Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు కేంద్రం కుట్ర
- బహుళ జాతి కంపెనీలకు ప్రజల్ని బానిసలుగా మార్చుతున్న మోడీ
- పెంచుతున్న ధరలు, పన్నులతో జనంపై భారం
- ఉద్యోగాలేమోకానీ, ప్రభుత్వ సంస్థలనమ్మి ఉపాధిని దెబ్బతీస్తున్నారు : టీపీసీసీ సత్యాగ్రహదీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆనాడు బ్రిటిష్ పాలకులను ఈ దేశం నుంచి ఏవిధంగా పారద్రోలమో, అలాగే ఇప్పుడు బీజేపీని తరిమికొడతామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. బహుళ జాతి కంపెనీల పార్టీగా మారిన బీజేపీని దేశం నుంచి పారద్రోలే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. ప్రశ్నించే గొంతులు, ప్రతిపక్షాలు, ప్రజల పక్షాన పోరాటాలు చేసే నాయకులు లేకుండా చేసేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ దుర్మార్గమైన ఆలోచనతోనే సోనియా, రాహుల్‌గాంధీలపై అక్రమ కేసులు బనాయించారనీ, అందులో భాగంగా ఈడీ విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ... మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదుగంటలకు వరకు దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ దేశాన్ని తాకట్టు పెట్టి రూ 80 లక్షల కోట్లు అప్పులు చేసిందని విమర్శించారు. దేశ సంపదను, వనరులను నచ్చిన వారికి ధారాదత్తం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. బహుళ జాతి కంపెనీ పార్టీగా మారిన బీజేపీ...దేశ పౌరులను మల్టీనేషనల్ కంపెనీలకు బానిసలుగా మారుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా క్షేత్రంలో మోడీ సర్కారును నిలదీస్తున్న ఏఐసీసీ అధ్యక్షులు సోనియా, జాతీయనేత రాహుల్‌గాంధీలపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించిందని విమర్శించారు. 'మేమిద్దరం. మాకిద్దరు అన్నట్టుగా మోడీ-అమిత్‌షా, అదానీ, అంబానీలు వ్యవహరిస్తున్నారు' అని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ఉపాధిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. నిత్యవసర వస్తువులు, చివరకు పసి పిల్లలు తాగే పాలపై కూడా జీఎస్టీ పన్ను విధించడంతో ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు పడుతు న్నాయని వివరించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. బీజేపీ చేస్తున్న అవినీతి, అక్రమాలు బయటపడకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే తమ నాయకులపై అక్రమకేసులు నమోదు చేసిందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన అధికారిని ఈడీ డైరెక్టర్‌గా నియమించి మూసేసిన నేషనల్ హెరాల్డ్ కేసును బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తెరిచిందన్నారు. నష్టాల్లో ఉన్న హెరాల్డ్ సంస్థను కాంగ్రెస్ కాపాడుకుంటే, మనీ లాండరింగ్ జరిగిందంటూ బీజేపీ సర్కారు తప్పుడు కేసు నమోదు చేసిందని ఆరోపించారు.
దేశానికి స్వాతంత్రం తెచ్చి, నవభారత నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. 'కాంగ్రెస్ నాయకులం, కార్యకర్తలం హైదరా బాద్ వదిలి గ్రామాలకు వెళ్దాం. ఇంటింటికి వెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వారి అవినీతి పాలన గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచారం చేద్దాం' అని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై కాంగ్రెస్ జెండా ఎగేరయాని కోరారు. దీక్షలో పార్టీ నేతలు బోసు రాజు, అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, కొండ సురేఖ, బలరాం నాయక్, సంభాని చంద్రశేఖర్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, అజ్మతుల్లా హుసేన్, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మెన్లు తదితరులు మాట్లాడారు.
కాంగ్రెస్ దీక్షలో గద్దర్
కాంగ్రెస్ నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ప్రజాగాయకులు గద్దర్ పాల్గొన్నారు. ఇటీవల బీజేపీ బహిరంగ సభలో కనిపించిన గద్దర్...కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలోనూ కనిపించారు. ఆడిపాడారు. సత్యాగ్రహ దీక్షను మరింత ఉత్సాహపరిచారు.
నేడు జిల్లాల్లో దీక్షలు : కాంగ్రెస్ పిలుపు
ఈడీ విచారణను నిరసిస్తూ బుధవారం ఆయా జిల్లాల్లో సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఒక చారిత్రాత్మక ప్రాంతాన్ని ఎంచుకుని దీక్షలు చేపట్టాలని కోరారు.