సీపీఐ(ఎం)కు చెందిన నవరత్నాలైన ఏకేజీ, హరికిషన్‌సింగ్ సూర్జిత్, సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, ఈఎంఎస్ నంబూద్రిపాద్ వంటి నాయకులను అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారని చెప్పారు. అయినా వారు జాతీయ జెండాను ఎగరేసి.. దేశభక్తిని చాటుకున్నారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఇప్పుడు దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశాన్ని లూటీ చేస్తున్న మోడీ ప్రభుత్వం అందరికీ విద్య,వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించకుండా దేశాన్ని లూటీ చేస్తున్నదని ఏచూరి ఈ సందర్భంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజా పోరాటాలను బలపర్చాలని పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలు ముందుకొచ్చినప్పుడు మతోన్మాద చర్యలకు పాల్పడుతూ వాటిని మరుగున పరిచేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఇలాంటి చర్యలను ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ హయాంలో... ఎనిమిదేండ్ల కాలంలో బ్యాంకుల నుంచి బడా బాబులు తీసుకున్న రూ.11 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారనీ, వారికి రాయితీలిచ్చారని విమర్శించారు. దేశాన్ని దోచుకుని, లూఠీ చేసి తమ మిత్రులైన అదానీ, అంబానీకి కట్టబెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతం పేరుతో వైషమ్యాలు పెంచటం ద్వారా బీజేపీ ప్రజల మధ్య చీలికలు తెస్తున్నదని విమర్శించారు. తద్వారా హిందూ ముస్లింల మధ్య ఘర్షణలను పెంచి పోషిస్తున్నదని అన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుల బతుకులు దారుణంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ధరలు, భారాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం కాకుండా వాటిపై పోరాడకుండా మతాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తున్నదని చెప్పారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలను బలపర్చాలనీ, సమస్యలపై ఆందోళనలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజా పోరాటాల స్ఫూర్తికి నిదర్శనం
వరంగల్ జిల్లాలో ఇంటిజాగా కోసం గుడిసెలు వేసుకున్న ప్రాంతాలను సోమవారం పరిశీలించామని ఏచూరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పక్కా ఇండ్లు కట్టిస్తామంటూ ఎనిమిదేండ్ల క్రితం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదని చెప్పారు. గుడిసెలు వేసుకుంటే మూడుసార్లు దాడులు చేసి వాటిని కూలగొట్టినా పేదలు మళ్లీ వాటిని వేసుకుని అక్కడే ఉండటం వారి పోరాట స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. కలిసి పోరాడితేనే హక్కులను కాపాడుకోగలమని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. సమస్యలపై పోరాటం చేయాలనీ, వాటిలో అందర్నీ భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.
రండి దేశాన్ని కాపాడుకుందాం
రాజ్యాంగ మూలస్తంభాలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తున్నదని ఏచూరి విమర్శించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక స్వావలంబనను, సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకునేందుకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని సందప అంతా ప్రజలదనీ, కార్పొరేట్ శక్తులది కాదని అన్నారు. మెరుగైన భారత్‌ను నిర్మించడం కోసం ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.
