Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలగని వరద ప్రమాదం
- వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపివ్వని వాన
- ఇండ్లల్లోకి నీరు, పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులు
- జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
- ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
నవతెలంగాణ - విలేకరులు
వరద ముప్పు నుంచి ప్రజలు బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఒకటి రెండ్రోజులు కొంత ఒరుపు ఇస్తున్న వాన మళ్లీ కురుస్తోంది. రెండ్రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వికారాబాద్ జిల్లాలో వర్షం ఎడతెరిపి ఇవ్వడం లేదు. గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఇండ్లల్లోకి వరద నీరు చేరింది. వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షం.. వరదల నేపథ్యంలో కలెక్టర్ సమీక్షించి బుధవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించాయి. వికారాబాద్ జిల్లా పరిగి, నవాబుపేట, తాండూర్, కొడంగల్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వికారాబాద్ పట్టణంలోని కలెక్టరేట్‌లోకి వరద నీరు చేరింది. పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ కాలనీల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. కడ్మూర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ వాగులో రెండు ఎద్దులు కొట్టుకుపోయాయి. అక్కడే బందోబస్తులో కానిస్టేబుల్ వాటిని కాపాడారు. ధరూర్ మండలం నాగారాం, మైలారం మధ్య ఉన్న కల్వర్టు వర్షానికి కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మర్పల్లి మండలంలో పత్తి, మొక్కజొన్న, వరి పంటలు నీటమునిగాయి. సుమారు 5వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని మండల వ్యవసాయ అధికారి వసంత తెలిపారు. పరిగి మండలంలోని నస్కల్ వాగు పొంగడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లక్నాపూర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది.
తాండూర్ - కొడంగల్ మధ్యలో ఉన్న కాగ నది పాత బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. యాలాల్ మండలంలోని కోకట్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నవాబుపేట మండలం చింతలపేట వద్ద మూసీ నది ఉప్పొంగుతోంది. పూడూర్ మండలంలో భారీ వర్షాలకు ఈసీ వాగు ఉధృతంగా ప్రహహిస్తోంది. 1995 తర్వాత మళ్లీ ఈసీ వాగు ఇప్పుడు ఉగ్రరూపం దాల్చింది. కడమూర్, పుడుగుర్తి, గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వికారాబాద్ పట్టణంలోని బార్సు ప్రభుత్వ పాఠశాల క్లాస్ రూమ్స్‌లో వర్షపు నీరు చేరింది. ధన్నారం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కలెక్టర్ నిఖిల పరిశీలించారు. అధిక వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు. వాగుల వద్ద జాలర్లను, ప్రజలను అనుమతించొద్దన్నారు. రాత్రిపూట ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దారులను మూసేయాలని సూచించారు.
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపి లేని చిరు జల్లులు పడుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి రాత్రి ఏడు గంటలకు 42 అడుగుల వద్ద నిలకడగా ఉంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్య 407 అడుగులు కాగా 401వరకు నీరు చేరుకుంది. రాత్రి 9 గంటల తరువాత గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పాలేరు రిజర్వాయర్ నిండు కుండను తలపిస్తోంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 4 మి||మీ||ల వర్షపాతం నమోదైంది. రెండ్రోజులుగా ముసురు వర్షాల వల్ల పనులు ముందుకు సాగడం లేదు. వర్షాలకు పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 24 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 21 వేల క్యూసెక్కుల నీటిని ఉపయోగించి 2 యూనిట్లలో 78 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881 అడుగులకు చేరింది.
వర్షాల నేపథ్యంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలంలోని ఎర్రగుంట గ్రామానికి వెళ్లే దారిలో ఉచ్చామల్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జిల్లా అదనపు కలెక్టర్ చాహాథ్ బాజ్ పారు ట్రాక్టర్‌పై గ్రామానికి వెళ్లారు. పారిశుధ్య పనులను పరిశీలించారు.