కుర్చీ ఉంటే ఒకమాట... లేకుంటే మరోమాట
- మంత్రి ఎర్రబెల్లిపై రాఘవులు ఆగ్రహం
బంగారు తెలంగాణ నిర్మిస్తామంటూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు గుర్తు చేశారు. కానీ బంగారం కాదు.. పేదలు మట్టి కావాలని అడుగుతున్నా అది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. బంగారు తెలంగాణలో మేడలు, మెర్సిడెజ్ బెంజ్ కార్లు అడగడం లేదని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారం ఉండి కుర్చీలో ఉంటే ఒకమాట, కుర్చీ లేకుంటే మరోమాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీడలేని పేదలపై దాడులెందుకు, కేసులెందుకు, అరెస్టులెందుకని ప్రశ్నించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎవరికోసమంటూ సూటిగా నిలదీశారు. గుడిసెలు వేసుకున్న పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వకుంటే పాలకులు బతికిబట్టకట్టలేరంటూ హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే వినరుభాస్కర్ ఈ గుడిసె వాసులకు అండగా ఉంటారా?లేదా? అనే విషయాన్ని తేల్చుకోవాలని సవాల్ విసిరారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నపుడు తమ పార్టీ నేతృత్వంలో భూపోరాటం చేశామని గుర్తు చేశారు. ఆ క్రమంలో ముదిగొండలో ఏడుగురిని తుపాకీతో కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉసురు వైఎస్‌కు తగిలిందన్నారు. విద్యుత్ ఉద్యమంలో ముగ్గుర్ని పొట్టనపెట్టుకున్న టీపీడీ ప్రభుత్వం మట్టికొట్టుకుపోయిందని అన్నారు. అలాంటి గతే టీఆర్ఎస్కు పట్టాలని కోరుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. పేదలకు మేలు చేసే ప్రభుత్వాలు కొన్ని కాలాలపాటు అధికారంలో ఉంటాయని చెప్పారు. వారికి నష్టం చేసే పార్టీలు అధికారం నుంచి దూరమవుతాయనీ, ప్రజలు వాటిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని హెచ్చరించారు. సీపీఐ(ఎం), వామపక్ష పార్టీలు మోసం చేసేవి కాదనీ, ప్రజల పక్షాన ఉంటాయని చెప్పారు. యూపీలో సీఎం యోగి బుల్డోజర్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోనూ బుల్డోజర్ ప్రభుత్వం కావాలా? అని అన్నారు. బీజేపీని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ పాలకులు హామీ ఇచ్చే వరకూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇండ్లు కట్టిస్తావా? గద్దెదిగుతావా? కేసీఆర్‌కు తమ్మినేని హెచ్చరిక
రాష్ట్రంలోని పేదలకు ఇండ్లు కట్టిస్తావా? గద్దెదిగుతావా?అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. బంగారు తెలంగాణ కాదనీ, బతుకు తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో పోడు భూముల కోసం ఆదివాసీలు, గిరిజనులు, ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పేదలు, హక్కుల కోసం, కనీస వేతనాల కోసం కార్మికులు, నష్టపరిహారం కోసం భూనిర్వాసితులు పోరాడుతున్నారని గుర్తు చేశారు. భూమి, ఇండ్ల స్థలాలు కావాలని అడిగుతున్న పేదలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని విమర్శించారు. కానీ కబ్జాలు చేసేవారినీ, భూములు కాజేసేవారిని మాత్రం ఇదే ప్రభుత్వం కాపాడుతున్నదని చెప్పారు. ప్రభుత్వ జాగాలో గుడిసెలు వేసుకుంటే పోలీసులు కూల్చివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల కాలం వస్తున్నదనీ, అప్పుడే ప్రజలు సర్కారుకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వాలనీ, ధరలు తగ్గించాలనీ, మహిళలకు రక్షణ ఇవ్వాలనీ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ పోరాడాలని పిలుపునిచ్చారు. మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాలకు గురికావొద్దని కోరారు. అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ప్రజా పోరాటాలకు ఎర్రజెండా అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో విద్యా,వైద్యం కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్నాయని విమర్శించారు. ఎర్రజెండా రాజ్యం ఉన్న దేశాల్లో అవి రెండూ ఉచితంగా అందుతున్నాయని గుర్తు చేశారు. ఆయా దేశాల్లో ధరలు అదుపులో ఉంటాయనీ, ఉపాధి అవకాశాలు ఎక్కువని అన్నారు. భారత్‌లోనూ ఎర్రజెండా రాజ్యం రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి నాగయ్య, బి వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, సీనియర్ నాయకులు జి రాములు, జిల్లా నాయకులు సారంపల్లి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.